ప్రకాశం జిల్లా పొలాల్లో దివ్యతేజ మృతదేహం లభ్యం
అతన్ని జె.పంగులూరు పోలీసులే తీవ్రంగా కొట్టారు
లాకప్‌లో చంపేసి శవాన్ని పొలాల్లో పడేశారు
మేము జె.పంగులూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లగానే ఎస్సై కంగారు పడ్డారు
దివ్యతేజను తీసుకెళ్లలేదన్నారు
కోర్టులో పిటిషన్ వేసిన గంటలోనే మృతదేహం ఎక్కడుందో చెప్పారు
పిటిషన్ వేయకపోతే మృతదేహాన్ని కూడా ఇచ్చేవారు కాదు
ఒంగోలు జీజీహెచ్ వద్ద కన్నీరుమున్నీరైన తల్లి, చెల్లి
ఒంగోలు టౌన్: చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగానికి బిడ్డను పోగొట్టుకున్న మరో తల్లి కన్నీరు పెట్టుకుంది. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బి.బిట్రగుంట మండలం అల్లిమడుగు సంగం గ్రామానికి చెందిన మల్లి దివ్యతేజ తల్లి సలోమీ తన కుమారుడిని పోలీసులే పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరయింది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తమను ఏం చేసినా చెల్లుతుందన్న అహంకారంతోనే పోలీసులు దివ్యతేజను నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపారని అతని చెల్లెలు శ్రీనిధి వాపోయింది.
దివ్యతేజను ప్రకాశం జిల్లా జె.పంగులూరు పోలీసులు శనివారం రాత్రి 12 గంటల సమయంలో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారని, ఆ దెబ్బలకు లాకప్‌లోనే చనిపోయాడని, ఆ తరువాత పంట పొలాల్లో పడేశారని సలోమీ, శ్రీనిధి ఆరోపించారు. దివ్య తేజ మృతదేహం జె.పంగులూరు మండలం రేణింగవరం–కొండమూరు గ్రామాల మధ్య పొలాల్లో గురువారం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని శుక్రవారం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడకు వచ్చి న హతుడి తల్లి సలోమీ, చెల్లెలు శ్రీనిధి మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. దివ్యతేజను పోలీసులే కొట్టి చంపారని ఆరోపించారు.

దివ్యతేజ
బాధితుల కథనం ప్రకారం.. మల్లి దివ్యతేజ (34) గత శనివారం రాత్రి దాబాకు వెళ్లి భోజనం చేసి వస్తానంటూ తల్లి సలోమీ వద్ద డబ్బులు తీసుకొని స్నేహితుడు సాతపాటి శశికాంత్‌తో కలిసి బయలుదేరాడు. రాత్రి 12 గంటలకు ప్రకాశం జిల్లా జె.పంగులూరు పోలీసులు వారిని పట్టుకెళ్లారు. శశికాంత్‌ను వదిలి పెట్టిన పోలీసులు దివ్యతేజ పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి అతను కనిపించలేదు. అనుమానం వచ్చి న తల్లి సలోమీ, సోదరి శ్రీనిధి నెల్లూరు జిల్లా కావలి పోలీసు స్టేషన్‌కు వెళ్లి సీఐకు ఫిర్యాదు చేశారు.
