భారత్‌లో వినియోగ మార్కెట్ తీరు వేగంగా మారుతోంది. వినియోగ మార్కెట్ అంటే సామాన్యులు తమ రోజువారీ సొంత అవసరాల కోసం వస్తువులు, సేవలను కొనుగోలు చేసే మార్కెట్. వస్తువులను వీళ్లు వ్యాపారం చేయడానికి కొనరు. తమ సొంత వినియోగం కోసం మాత్రమే కొంటారు. ఇప్పటివరకు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వంటి మహానగరాల చుట్టూనే అధిక వినియోగం కనిపించేది.
ఇప్పుడు సూరత్ ఈ తీరును మార్చుతోంది. దేశంలోని టాప్ వినియోగ మార్కెట్లలో సూరత్ 7వ స్థానంలో ఉంది. ఆరు పెద్ద మహానగరాల తర్వాత ఇది అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. సూరత్ వినియోగ మార్కెట్ విలువ 34 బిలియన్ డాలర్లుగా ఉంది. అహ్మదాబాద్, పుణె కంటే ఇది ముందుంది. ‘ది మెనీ అర్బన్ ఇండియాస్’ నివేదిక ప్రకారం సూరత్‌లో కుటుంబానికి సగటు వినియోగం బెంగళూరును కూడా మించింది.
దేశంలోని 100 నగరాల మొత్తం వార్షిక వినియోగం 844 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఆరు పెద్ద మహానగరాలు ఇందులో 46 శాతం వాటా కలిగి ఉన్నాయి. అయితే సూరత్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వినియోగం మరింత వేగంగా పెరుగుతోంది. ఈ నగరాల్లో గృహ వ్యయం ఏటా 10.4 శాతం పెరుగుతుండగా, దేశవ్యాప్తంగా వృద్ధి 8.5 శాతంగా ఉంది. సూరత్‌ను 19 వేగంగా అభివృద్ధి చెందుతున్న ‘బూమ్‌టౌన్’ నగరాల్లో చేర్చారు. పుణె, అహ్మదాబాద్, లక్నో, కోయంబత్తూరు, జైపూర్, ఇండోర్, వడోదర ఈ జాబితాలో ఉన్నాయి.
సూరత్ సగటు కుటుంబ ఆదాయం హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా కంటే ఎక్కువగా ఉంది. వస్త్ర పరిశ్రమ, వజ్రాల వ్యాపారం, వలస జనాభా ఆర్థిక స్థాయి పెరగడం ఈ ఆదాయ వృద్ధికి ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. దేశంలోని టాప్ 100 నగరాల్లో రూ.6 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు వార్షిక ఆదాయం పొందే మధ్యతరగతి కుటుంబాల వాటా గత దశాబ్దంలో 29 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది. 2030-31 నాటికి ఇది 60 శాతానికి చేరుతుందని అంచనా. రూ.36 లక్షలకు పైగా ఆదాయం ఉన్న కుటుంబాల వాటా 3 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది.
సూరత్‌లో పెరుగుతున్న ఆదాయం వినియోగ అలవాట్లపైనా ప్రభావం చూపుతోంది. 2025-26లో బూమ్‌టౌన్ నగరాల్లో మొత్తం ఖర్చు రూ.20.1 లక్షల కోట్లు కాగా, కుటుంబానికి సగటు వ్యయం రూ.12.2 లక్షలుగా ఉంది. ఈ ఖర్చులో ఆహారానికి 31.1 శాతం, ఇల్లు-యుటిలిటీలకు 25.8 శాతం, రవాణాకు 19.2 శాతం, విద్యకు 6.8 శాతం వెచ్చిస్తున్నారు. కార్ల వినియోగం 32 శాతానికి, మోటార్‌సైకిళ్ల వినియోగం 72 శాతానికి చేరింది. వాషింగ్ మెషీన్, మైక్రోవేవ్ వినియోగం కూడా పెద్ద మహానగరాల కంటే ఎక్కువగా ఉంది.
ఈ మార్పులు సూరత్ మాత్రమే కాకుండా దేశంలోని అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కొత్త వినియోగ అవకాశాలు పెరుగుతున్నాయనే సంకేతాన్ని ఇస్తున్నాయి. పెరుగుతున్న ఆదాయం, యువ జనాభా, బలమైన రిటైల్-సేవల వ్యవస్థ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో వినియోగ వస్తువులు, జీవనశైలి ఉత్పత్తులు, గృహ రంగాల్లో ఈ నగరాల ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉంది.


