ప్రపంచస్థాయి పండ్ల మార్కెట్ తొలి దశ పనులకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి సమీపంలో కోహెడలో నిర్మించనున్న ప్రపంచస్థాయి సమగ్ర పండ్ల మార్కెట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడటమే లక్ష్యంగా దీన్ని నిర్మిస్తోంది. మార్కెట్ తొలి దశ పనులకు రూ.637.70 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలో 178.16 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమగ్ర పండ్ల మార్కెట్‌ను అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో భాగంగా ఆరు వేలం హాళ్లు, వాటికి అనుబంధంగా మీజనైన్ ఏసీ అంతస్తులు నిర్మించనున్నారు. వీటితోపాటు షెడ్–4, కర్బూజ తదితర పండ్ల విక్రయాల కోసం ప్రత్యేక మార్కెట్, రైతుల కోసం కిసాన్ రిటైల్ మార్కెట్, వాహనాలు నేరుగా లోపలికి వెళ్లి సరుకులు తరలించే సదుపాయం, ప్రాంగణం వెలుపల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మార్కెట్ నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక అనుమతులు, టెండర్ల ప్రక్రియ, నిర్మాణ పనుల పర్యవేక్షణ తదితర బాధ్యతలను ఆ శాఖ నిర్వహించనుంది.
రైతులకు ఆధునిక సదుపాయాలు
ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే పండ్ల ఉత్పత్తిదారులకు ఆధునిక మార్కెటింగ్ మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. శాస్త్రీయ పద్ధతుల్లో పండ్ల విక్రయాలు, నిల్వ, రవాణా, మార్కెటింగ్‌కు మెరుగైన సదుపాయాలు కల్పించనున్నారు. తద్వారా రైతులకు మార్కెట్ అవకాశాలు పెరగడంతో పాటు మధ్యవర్తులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, మార్కెటింగ్ వ్యవస్థ ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కోహెడ సమగ్ర పండ్ల మార్కెట్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.


