తిరుగు ప్రయాణం.. తీరని విషాదం | - | Sakshi
Sakshi News home page

తిరుగు ప్రయాణం.. తీరని విషాదం

Sep 5 2026 12:26 AM | Updated on Sep 5 2026 12:26 AM

కొబ్బరిచెట్లను ఢీకొన్న కారు

స్వగ్రామానికి వస్తూ అన్నదమ్ముల మృతి

శోక సంద్రంలో లక్కవరం

మలికిపురం: అన్నదమ్ములైన వారిద్దరూ ఒకే మాట, ఒకే బాటగా పెరిగారు. వ్యవసాయం, వ్యాపారం ఇలా అన్ని విషయాల్లో కలిసికట్టుగా ముందుకు సాగారు. చివరకు కారులో కలిసి వస్తూనే మృత్యుఒడికి చేరారు. లక్కవరంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. లక్కవరానికి చెందిన ముదునూరి గోపాలకృష్ణంరాజు దంపతులకు రామభద్రరాజు (రాంబాబు రాజు), వెంకట సుబ్బరాజు (శ్రీనివాసరాజు) కుమారులు. వీరిలో రాంబాబు రాజు, విజయలక్ష్మి మాధురి దంపతులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బంధువుల ఇంట గురువారం రాత్రి జరిగిన పెళ్లికి వెళ్లారు. అలాగే శ్రీనివాసరాజు, శారద దంపతులు తమ కుమార్తెను బెంగళూరులో అమెరికా విమానం ఎక్కించేందుకు వెళ్లి గురువారం రాత్రి రైలులో భీమవరం బయలుదేరారు. ఈ నేపథ్యంలో పెళ్లి పూర్తయిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున రాంబాబు రాజు దంపతులు కారులో భీమవరం రైల్వే స్టేషన్‌కు వెళ్లి, బెంగళూరు నుంచి వచ్చిన శ్రీనివాసరాజు దంపతులను ఎక్కించుకుని, లక్కవరం బయలు దేరారు. మరో ఒక్క నిమిషంలో ఇంటికి చేరతామనగా స్వగ్రామంలోనే ప్రధాన రహదారి ప్రక్కనే కొబ్బరి చెట్లను కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అన్నదమ్ములిద్దరి తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన తోడికోడళ్లను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాంబాబు రాజు, శ్రీనివాసరాజు మృతదేహాలను రాజోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజోలు సీఐ వి.సురేష్‌ బాబు, మలికిపురం ఎస్సై మోహన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రికి మార్చురీకి తరలించారు.

విదేశాల్లో పిల్లలు : రామభద్రరాజుకు సందీప్‌, పృథ్వీరాజ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నాయి. వీరు వివాహాలు చేసుకుని అమెరికాలో ఉంటున్నారు. శ్రీనివాసరాజుకు సాహితి, మహితి ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఇరువురూ కెనడాలో నివాసం ఉంటున్నారు. ప్రమాద విషయం తెలిసిన వీరంతా విదేశాల నుంచి తమ స్వస్థలానికి బయలు దేరారు. కాగా.. వీరిలో మహితి ఇటీవల తల్లిదండ్రుల వద్దకు రావడంతో తిరిగి ఆమెను కెనడా పంపేందుకు శ్రీనివాసరాజు దంపతులు బెంగళూరు విమానాశ్రయానికి తీసుకెళ్లారు. ఆమె గురువారం విమానం ఎక్కిన తర్వాత తల్లిదండ్రులు బెంగళూరులో ట్రైన్‌ ఎక్కి ఇంటికి బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె విమానం అక్కడ దిగగా, అదే రోజు ఉదయం ఆమె తండ్రి శ్రీనివాసరాజు ప్రమాదంలో చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement