భోపాల్: విక్రమార్కుడు సినిమాలో రవితేజ (విక్రమ్ రాథోడ్) నాలుగు సంవత్సరాల సర్వీసులో 10 ట్రాన్స్‌ఫర్లు పొందుతాడు. అతడు ఎక్కడా కాంప్రమైజ్ కాడని ప్రకాశ్ రాజ్ ఆ సినిమాలో అంటాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారిణి కూడా ఒకే ఒక్క ఏడాదిలో 4వ సారి బదిలీ అయ్యారు.
దీంతో తాను తన కింద పనిచేసే అధికారులకు కూడా ఈజీ టార్గెట్‌గా మారానంటూ భారత పరిపాలనా సేవల సంఘానికి లేఖ రాశారు. కేవలం 2 నుంచి 3 నెలల పదవీకాలంతో తాను ఎలా పనిచేయగలనని ఆమె ప్రశ్నించారు. ఆ అధికారిణి పేరు నేహా మార్వ్యా. 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. తనను బాధ్యతలు అర్థం చేసుకునేలోపే నన్ను తొలగిస్తున్నారని అన్నారు.
గిరిజన ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన 2 నెలలు పూర్తికాకముందే ఆమెను మరోసారి బదిలీ చేశారు. తన కింది ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడం, ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడం వంటి అంశాలపై ఆమె వివరణ కోరుతూ వారికి నోటీసులు జారీ చేశారు.
అయితే, ఆ నోటీసులు ఇచ్చిన వెంటనే ఉద్యోగులు ఆమెకు వ్యతిరేకంగా.. పని చేయకుండా నిరసన చేపట్టారు. ఆ నిరసన జరిగిన కొద్ది రోజులకే ప్రభుత్వం ఆమెను మరోసారి బదిలీ చేసింది. ఆమెను మధ్యప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ పదవి అదనపు కార్యదర్శి హోదాతో సమానం.
నిరుత్సాహానికి గురయ్యాను
మార్వ్యా తన లేఖను సంఘం వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. బాధ్యతలు చేపట్టిన 50 రోజులకే తనను బదిలీ చేశారని ఆమె తెలిపారు. ‘‘నేను ఎప్పుడూ ఆదేశాలను గౌరవంగా స్వీకరించాను. కానీ ఈసారి తీవ్రంగా నిరుత్సాహానికి గురయ్యాను’’ అని ఆమె పేర్కొన్నారు. తన కింద పనిచేసే అధికారులు తన బల్లను కొడుతూ, తనను బదిలీ చేయిస్తామని బెదిరించారని ఆమె తెలిపారు. విధేయత లేకుండా వ్యవహరించడం, ఫైళ్లను పేరుకుపోయేలా చేయడంపై తాను ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా తననే బదిలీ చేశారని చెప్పారు.
కిందిస్థాయి అధికారులు పోస్టింగ్‌లను నిర్ణయించేంత బలహీనంగా ఐఏఎస్ అధికారి మారగలరా? అని మార్వ్యా ప్రశ్నించారు. తనను బదిలీ చేసేంతగా నెల రోజుల్లో తాను ఏం చేశానని అడిగారు. ‘‘ఒక అధికారి నెల రోజుల్లోనే పని పూర్తిగా అర్థం చేసుకోలేడు. అయినా ఈ బదిలీతో నన్ను అవమానించారు’’ అని ఆమె అన్నారు.
తరచూ తక్కువ కాలానికే బదిలీలు కావడంతో తాను తీవ్రంగా నిరుత్సాహానికి గురయ్యానని మార్వ్యా తెలిపారు. ‘‘ఏదో ఒకరోజు పరిస్థితులు మారుతాయని ఆశిస్తూ ఎన్నేళ్లుగా సహనం పాటించాను. కానీ ఇప్పుడు కిందిస్థాయి అధికారులు నన్ను బెదిరించడం మొదలుపెట్టారు. కుట్రలు చేసేవాళ్లే ఎప్పుడూ గెలుస్తున్నారు. నేను ఓడిపోతున్నాను. ఈ రోజు నేను లక్ష్యంగా మారాను. రేపు మరో ఐఏఎస్ అధికారి లక్ష్యం కావచ్చు’’ అని ఆమె సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆమె లేఖపై సంఘం ఇప్పటివరకు స్పందించలేదు.
2025 జనవరిలో డిండోరి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన 8 నెలల తర్వాత మార్వ్యాను ఆ పదవి నుంచి తొలగించారు. 2017లో శివపురి జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పనిచేసిన సమయంలో వాహనాల చెల్లింపుల విషయంలో అప్పటి కలెక్టర్ ఓపీ శ్రీవాస్తవతో ఆమెకు వివాదం ఏర్పడింది. ఈ వ్యవహారం అప్పట్లో వార్తల్లో నిలిచింది. 2022లో రెవెన్యూ శాఖలో తనకు కేటాయించిన పదవిలో బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లినప్పుడు ప్రధాన కార్యదర్శి మనీష్ రస్తోగి తనను లోపలికి రానివ్వలేదని ఆమె ఆరోపించారు.


