ఫ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం
ఫ రూ.44,30,100,
పది కాసుల బంగారం వసూలు
ఫ కపిలేశ్వరపురం మండలం
టేకిలో ఘటన
ఫ అంగర పోలీస్ స్టేషన్‌లో
బాధితురాలి ఫిర్యాదు
కపిలేశ్వరపురం: భర్తను కోల్పోయిన ఆపదలో ఉన్న మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పాడో మోసగాడు. ఆమెతో పాటు ఆమె మరిదికి సైతం ఆశ చూపి రూ.44,30,100, పది కాసుల బంగారు ఆభరణాలను కాజేశాడు. అంగర ఎస్సై జి.హరీష్ కుమార్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. 2022లో గుండె పోటు కారణంగా భర్తను కోల్పోయిన ఓ మహిళ తన పుట్టిల్లు టేకిలో ఉంటున్నారు. పింఛను కోసం దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ సచివాలయానికి వెళ్లినప్పుడు అదే గ్రామానికి చెందిన గన్ని శ్రీనివాస్ ఆమెకు పరిచయమయ్యాడు.
పింఛను మంజూరు కోసం హౌస్ హోల్డ్ మ్యాప్‌లో నుంచి ఆమె భర్త పేరును తొలగించేందుకు రూ.10 వేలు తీసుకుని మోసగించాడు. వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగం ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశ చూపాడు. ఆ ఉద్యోగానికి డిగ్రీ సర్టిఫికెట్ చేయించేందుకంటూ ఆమె వద్ద 2025 మార్చి 21న కొంత నగదు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించే ప్రక్రియలో కదలిక వచ్చిందంటూ 2025 మార్చిలో పలు విడతలుగా మరికొంత వసూలు చేశాడు. అనంతరం వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని రికమెండేషన్ కారణంగా వేరే వాళ్లకు ఇచ్చేశారని నాటకం ఆడాడు. మండపేట మండల పరిషత్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టు ఇప్పిస్తానని, అందుకు రూ.36 లక్షలు ఖర్చు అవుతుందని, ఖర్చుకు తగ్గట్టే పెద్ద జీతం వస్తుందని నమ్మబలికాడు. బాధిత మహిళతో పాటు ఆమె మరిదికి కూడా ఉద్యోగం ఇప్పిస్తానంటూ అతడి వద్ద కూడా నగదు తీసుకున్నాడు. ఇద్దరి ఉద్యోగాలు కోసం అంటూ పలు విడతలుగా రూ.44,30,100, పది కాసుల బంగారం తీసుకున్నాడు. అయితే.. డబ్బులు, బంగారం ఇచ్చినా ఉద్యోగాలు రాకపోవడంతో విసిగిపోయిన బాధితులు ఈ ఏడాది ఆగస్టు 25న శ్రీనివాస్‌ను నిలదీశారు. చివరకు ఈ నెల 2న అంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.


