న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ అధికారి, ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్‌పై మరోసారి తీవ్ర ఉచ్చు బిగుస్తోంది. గతంలో తన పెంపుడు కుక్కతో త్యాగరాజ్ స్టేడియంలో చక్కర్లు కొట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అధికారి, తాజాగా ఢిల్లీలోని సత్యనికేతన్ ఏరియాలో బిల్డింగ్ కుప్పకూలిన ఘోర ప్రమాదంతో మరోసారి వివాదాల కేంద్రబిందువుగా మారారు. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించడంతో ఆయనపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీలోని సత్యనికేతన్ ఏరియాలో ఆదివారం (సెప్టెంబర్ 6, 2026) మధ్యాహ్నం ఐదు అంతస్తుల పీజీ హాస్టల్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవన బేస్‌మెంట్‌లో మరమ్మతులు, నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఢిల్లీ పోలీసులు, సహాయక బృందాలు ఇప్పటివరకు 12 మందిని రక్షించాయి. ప్రమాదానికి కారణమైన హాస్టల్ యాజమాని హరిరాంబ్ బన్సల్‌ను రాజస్థాన్‌లో అరెస్టు చేశారు.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రాణనష్టానికి కారణమంటూ డిమాండ్లు వ్యక్తమవుతుండటంతో, ఐఏఎస్ సంజీవ్ ఖిర్వార్ రాజీనామా చేయాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. ఘటన జరిగిన మరుసటి రోజే (సోమవారం) ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ రంగంలోకి దిగి ఐదుగురు అధికారులను తక్షణమే సస్పెండ్ చేసింది.
స్పందించిన ఎంబీసీ కమిషనర్
ఈ ప్రమాదంపై ఎంసీడీ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ స్పందిస్తూ.. అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఆగస్టులో అదే ప్రాంతంలోని 3-4 భవనాలను కూల్చివేయాలని మేము ఆదేశాలు జారీ చేశాము. గత మూడు నెలల్లో 960 భవనాలను కూల్చివేశాము. 407 భవనాలను సీల్ చేశాం. మరో 1,500 భవనాలకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. కూలిపోయిన 14వ నంబరు ఆస్తికి సంబంధించి, గతంలో కేవలం గ్రౌండ్+1 యూనిట్‌కు మాత్రమే అనుమతి ఉందని, ఎలాంటి భవన ప్రణాళికకు ఆమోదం లేదని అధికారులు తేల్చారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
సత్యనికేతన్‌లో సహాయక చర్యలను పర్యవేక్షించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పందిస్తూ.. నగరంలో ఐదు అంతస్తులు ఉన్న అన్ని భవనాలను వెంటనే సీల్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పీజీలు, నర్సింగ్ హోమ్‌లు, పాఠశాలలు లేదా వాణిజ్య సంస్థలను ప్రారంభించే ముందు పాత భవనాల యజమానులు తప్పనిసరిగా స్ట్రక్చరల్ ఆడిట్ నివేదికలను సమర్పించేలా ఒక కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.
మరోవైపు, పౌర సంస్థల వైఫల్యానికి నిరసనగా ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఆధ్వర్యంలో సుమారు 150 నుంచి 200 మంది కార్యకర్తలు ఎంసీడీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఎంసీడీ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గతంలోనూ వివాదాలకే కేంద్రబిందువు
1994 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ గతంలోనూ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో సాధారణ అథ్లెట్లను బయటకు పంపివేసి, తన భార్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గాతో కలిసి తన పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకువెళ్లిన వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది.
మేము ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు శిక్షణ తీసుకునేవాళ్ళం. కానీ ఆ అధికారి తన కుక్కను నడపడానికి వీలుగా మమ్మల్ని సాయంత్రం 7 గంటలకే మైదానం విడిచి వెళ్ళమని చెబుతున్నారు’ అని మే 26, 2022 నాటి కథనంలో కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలను ఖిర్వార్ అప్పట్లో ఖండించినప్పటికీ, తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆయనను లడఖ్‌కు బదిలీ చేసింది.
ఆ తర్వాత కాలంలో మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చిన ఆయన, ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మకమైన ఎంసీడీ కమిషనర్ బాధ్యతలను చేపట్టారు. అయితే, ఇప్పుడు ప్రాణనష్టం సంభవించిన సత్య నికేతన్ భవనం కూలిన దుర్ఘటన నేపథ్యంలో అధికార యంత్రాంగం వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో,సంజీవ్ ఖిర్వార్ చుట్టూ వివాదాల ఉచ్చు మరింత బిగుసుకుంది.
👉ఇదీ చదవండి : ‘అయ్యా.. నేను ఐఏఎస్ తుకారాం ముండేని!’


