మూడు టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

మూడు టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

Sep 5 2026 12:26 AM | Updated on Sep 5 2026 12:26 AM

గోకవరం: వ్యాన్‌లో తరలిస్తున్న మూడు టన్నుల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖ, తూనికలు, కొలతలు అధికారులు సంయుక్తంగా శుక్రవారం ఉదయం ఓ వ్యాన్‌ను వెంబడించారు. అది గాదెలపాలెంలో అయ్యప్ప ట్రేడర్స్‌ రైసుమిల్లు వద్దకు చేరుకోవడంతో అక్కడి సీజ్‌ చేసి, దానిలోని 60 బస్తాల్లో ఉన్న సుమారు మూడు టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, సీజ్‌ చేసిన బియ్యాన్ని కోరుకొండ ఎమ్‌ఎల్‌ఎస్‌ పాయింట్‌కు, వ్యాన్‌ను గోకవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన రేషన్‌ బియ్యం విలువ సుమారు రూ.1.44 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే రైసుమిల్లులో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో విజిలెన్స్‌ సీఐలు శేఖర్‌బాబు, గోపాలకృష్ణ, ఏఎస్‌ఓ నాగాంజనేయులు, ఎమ్‌ఎస్‌ఓ శాంతి, స్థానిక రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

రుణం పేరుతో

సైబర్‌ మోసం

ద్వారకా తిరుమల: ఓ ఫైనాన్స్‌ కంపెనీ పేరుతో వచ్చిన ఫేక్‌ కాల్‌ను నమ్మిన ఓ వ్యక్తి సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి పంచాయతీ ద్వారకానగర్‌కు చెందిన గాంచి కిషోర్‌ కుమార్‌కు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కాల్‌ వచ్చింది. ఆయనకు రూ.50 వేల రుణం మంజూరైందని, అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ కోసం ముందుగా రూ.650 పంపాలని, ఆ తర్వాత రూ.2,975 చెల్లిస్తే రుణం విడుదల అవుతుందని చెప్పారు. ప్రాసెసింగ్‌ కోసం చెల్లించిన సొమ్మును కూడా కలిపి ఇస్తామని చెప్పారు. దీంతో కిషోర్‌కుమార్‌ రెండు దఫాలుగా వారు పంపిన స్కానర్‌కు డబ్బు చెల్లించాడు. కొద్దిసేపటికి రూ.50,520 రుణం మంజూరైనట్టు సైబర్‌ ఫోన్‌కు ఫేక్‌ మెసేజ్‌ వచ్చింది. అయితే నగదు విడుదల కావాలంటే జీఎస్టీ కోసం మరో రూ.5 వేలు చెల్లించాలని సూచించారు. దీంతో అనుమానం కలిగిన కిషోర్‌ కుమార్‌ సాయంత్రం భీమడోలు పోలీసులను ఆశ్రయించాడు. అప్పుడే సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు తెలుసుకుని లబోదిబోమన్నాడు. పోలీసులు సైబర్‌ క్రైమ్‌ కింద కేసు నమోదు చేశారు.

బాల్య వివాహ

ఘటనపై కేసు

కోటనందూరు: మండల పరిధిలో జరిగిన ఓ బాల్య వివాహ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ శుక్రవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో బాలికకు వివాహం జరగబోతున్నట్లు అందిన సమాచారంతో మహిళా సంరక్షణ కార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, చైల్డ్‌ ప్రొటెక్షన్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సిబ్బంది బాలిక కుటుంబ సభ్యులతో మా ట్లాడారు. బాల్య వివాహం నేరమని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కానీ ఆగస్టు 30న బాలికకు కుటుంబ సభ్యులు వివాహం చేసేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు బాలిక కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement