ధరల మోత.. నేరాల వాత | Crimes are increasing with the rise in gold prices | Sakshi
Sakshi News home page

ధరల మోత.. నేరాల వాత

Sep 6 2026 5:43 AM | Updated on Sep 6 2026 5:43 AM

Crimes are increasing with the rise in gold prices

పసిడి ధరలు కొండెక్కడంతో పెరుగుతున్న నేరాలు 

తెలుగు రాష్ట్రాల్లో కలవరపెడుతున్న చైన్‌ స్నాచింగ్స్, దొంగతనాలు 

మహిళలే లక్ష్యంగా చేసుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠాలు 

మార్నింగ్‌ వాకర్స్, ఒంటరిగా వెళ్లేవారే టార్గెట్‌ 

రైళ్లు, బస్సు ప్రయాణాల్లోనూ  పెరిగిన దొంగతనాలు

సాక్షి, అమరావతి: బంగారం ధర గుండె దడ పుట్టిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో తులం బంగారం(10 గ్రాములు) ధర రూ.లక్షన్నర పైమాటే. ఈ క్రమంలో చైన్‌ స్నాచింగ్స్, దొంగతనాలూ అంతకంతకూ పెరుగుతున్నాయి. తులం బంగారం చోరీ చేస్తే చాలు.. క్షణాల్లో రూ.లక్షన్నరకు పైగా సొమ్ము చేతికి వస్తుందనే దురాశతో దుండగులు రెచ్చిపోతున్నారు. గతేడాది ఏపీలో 13,176 చోరీలు జరగ్గా.. ఈ ఏడాది వాటి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. 

ఒంటరిగా వెళ్లే మహిళలపై ద్విచక్ర వాహనాలపై వచ్చి దాడిచేసి చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడటం, షాపుల్లో కస్టమర్‌లా చొరబడి మంగళసూత్రం లాక్కొని పారిపోవడం, బస్సు, రైలు ప్రయాణాల్లో బ్యాగుల నుంచి ఆభరణాలు కొట్టేయడం, బురఖా ధరించి జ్యువెలరీ షాపుల్లో దృష్టి మరల్చి బంగారు వస్తువులు అపహరించడం, పూజ, మంత్రాల పేరిట ఇంట్లోకి చొరబడి నిజమైన నగల స్థానంలో నకిలీవి పెట్టడం, బ్యాంకు గోల్డ్‌ లోన్‌ ఖాతాల్లో అంతర్గత మోసాలకు పాల్పడుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతోపాటు చిన్నస్థాయి పట్టణాలు, గ్రామాల్లోనూ చైన్‌ స్నాచింగ్స్, ఇళ్లలో దొంగతనాలు విజృంభిస్తున్నాయి. దీంతో ‘బంగారం’ విషయంలో బీకేర్‌ఫుల్‌గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 

మహిళలే టార్గెట్‌.. 
బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో కేటుగాళ్ల దృష్టి నేరుగా మహిళల ఆభరణాలపై పడింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లే మహిళలు, కాలనీల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లేవారు, ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నవారు, కిరాణా షాపులకు వెళ్లేవారే టార్గెట్‌గా చైన్‌ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. నంబర్‌ ప్లేట్లు లేకుండా దోచుకున్న బైక్‌లపై వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల రైళ్లలో రిజర్వేషన్‌ బోగీల్లోనూ రెక్కీ నిర్వహిస్తున్న దొంగలు.. అప్పటి వరకు వేచి చూసి కదులుతున్న రైలు కిటికీలు, డోర్‌ దగ్గర నుంచి మహిళల మెడలో ఆభరణాలు తెంచుకుపోతున్నారు. రైళ్లలో ఈ తరహా చోరీలు ఇటీవల విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రధాన స్టేషన్‌లలో పెరిగాయి.  

బంగారం చోరీల్లో అంతర్రాష్ట్ర ముఠాలు 
రెచ్చిపోతున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లాలో పట్టుబడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా నుంచి రూ.1.70కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఆ ముఠా 13 చోరీలకు పాల్పడినట్టు లెక్కతేలింది. బిహార్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు తెగబడుతున్నారు.  

ప్రాణాలు తీసేస్తున్నారు.. 
ఇటీవల హైదరాబాద్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి వినయ్‌ రంజన్‌ రే భార్య తనూజ(62)ను హత్య చేసిన నేపాల్‌ ముఠా 225 గ్రాముల బంగారం, నగదు దోచుకుపోయిన ఘటన సంచలనం రేపింది. శ్రీకాకుళం జిల్లాలో 70 ఏళ్ల వృద్ధురాలు ఒక వేడుకకు బంగారం ధరించి వెళ్లి తర్వాత శవమై దొరికింది. బంగారం ధర పెరిగిన కొద్దీ, చోరీలకు పాల్పడుతున్న ముఠాల ఆగడాలు ప్రాణాలు తీసేవరకు వెళ్తున్నాయి. 

అప్రమత్తత అతి ముఖ్యం.. 
»  బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళలు మెడలో బంగారు ఆభరణాలతోపాటు హ్యాండ్‌బ్యాగ్, ట్రాలీ బ్యాగ్‌లను తెరిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణంలో నిద్రపోయినా, బ్యాగ్‌ వదిలేసినా, అదే దొంగలకు అవకాశం. మన బ్యాగ్‌ కళ్లెదుటే ఉండేలా చూసుకోవాలి. 
» ఉదయం నడక, వివాహాలు, ఆలయాలకు నగలు ధరించి వెళ్లేటప్పుడు కేటుగాళ్లపై ఓ కన్నేసి ఉంచాల్సిందే.  
» ఇంట్లో నగలు ఉంచుకోకుండా లాకర్‌లో భద్రపరుచుకోవడం మేలు. పూజ, పేరంటం, శుభకార్యం పేరుతో ఎవరికీ బంగారం ఇవ్వకపోవడం మంచిది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement