ఇకపై 28 జిల్లా పరిషత్‌లు | There will now be 28 Zilla Parishads | Sakshi
Sakshi News home page

ఇకపై 28 జిల్లా పరిషత్‌లు

Sep 6 2026 5:25 AM | Updated on Sep 6 2026 5:25 AM

There will now be 28 Zilla Parishads

ఈ నెల 25 నుంచి అమలులోకి 2022లో రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన 

అప్పటికి జెడ్పీల ఎన్నికలు జరిగి ఏడాదే కావడంతో అవే పాలకమండళ్ల కొనసాగింపు 

ఈ నెల 24తో ముగియనున్న జెడ్పీల పదవీ కాలం.. మరునాటి నుంచే కొత్త జెడ్పీలు 

అత్యధికంగా వైఎస్సార్‌ కడప జిల్లా పరిషత్‌లో 39 మండలాలు 

అదనంగా 15 జెడ్పీ సీఈవో, 15 డిప్యూటీ సీఈవో పోస్టులకు ఆమోదం  

సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కొనసాగుతున్న 13 జిల్లా పరిషత్‌ (జెడ్పీ) లను కొత్త జిల్లాల ప్రాతిపదికన 28 జెడ్పీలుగా పునర్విభజిస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా పరిషత్‌ల ప్రస్తుత పాలక మండళ్ల పదవీకాలం ఈ నెల 24తో ముగుస్తుంది. మరుసటి రోజు 25వ తేదీ నుంచే కొత్త జెడ్పీలు ఏర్పాటవుతాయి. 2022లో రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన మొదలయింది. అప్పటికి జిల్లా పరిషత్‌ల ఎన్నికలు జరిగి ఏడాది కాలమే కావడంతో సాంకేతిక కారణాలతో అప్పటి ఎన్నికల్లో గెలిచిన పాలకమండళ్ల పదవీ కాలం ముగిసే వరకు ఉమ్మడి జిల్లా పరిషత్‌లు కొనసాగాయి.

నాలుగు మండలాలతోనే విశాఖ జిల్లా పరిషత్‌
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 660 మండలాలను కొత్త జిల్లాల ప్రాతిపదికన 28 జిల్లా పరిషత్‌లుగా వర్గీకరించారు. విశాఖపట్నం జిల్లా పరిషత్‌ మాత్రం కేవలం నాలుగు మండలాలకే పరిమితమైంది. విశాఖ జిల్లాలో నగర ప్రాంతం కాకుండా గ్రామీణ ప్రాంతాలు భీమునిపట్నం, పెందుర్తి, పద్మనాభం, ఆనందపురం మండలాలే ఉంటాయి. ప్రతి జిల్లా ఒక జిల్లా పరిషత్‌గా ఏర్పాటు చేయాలన్న  పంచాయతీరాజ్‌ శాఖ  చట్టం నిబంధనల మేరకు ఆ నాలుగు మండలాలతోనే ప్రత్యేక జిల్లా పరిషత్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 

కేవలం నాలుగు మండలాల ప్రజలు ఎన్నుకొనే నలుగురు జెడ్పీటీసీ సభ్యులతోనే ఆ జిల్లా పరిషత్‌ ఉంటుంది. అందులో ఒకరిని జెడ్పీ చైర్మన్‌గా ఎన్నుకొంటారు. అల్లూరి సీతారామరాజు,  పోలవరం జిల్లా పరిషత్‌లలో 11 మండలాలు చొప్పున ఉన్నాయి. అత్యధికంగా వైఎస్సార్‌ కడప జిల్లా పరిషత్‌లో 39 మండలాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. 

» ప్రతి జిల్లాలోని మండల ప్రజా పరిషత్‌లు జిల్లా ప్రజా పరిషత్‌లో భాగస్వామ్యమై ఉంటాయని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్తులో ఏదైనా మండల ప్రజా పరిషత్‌ను పునర్వ్యవస్థీకరించినా, విలీనమైనా లేదా మారినా, దానికి అనుగుణంగా జెడ్పీలో చట్టబద్ధమైన మార్పులు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
» కొత్తగా ఏర్పాటయ్యే జెడ్పీలలో కార్యకలాపాల నిర్వహణకు జిల్లాకొకరు చొప్పున మొత్తం 15 జెడ్పీ సీఈవో, 15 డిప్యూటీ సీఈవో అదనపు పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 
» జెడ్పీలో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని మండల ప్రజా పరిషత్తుల సంఖ్య, ప్రాంతీయ పరిధి, పనిభారం,  అవసరాలకు అనుగుణంగా 28 జెడ్పీలకు వర్గీకరించనున్నట్టు ప్రభుత్వం ఆ ఆదేశాల్లో తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement