తీవ్ర విషాదం.. కల్తీ మద్యం సేవించి 10 మంది మృతి | ten dead after consuming spurious liquor in madhya pradesh | Sakshi
Sakshi News home page

తీవ్ర విషాదం.. కల్తీ మద్యం సేవించి 10 మంది మృతి

Sep 6 2026 3:41 PM | Updated on Sep 6 2026 4:14 PM

ten dead after consuming spurious liquor in madhya pradesh

భోపాల్: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సాగర్‌ జిల్లాలో కల్తీ మద్యం సేవించి పదిమంది మృతిచెందారు. మృతులంతా అక్కడి  ఘూఘర్, నౌరాజ్, బరాజ్ తదితర గ్రామాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

అయితే నిన్న శనివారం మద్యం సేవించిన అనంతరం బాధితుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.  దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు  వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో వారు మృతిచెందిట్లు వైద్యులు ప్రకటించారు. మరి కొంతమందికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ మరణాలకు కల్తీ మద్యమే కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నప్పటికీ, పోస్టుమార్టం నివేదికలు వచ్చే వరకు అధికారికంగా కారణాన్ని నిర్ధారించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

యూపీ నుంచి కల్తీ మద్యం సరఫరా?

ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సాగర్‌కు సరిహద్దుగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ కేంద్రంగా ఓ అక్రమ మద్యం సరఫరా నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.నిందితులు లలిత్‌పూర్‌లో నకిలీ మద్యాన్ని తయారు చేసి, సాగర్ సరిహద్దు గ్రామాలకు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

నకిలీ మద్యాన్ని అసలైన బ్రాండ్ల మాదిరిగా కనిపించేలా నకిలీ లేబుళ్లు, క్యాప్‌లు, క్యూఆర్ కోడ్‌లు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కార్లు, మోటార్‌సైకిళ్ల ద్వారా ఈ మద్యాన్ని వివిధ ప్రాంతాలకు తరలించినట్లు అనుమానిస్తున్నారు.బాంద్రీ, బరోడియా, ఘూఘారా ఖుర్ద్, నౌరాజ్, బరాజ్ తదితర గ్రామాలకు ఈ నకిలీ మద్యం చేరినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరు సరఫరా చేశారు? స్థానికంగా ఎవరైనా ఈ అక్రమ నెట్‌వర్క్‌కు సహకరించారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఘటనపై సీఎం సీరియస్

సాగర్‌లో జరిగిన మరణాలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఘటనాస్థలికి సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement