ఇదీ బెంగళూరు రోడ్ల పరిస్థితి.. ఇప్పుడు నా వంతు.. రేపు ఎవరివంతో? | Aishani Khanna alleged accident due to potholes in bangalore | Sakshi
Sakshi News home page

ఇదీ బెంగళూరు రోడ్ల పరిస్థితి.. ఇప్పుడు నా వంతు.. రేపు ఎవరివంతో?

Sep 6 2026 12:58 PM | Updated on Sep 6 2026 1:55 PM

Aishani Khanna alleged accident due to potholes in bangalore

సాక్షి,బెంగళూరు: దేశ ఐటీ రాజధాని, సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో రోడ్ల దుస్థితి మరోసారి తీవ్ర విమర్శలకు దారితీసింది. రోడ్డుపై కనిపించకుండా ఉన్న ఓ పెద్ద గుంత టెక్కీ పాలిట శాపంగా మారింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు చీలమండలం తీవ్రంగా గాయపడగా, అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

ఐటీ ఉద్యోగిణి  ఐషాని ఖన్నా గత నెలలో తన స్కూటర్‌పై ఆఫీసుకు బయలుదేరారు. వైట్‌ఫీల్డ్-వర్తూర్ రోడ్డులోని నెక్సస్ మాల్ సమీపంలో వెళ్తున్న సమయంలో భారీ వర్షం కారణంగా రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. అది గమనించని బాధితురాలు గుంతలో పడి అదుపుతప్పి కిందపడ్డారు.

ఈ సంఘటనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను వర్షంలో చాలా జాగ్రత్తగా స్కూటర్ నడుపుతాను. కానీ నీటితో నిండి ఉన్న ఆ గుంత నా కంటికి కనిపించలేదు. ఒక్కసారిగా స్కూటర్‌తో సహా కిందపడ్డాను. నా ఎడమ కాలి చీలమండలంపై తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరగా.. ప్లాస్టిక్ సర్జరీతో పాటు ఇతర వైద్య సేవల కోసం రూ. 1.97 లక్షల బిల్లు అయింది. గాయాలు పూర్తిగా తగ్గడానికి భవిష్యత్తులో మరో సర్జరీ కూడా చేయించుకోవాల్సి రావొచ్చు.  కేవలం శారీరక నొప్పే కాకుండా, ఊహించని ఈ పరిణామం వల్ల తీవ్రమైన మానసిక వేదనకు, ఆర్థిక భారానికి గురయ్యామని వాపోయారు.

గత 30 ఏళ్లుగా బెంగళూరులోనే ఉంటున్నానని, నగరంలో రోడ్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని ఐషాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ నేను అనుభవిస్తున్న నరకం రేపు మరెవరికైనా జరగవచ్చు. ఇప్పటికైనా రోడ్లను బాగు చేయండి అంటూ ఆమె అధికారులను, మంత్రులను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఘటనపై నగరవాసులు, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్ల అభివృద్ధి కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement