అక్రమాల పుట్టగా మెగా డీఎస్సీ
ముఖ్యనేత భరోసా, అండదండలతోనే నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల విక్రయాలు!
కీలక నేత ఆధ్వర్యంలో టీచర్ పోస్టులకు బేరసారాలు..
‘సాక్షి’ కథనంతో చంద్రబాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి
ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరుతో పాటు పలు జిల్లాల్లో విద్యాశాఖాధికారుల విచారణ
తాజాగా టెట్, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై రహస్యంగా విచారణ.. అంటే దీని అర్థం గతంలో వెరిఫికేషన్ జరగలేదనే కదా!
1:1 నిష్పత్తిలో అభ్యర్థులను వెరిఫికేషన్‌కు ఎందుకు పిలిచినట్లు?
టెట్‌లో క్వాలిఫై కాకపోయినా, అర్హత లేదని తెలిసి కూడా టీచర్ పోస్టు ఎలా ఇచ్చారు?
దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన అభ్యర్థి ఇన్ని దశలు దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు?
దీని వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరు?
అసలు పరీక్షే లేకుండా ఇలా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తారా?
స్పోర్ట్స్ కోటా ముసుగులో ఇష్టారాజ్యంగా జీవోలు ఏమిటి?
చంద్రబాబు సర్కారుపై మండిపడుతున్న విద్యావేత్తలు, ప్రజాసంఘాలు, బాధిత అభ్యర్థులు
మెగా డీఎస్సీ టీచర్లలో ఆందోళన.. లోకేశ్ యువగళం టీమ్ ముఖ్య నేతలతో సంప్రదింపులు
కర్నూలులో స్పోర్ట్స్ సర్టిఫికెట్ల విక్రయదారులతో కొందరు మెగా డీఎస్సీ టీచర్ల సమావేశం!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మెగా డీఎస్సీ 2025 అక్రమాల డొంక కదులుతోంది. ఇప్పటికే స్పోర్ట్స్ కోటా ముసుగులో ఇష్టారాజ్యంగా జీవోలిచ్చి అక్రమాలకు గేట్లు ఎత్తడం.. అసలు పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలను కట్టబెట్టడం.. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లకు పోస్టులు ఇవ్వడం లాంటి అక్రమాలు బహిర్గతం కాగా, తాజాగా టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్)లో కనీసం క్వాలిఫై కూడా కాకుండానే ఉద్యోగాల్లో నియమించినట్లు తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. సాక్షి కథనంతో ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలో తెలియక సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖాధికారులు ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను పరిశీలిస్తున్నారు.
మరోవైపు శుక్రవారం ఉదయం పలువురు మెగా డీఎస్సీ టీచర్లు స్పోర్ట్స్ సర్టిఫికెట్ల విక్రయదారులతో కర్నూలులో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీలో అక్రమాలకు ఇవన్నీ నిదర్శనాలని, సీబీఐతో విచారిస్తే నివ్వెరపోయే నిజాలు బహిర్గతం కావడం ఖాయమని విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘మెగా డీఎస్సీలో రాత పరీక్ష అనంతరం 1 : 1 నిష్పత్తిలో అభ్యర్థులను వెరిఫికేషన్‌కు ఎందుకు పిలిచినట్లు? మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా నియమించిన వారి సర్టిఫికెట్లను తాజాగా రహస్యంగా వెరిఫికేషన్ చేస్తున్నారంటే... దీని అర్ధం గతంలో వెరిఫికేషన్ జరగలేదనే కదా!
టెట్‌లో క్వాలిఫై కాకపోయినా, అర్హత లేదని తెలిసి కూడా టీచర్ పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన అభ్యర్థి ఇన్ని దశలు దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? దీని వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరు..?’ అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. చంద్రబాబు సర్కారు ఇంకా బుకాయించకుండా మెగా డీఎస్సీ ప్రక్రియపై సీబీఐ విచారణకు సిద్ధపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి రావడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సవాల్ విసిరినట్లుగా మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు అంగీకరించాలని, ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని విద్యావేత్తలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
స్వయంగా ప్రభుత్వ విచారణలో బట్టబయలు..
ముఖ్యనేత భరోసాతో మెగా డీఎస్సీ నియామకాల్లో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, టెట్ క్వాలిఫై కాకుండానే లోకేశ్ యువగళం సభ్యులకు టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టిన విషయం వెలుగు చూసింది. ఇన్నాళ్లూ మెగా డీఎస్సీలో అక్రమాలు జరగలేదంటూ బుకాయించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయారు. కర్నూలు జిల్లాలో టెట్ క్వాలిఫై కాకుండానే స్పోర్ట్స్ కోటాలో జి.ప్రభాకర్ అనే వ్యక్తి టీచర్ ఉద్యోగం పొందడం.. అధికారుల విచారణలో ఇది వాస్తవమేనని తేలడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇదే తరహాలో మెగా డీఎస్సీలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో విద్యా శాఖ మంత్రి లోకేశ్‌తోపాటు చంద్రబాబు సర్కారుపై నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, జెన్‌జీ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది.
టీడీపీ నేతల గుప్పిట్లో సంఘాల నుంచి ఫేక్ సర్టిఫికెట్లు..!
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు ప్రకంపనలు సృష్టిస్తుండటంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు సర్కారు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖాధికారులు విచారణ మొదలు పెట్టారు. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను యుద్ధ ప్రాతిపదికను తెప్పించుకుంటున్నారు. టెట్ క్వాలిఫై అయ్యారా? లేదా? ఎలాంటి స్పోర్ట్స్ సర్టిఫికెట్ పెట్టారు? సదరు సర్టిఫికెట్ ఎక్కడనుంచి తెచ్చారు? అనే వివరాలను ఆరా తీస్తున్నారు. దాదాపు అన్ని స్పోర్ట్స్ సర్టిఫికెట్లు టీడీపీ ప్రజా ప్రతినిధులు పర్యవేక్షిస్తున్న అసోసియేషన్ల నుంచి పొందినట్లు విచారణలో ప్రాథమికంగా వెల్లడైందని కర్నూలు విద్యాశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

ముఖ్యనేత అండదండలతో..
ముఖ్యనేత అండదండలు, భరోసాతో చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి క్రీడా సంస్థ నేత మెగా డీఎస్సీ నకిలీ సర్టిఫికెట్ల పంపిణీ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని అధికారుల దృష్టికి వచ్చి నట్లు తెలుస్తోంది. లోకేశ్ యువగళం యాత్రలో ఆయన చురుగ్గా వ్యవహరించారు. యువగళం సభ్యులు మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందేందుకు తన పదవిని అడ్డుపెట్టి బోగస్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయి. ముఖ్యనేత అండదండలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తన అనుచరులను ఏర్పాటు చేసుకుని నకిలీ సర్టిఫికెట్లు సరఫరా చేసినట్లు సమాచారం.
ముఖ్యనేత భరోసాతో అనుచరుల ద్వారా నకిలీ సర్టిఫికెట్ల విక్రయాలు..
ముఖ్యనేత భరోసా లభించడంతో కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు నెల్లూరుకు చెందిన మల్లిఖార్జున అనే వ్యక్తి నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ప్రైవేట్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు దూరవిద్యా కేంద్రంలో పనిచేస్తున్న మరోవ్యక్తి కలసి చిత్తూరు నేత నుంచి పెద్ద ఎత్తున స్పోర్ట్స్ నకిలీ సర్టిఫికెట్లు తెచ్చి విక్రయించినట్లు తెలుస్తోంది. వీరంతా అనంతపురం, చిత్తూరుకు చెందిన రెండు ముఠాలతో కలిసి మెగా డీఎస్సీ అభ్యర్థులకు నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్మకానికి పెట్టారు.
చిత్తూరు నేతతో సంబంధాలు ఏర్పరచుకున్న గుంటూరుకు చెందిన మరో ముఠా కూడా అభ్యర్థులకు బోగస్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు తెచ్చి అభ్యర్థులకు విక్రయించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో పలువురికి దొడ్డి దారిలో టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలో ముఖ్యనేత అండదండలు, భరోసా లేకుండా ఈస్థాయిలో అక్రమాలు జరిగేందుకు ఆస్కారం లేదని అంటున్నారు.
అప్పుడు.. ‘బీసీ’ ఇప్పుడు.. ‘ఈడబ్ల్యూఎస్’
మెగా డీఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల్లో లీలలు
కర్నూలు సిటీ: 2018లో బీసీ కేటగిరీలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులు.. తాజాగా మెగా డీఎస్సీ 2025లో ఈడబ్ల్యూఎస్ విభాగంలో దరఖాస్తు చేసుకోవడంతోపాటు టీచర్లుగా ఎంపిక కావడం గమనార్హం. గతంలో బీసీ సర్టిఫికెట్ సమర్పించిన శకునాల కేశవులు మెగా డీఎస్సీలో మాత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందిన జుమ్మలదిన్నె జడ్పీ హైసూ్కల్‌లో పని చేస్తున్నారు. ఏకంగా కులం మారిపోవడం.. ఇష్టారాజ్యంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాల్లో చేరడం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లాలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇలా టీచర్లుగా నియమించిన వారిలో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో ఆరుగురు, చాగలమర్రి మండలంలో ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్రంగా విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
» 2018 డీఎస్సీలో బీసీ–బీ కింద దరఖాస్తు చేసుకున్న ఓ మహిళా అభ్యర్థి... మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ కోటాలో టీచర్ ఉద్యోగం పొంది కోసిగి జడ్పీ హైసూ్కల్‌లో పని చేస్తున్నారు.
» 2018 డీఎస్సీలో బీసీ–బీ కింద దరఖాస్తు చేసుకున్న మరో మహిళా అభ్యర్థి.. మెగా డీఎస్సీలో మాత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొంది పొదలకుంట్ల ఎంపీపీఎస్‌లో పని చేస్తున్నారు.
» గతంలో బీసీ–డీ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న ఓ మహిళ మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌తో ఎంపికై కౌతాళం మండలం ఉరుకుంద జడ్పీ హైసూ్కల్‌లో పని చేస్తున్నారు.
» గతంలో బీసీ–బీ సర్టిఫికెట్ సమర్పించిన మరో మహిళ.. మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్‌లో టీచర్ ఉద్యోగం పొంది కోసిగి ఎంపీపీఎస్ స్కూల్‌లో పని చేస్తున్నారు.
కర్నూలులో మెగా డీఎస్సీ టీచర్ల సమావేశం..!
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలో 24 మంది స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందగా నియోజకవర్గంలోని వల్లూరు పాఠశాలలో ఐదుగురిని ఇదే కోటాలో టీచర్ పోస్టుల్లో నియమించారు. వల్లూరు ఎంపీపీ స్కూల్‌లో టెట్ క్వాలిఫై కాకుండానే స్పోర్ట్స్ కోటాలో ప్రభాకర్‌ను ఎస్‌జీటీ టీచర్‌గా నియమించినట్లు తాజాగా తేలడం.. అధికారుల విచారణలో అక్రమాలు నిజమేనని నిర్థారణ కావడం తీవ్ర సంచలనం రేపింది. ఇదే తరహాలో పలువురిని నియమించినట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. విద్యాశాఖ విచారణతో మెగా డీఎస్సీ ద్వారా నియమించిన వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పలువురు మెగా డీఎస్సీ టీచర్లు స్పోర్ట్స్ సర్టిఫికెట్ల విక్రయదారులతో కర్నూలులో సమావేశమైనట్లు తెలుస్తోంది.
ఆందోళనతో యువగళం టీమ్ వద్దకు..!
చిత్తూరులో కొందరు నకిలీ స్విమ్మింగ్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందగా వారిలో చాలామంది టెట్ క్వాలిఫై కాలేదని సమాచారం. కడపలో స్పోర్ట్స్ కోటాలో పలువురు టెట్ క్వాలిఫై కాకుండానే ఉద్యోగాలు పొందగా ఇందులో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలుతోపాటు సంతనూతలపాడు, దర్శి ప్రాంతాలకు చెందిన కొందరు ఇదే తరహాలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందినట్లు అనుమానాలున్నాయి. విద్యాశాఖ అంతర్గత విచారణతో ఆందోళనగా వీరంతా ఉద్యోగాలిప్పించిన లోకేశ్ యువగళం టీమ్ ముఖ్య నేతలను నిలదీస్తునట్టు సమాచారం.
నకిలీ సర్టిఫికెట్లతో ప్రిన్సిపాల్ ఉద్యోగాలు..!
ఏపీ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో పోస్టులకు నకిలీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టి కొందరు ప్రిన్సిపాల్ ఉద్యోగాలను పొందినట్లు సమాచారం. వీరిలో చాలామంది నెల్లూరు, అనంతపురం, గుంటూరు ప్రాంతాల ముఠాల నుంచి బోగస్ సర్టిఫికెట్లు పొందినట్లు తెలుస్తోంది. మెడికల్ రిప్రెంజెంటేటివ్‌గా పనిచేస్తున్న కర్నూలుకు చెందిన వ్యక్తితోపాటు డోన్‌కు చెందిన మరొకరు నందికొట్కూరు ప్రాంతంలోని ప్రైవేటు బీఈడీ కళాశాల నుంచి బోగస్ సర్టిఫికెట్లతో ప్రిన్సిపల్ ఉద్యోగం పొందినట్లు సమాచారం.


