ప్రభుత్వం విడుదల చేసిన రైల్వేలైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అదనపు భూ సమీకరణ మ్యాప్
రైల్వేలైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో వేల ఎకరాల భూ సమీకరణకు సర్కారు ఎత్తుగడ
లింగమనేని, హెరిటేజ్ భూములను సమీకరణకు మినహాయించి పేదల నోళ్లు కొట్టేందుకే అంటున్న రైతులు
కంతేరు, తాడికొండ రైతుల భూములకు ఎసరు.. కొప్పురావూరును మినహాయించడంపై మండిపాటు
సమావేశాల్లో వ్యతిరేకించినా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ఫైర్
అదనపు భూ సమీకరణపై ఫిర్యాదు చేసేందుకు రైతులు సమాయత్తం
తాడికొండ: రాజధాని రైతుల్లో పూలింగ్ గుబులు మొదలైంది. రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాలతోపాటు రాజధాని వైపు ఉన్న భూముల అదనపు సేకరణకుగాను మంత్రివర్గ సమావేశం అనంతరం గురువారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రైల్వేలైన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు పేరుతో తాడికొండ, కంతేరు, కొప్పురావూరు గ్రామాల్లో అధికారులు ఇప్పటికే సాధారణ గ్రామసభ సమావేశాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించారు. తాడికొండతోపాటు కంతేరు గ్రామ ప్రజలు కూడా మూకుమ్మడిగా తాము రైల్వేలైన్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూములు ఇస్తామని, అదనంగా భూమి సమీకరణకు తాము వ్యతిరేకమని తేల్చిచెప్పారు.
ఇవేమీ పరిగణనలోకి తీసుకోని ప్రభుత్వం, అధికారులు అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులతో చర్చించి రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి ప్రత్యేకాధికారులతో అనుకూలంగా తీర్మానం చేయించుకుని నోటిఫికేషన్ ఇచ్చిన వైనంపై రైతులు రగిలిపోతున్నారు. గ్రామసభ సమావేశాల్లో సైతం అదనపు సమీకరణను వ్యతిరేకిస్తున్నట్లు తాము ఎమ్మెల్యే, మంత్రి నారాయణ సాక్షిగా చెప్పామని.. అయినా, నోటిఫికేషన్ ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో భూములిచ్చిన రైతులకే ఇంతవరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని.. కనీసం డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, తాగునీరు సౌకర్యాలు సైతం కల్పించకపోవడంతో ఆ రైతులు ఇప్పటివరకు తమ ప్లాట్లు ఎక్కడున్నాయో అర్ధంకాక ఆందోళన చెందుతుంటే మళ్లీ తమ భూములకు ఎసరు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ఆందోళన చెందుతున్నారు.
పేదల నోట్లో మట్టికొట్టేందుకే..
ఇదిలా ఉంటే.. రైల్వేలైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో వేల ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం ఎత్తుగడ వేసిందని, లింగమనేని, హెరిటేజ్ భూములు సమీకరణకు మినహాయించి పేదల భూములకే బౌండరీ వేసి మరీ సమీకరణ చేయడం పేదల నోట్లో మట్టికొట్టేందుకేనని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వైఖరి చూస్తుంటే ఓ విధానం అంటూ లేకుండా ఉందని.. రైల్వేలైన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న కంతేరు, తాడికొండ రైతుల భూములకు ఎసరు పెట్టి కొప్పురావూరు గ్రామ భూములను మినహాయించడం వెనుక ఉన్న మతలబు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ అదనపు భూ సమీకరణకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్, సీఆర్డీయే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే దిశగా రైతులు సమాయత్తం అవుతున్నారు. దీనిపై వచ్చే సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.


