కర్నూలు: ఓ వైపు రక్తమోడుతున్నా ఇంటి వద్ద ఉన్న భార్యా పిల్లలను గుర్తు చేసుకుంటూ.. ‘అన్నా.. నన్ను రక్షించండి.. నాకు చిన్న పిల్లలన్నా’ అంటూ విలపించాడు. కదలలేనిస్థితిలో ఇరుక్కుపోయినా ‘మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడాలా’ అంటూ విలవిలలాడాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ క్షతగాత్రుని వేదన అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై మంగంపల్లె స్టేజీ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ఐరన్ మెటీరియల్ లోడ్‌తో వెళ్తున్న లారీ మంగంపల్లె స్టేజ్ వద్ద టైర్ బరస్ట్ అయ్యి రహదారికి కుడి వైపు డివైడర్ పక్కనే నిలిచిపోయింది. లారీ డ్రైవర్ కిందకు దిగి పరిస్థితిని చూసి 1032 ద్వారా సమాచారమిచ్చాడు. అయితే నిమిషాల వ్యవధిలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఐచర్ వాహ నం లారీని ఢీకొంది. దీంతో ఐచర్ వాహన డ్రైవర్ తాడిపత్రికి చెందిన నాగేంద్ర (35) డ్రైవింగ్ సీటులోనే ఇరుక్కుపోయాడు. వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న హైవే పోలీసులు ఆనంద్, శివ, హైవే అంబులెన్స్ సిబ్బంది, క్రేన్ సిబ్బంది ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను దాదాపు గంటపాటు శ్రమించి బయటకు తీశారు.
ఆ సమయంలో డ్రైవర్ ‘త్వరగా తీయండన్నా.. తట్టుకోలేకపోతున్నాను.. నాకు చిన్న పిల్లలన్నా.. మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడాలి’ అంటూనే సృహ కోల్పోతుండడం అక్కడి వారి హృదయాలను కలచివేసింది. అతి కష్టం మీద బయటకు తీయగా అప్పటికే తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్ తెలిపారు.


