ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో ఈ కోటా కింద మొదలైన వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటా (బీ, సీ/ఎన్‌ఆర్‌ఐ కేటగిరీ) కింద ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన తుది మెరిట్ జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) బుధవారం విడుదల చేసింది. నీట్‌లో అర్హత సాధించి, మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలతో రిజిస్ట్రార్ పేరిట ఈ జాబితాను ప్రకటించింది. మెరిట్ జాబితాలో ప్రణవ్ అభిజిత్ సాల్గర్కర్ (రోల్ నంబరు 13115202570) 590 మార్కులు సాధించి, ఆల్ ఇండియా ర్యాంకు 13,689తో తొలి స్థానంలో నిలిచారు.
జాబితా క్రమసంఖ్య 7,113 వరకు అభ్యర్థుల వివరాలు ఉన్నాయి. చివరి క్రమసంఖ్యలో మయూరేష్ ఫిర్కేవార్ 177 మార్కులతో, 11,94,890 ఆల్ ఇండియా ర్యాంకుతో ఉన్నారు. గత విద్యా సంవత్సరాల్లో మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు పొంది, కళాశాలల్లో చేరని కొంతమంది అభ్యర్థుల విషయంలో వర్సిటీ ప్రత్యేక నిబంధనలు అమలు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు జీఓఎంఎస్ నంబర్ 125 ప్రకారం ఆయా అభ్యర్థుల అర్హతలను పరిమితం చేసినట్టు మెరిట్ జాబితాలోని రిమార్క్స్‌లో పేర్కొంది.
కొందరికి కేవలం బీడీఎస్, మరికొందరికి కేవలం ఎంబీబీఎస్ ప్రవేశానికి మాత్రమే అర్హత ఉన్నట్టు స్పష్టం చేసింది. మెరిట్ జాబితాలో అభ్యర్థుల నీట్ ర్యాంకు, మార్కులు, స్థానిక, స్థానికేతర, మైనారిటీ, ఎన్‌ఆర్‌ఐ తదితర వివరాలను పొందుపరిచారు. అభ్యర్థులు తమ వివరాలను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.
వెబ్ ఆప్షన్లు షురూ: ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా (బీ, సీ/ఎన్‌ఆర్‌ఐ కేటగిరీలు) మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభిస్తూ వర్సిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తుది మెరిట్ జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు సెప్టెంబర్ 9 సాయంత్రం 5.30 గంటల నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 11 సాయంత్రం 4 గంటల వరకు అవకాశముంది. ప్రైవేట్ వైద్య, దంత కళాశాలలతోపాటు ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, అనురాగ్ యూనివర్సిటీ పరిధిలోని నీలిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీట్లను ఈ విడతలో భర్తీ చేయనున్నారు.
కాగా మొదటి విడత కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు తదుపరి విడతల కౌన్సెలింగ్‌కు అనర్హులవుతారని వర్సిటీ స్పష్టం చేసింది. సీట్లను బ్లాక్ చేసి తర్వాతి విడతలకు వెళ్లకుండా ఈ నిబంధన విధించింది. వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీటు కేటాయించిన తర్వాత సంబంధిత కళాశాలలో చేరని విద్యార్థులు కూడా తదుపరి విడతల కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం కోల్పోతారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేనేజ్‌మెంట్ కోటా బీ కేటగిరీ సీట్లలో 85 శాతం తెలంగాణ స్థానిక అభ్యర్థులకు, మిగిలిన 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ (ఆల్ ఇండియా) అభ్యర్థులకు కేటాయిస్తారు.
అభ్యర్థులు కళాశాలలు, కోర్సుల వారీగా తమకు నచ్చిన క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం కోర్సును మధ్యలోనే నిలిపివేసే అభ్యర్థులు అసలు ధ్రువపత్రాలను తిరిగి పొందేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.20 లక్షల డిస్కంటిన్యూయేషన్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ పేర్కొంది.
యూనివర్సిటీ ఫీజులు ఇలా..: సీటు కేటాయించిన అభ్యర్థులు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో ఆన్‌లైన్ ద్వారా వర్సిటీ ఫీజు చెల్లించాలి. ఎంబీబీఎస్ బీ కేటగిరీకి రూ.లక్ష, సీ/ఎన్‌ఆర్‌ఐ కేటగిరీకి రూ.2 లక్షలు నిర్ణయించారు. బీడీఎస్‌లో బీ కేటగిరీకి రూ.40 వేలు, సీ/ఎన్‌ఆర్‌ఐ కేటగిరీకి రూ.80 వేలు చెల్లించాలి. దీనికి అదనంగా కళాశా లల్లో ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నీలిమా మెడికల్ కాలేజీలో బీ కేటగిరీ ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.16.50 లక్షలు, సీ/ఎన్‌ఆర్‌ఐ కేటగిరీకి రూ.24.75 లక్షలుగా ఉంది.వెబ్ ఆప్షన్లకు tspvtmedadm. tsche.in వెబ్‌సైట్‌లో, సాంకేతిక సమస్యలకు 9392685856, 7842136688, 9059672216, నిబంధనలపై సందేహాలకు 7901098840, 9490585796 , చెల్లింపుల సమస్యలకు 9618240276 నంబర్లను సంప్రదించాలని వర్సిటీ సూచించింది.