జె.పంగులూరు తన పరిధిలో లేదు కనుక అక్కడకు వెళ్లి పోలీసులను కలవమని ఆయన సలహా ఇచ్చారు. దాంతో బాధితులు జె.పంగులూరు ఎస్సైని కలవగా.. శశికాంత్ ఒక్కడినే పట్టుకున్నామని, దివ్యతేజ సంగతి తెలియదని చెప్పారు. ఆ సమయంలో ఎస్సై కంగారుపడినట్లు వారు గమనించారు. ఈనెల 1వ తేదీ వరకు పోలీసుల నుంచి సమాచారం లేకపోవడంతో మిస్సింగ్ కేసు పెట్టారు. దివ్యతేజ ఆచూకీ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ సమాచారం తెలిసిన గంటకే పోలీసులు లాయర్‌కు ఫోన్ చేసి కండమూరు పొలాల్లో దివ్యతేజ మృతదేహం ఉన్నట్లు గుర్తించామని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడకు వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో దివ్యతేజ మృతదేహం పొలాల్లో పడి ఉంది. దెబ్బలతో ఒళ్లంతా కమిలిపోయి ఉన్నట్లు గమనించారు. ఇవన్నీ పోలీసులు కొట్టిన దెబ్బలేనని, తన కుమారుడిని లాకప్‌లో కొట్టి చంపేశారంటూ సలోమీ విలపించారు.
మమ్మల్ని చూడగానే ఎస్సై కంగారుపడ్డారు: శ్రీనిధి
తాము హైకోర్టులో పిల్ వేయకపోతే తన అన్న మృతదేహాన్నీ పోలీసులు మాయం చేసేవారని దివ్యతేజ చెల్లెలు శ్రీనిధి కన్నీరు పెట్టుకుంది. జె.పంగులూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన తమను చూడగానే ఎస్సై కంగారు పడిపోయారని, భయంభయంగా మాట్లాడడంతో ఏదో జరిగిందన్న అనుమానం వచ్చి ందని తెలిపారు. తన సోదరుడు డిగ్రీ చదివాడని, ఐటీఐ చేశాడని చెప్పారు. ఆయనకు 4, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారని, భార్య చనిపోయిందని, ఆటో తోలుకుంటూ జీవిస్తున్నాడని వివరించింది. పోలీసులు తన అన్నను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని విలపించింది.
కోర్టుకు వెళ్లకపోతే శవం కూడా దొరికేది కాదు: నీలం నాగేందర్
బాధితులు హై కోర్టులో పిటిషన్ వేయకపోతే దివ్యతేజ మృతదేహం కూడా దొరికేది కాదని దళిత హక్కుల సంఘం నాయకుడు నీలం నాగేందర్ చెప్పారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, దళిత నాయకులు కాకుమాను రవి, కోలా జీవరత్నం, దేవరపల్లి గోపి, ఎర్రమల శ్రీనుతో కలిసి ఆయన జీజీహెచ్ వద్ద బాధిత కుటుంబంతో మాట్లాడారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ..పోలీసులు దివ్యతేజను లాకప్‌లోనే కొట్టి చంపారని, శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బాధితులు కోర్టులో పిటిషన్ వేసే దాకా మృతదేహం ఎక్కడ ఉందో కూడ చెప్పలేదన్నారు. దివ్యతేజ కంటి మీద, వీపు మీద, పొట్టమీద గాయాలున్నాయని, కాళ్లకు తాళ్లు కట్టి ఉన్నాయని తెలిపారు. దివ్యతేజ లాకప్‌డెత్ కేసులో వెంటనే ఎస్సైని సస్పెండ్ చేయాలని, కేసును గుంటూరు జిల్లా పోలీసు అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విచారణ జరుపుతున్నాం: దర్శి డీఎస్పీ
గత నెల 29వ తేదీ రాత్రి జె.పంగులూరు లిమిట్స్‌లో నైట్ బీట్‌లో ఉన్న పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి తప్పించుకొని వెళ్లి పోవడానికి ప్రయత్నించడంతో అనుమానం వచ్చి వెంటపడ్డారని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ తెలిపారు. మరుసటి రోజు శశికాంత్‌ను పోలీసులు పట్టుకున్నారని, రెండో వ్యక్తి పారిపోయాడని తెలిపారు. గురువారం మధ్యాహ్నం కండమూరు పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని, విచారణలో అది దివ్యతేజదిగా నిర్ధారించినట్లు తెలిపారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. బాధితుల ఆరోపణలో నిజం లేదన్నారు.


