మళ్లీ మోసాల గార'డీయే' | Chandrababu has cheated government employees again | Sakshi
Sakshi News home page

మళ్లీ మోసాల గార'డీయే'

Sep 6 2026 4:50 AM | Updated on Sep 6 2026 4:50 AM

Chandrababu has cheated government employees again

ఉద్యోగులతో చంద్రబాబు సర్కారు కంటితుడుపు చర్చలు  

ఐదు డీఏలకు రెండింటితో సరి 

అవీ పూర్తిస్థాయిలో ఇస్తారో లేదో అనుమానమే

30 శాతం ఐఆర్‌పై చేతులెత్తేసిన వైనం 

జీపీఎఫ్, జీఎల్‌ఐ, రిటైర్‌మెంట్‌ బకాయిలపైనా స్పష్టత కరువు 

రూ.40 వేల కోట్ల బకాయిలపైనా మౌనమే.. 12వ పీఆర్సీ కమిషన్‌కు అంగీకారం.. ఎప్పుడు నియమిస్తారో గడువు లేదు 

30కిపైగా డిమాండ్లలో నాలుగైదింటికే ఊ..కొట్టిన సర్కారు  

మాయమాటలతో మళ్లీ మోసం చేసిన చంద్రబాబు 

చంద్రబాబు ఊరడింపు చర్చలపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు మళ్లీ మోసం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రెండేళ్లు కాలయాపన చేసి వారు ఉవ్వెత్తున ఉద్యమించడంతో ఊరడించేందుకు శనివారం కంటితుడుపుగా చర్చలు జరిపారు. ఆ చర్చల్లో  రెండు డీఏలు ఇస్తామని, పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తామని చెప్పి మిగిలిన హామీలు ఇవ్వలేమని చేతులేత్తేశారు. గత ఏడాదీ ఇలాగే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఒక డీఏ ఇస్తామని, బకాయిలు విడుదల చేస్తామని ప్రకటించినా వాస్తవంలో దానికి కోతలు పెట్టారు. 

ఇప్పుడూ కంటితుడుపుగా రెండు డీఏలు ప్రకటించినా అవి విడుదల చేసే వరకూ గ్యారంటీ లేదని ఉద్యోగులు భావిస్తున్నారు. మిగిలిన మూడు డీఏల పరిస్థితి ఏమిటో అంతుబట్టడంలేదు. వైఎస్‌ జగన్‌ హయాంలోనే 12వ పీఆర్సీ కమిషన్‌ నియమించగా చంద్రబాబు అధికారంలోకి రాగానే కమిషనర్‌ మన్మోహన్‌సింగ్‌ను బెదిరించి రాజీనామా చేయించారు. ఆ తర్వాత కొత్త కమిషనర్‌ను నియమించకుండా రెండేళ్లు పీఆర్సీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా ఆపివేశారు. ఇప్పుడు ఉద్యోగులు ఉద్యమించడంతో కమిషనర్‌ను నియమించడానికి అంగీకరించినా అది ఎప్పటిలోగా నియమిస్తారు? నివేదిక ఇవ్వడానికి ఎంత గడువు ఇస్తారు? 12వ పీఆర్సీ ఎప్పుడు ఇస్తారనే అంశాలపై నోరు మెదపలేదు. 

ఐఆర్‌కు ఎగనామం 
పీఆర్సీ ఆలస్యమైంది కాబట్టి అది వచ్చేలోపు ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట కల్పించేందుకు ఇచ్చే మధ్యంతర భృతి (ఐఆర్‌)ని ఇవ్వలేమని చంద్రబాబు ఈ సమావేశంలో తేల్చేశారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఉద్యోగులు అర్థం చేసుకోవాలని చెప్పి దాన్ని ఇచ్చేది లేదని తేల్చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్‌ ఇచ్చి ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. 2024లో చంద్రబాబు రాగానే ఐఆర్‌ ఇవ్వకపోగా పీఆర్సీ కమిషనర్‌ను వెళ్లగొట్టి ఇప్పుడు దాన్ని ఇవ్వకుండా తమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 

ఉద్యోగులకు రావాల్సిన రూ.40 వేల కోట్ల బకాయిలపైనా చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. కానీ రెండేళ్లలో రూ.30 వేల కోట్ల బకాయిలు ఇచ్చామని చెప్పడంతో ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. అంత డబ్బు ఎవరికి ఇచ్చారో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఉద్యోగ సంఘాలు ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఉంది, ఎంత బకాయి చెల్లించారు? ఇంకా ఎంత బకాయి ఉందో పే స్లిప్‌లో చూపాలని కోరుతున్నా దాని గురించి పట్టించుకోవడంలేదు. ఆ పని చేయకుండా రూ.30 వేల కోట్ల బకాయిలు ఇచ్చేశామని చెబుతుండడంతో చంద్రబాబు చెప్పే­వి అబద్ధాలని ఉద్యోగులు మండిపడుతున్నారు. 

పోలీసు సరెండర్‌ లీవ్‌ బకాయిలపైనా అనుమానమే  
పోలీసు సిబ్బందికి సంబంధించిన సరెండర్‌ లీవుల బకాయిలు ఇస్తామని చెప్పినా ఇస్తారో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాదీ సీఎంతో చర్చలు జరిగినప్పుడూ వాటిని ఇస్తామని చెప్పినా ఇవ్వలేదని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడూ ఇస్తామంటున్నా ఇచ్చే వరకూ గ్యారంటీ లేదని చెబుతున్నారు. పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌పైనా వారిలో నమ్మకం కలగడంలేదు. ఆర్థిక భారం లేని పెన్షన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడానికి ముందుకు రాకుండా అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ఇస్తారంటే ఎలా నమ్ముతామని వారు ప్రశ్నిస్తున్నారు.

సీపీఎస్‌ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరమే 
ఇక సీపీఎస్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీ గురించి ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో స్పష్టత ఇవ్వలేదు. సీపీఎస్‌పై ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ సీఎంతో చర్చల తర్వాత కూడా హామీగానే మిగిలింది. అత్యవసర అవసరాల కోసం జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌) నుంచి నగదు ఉపసంహరణకు వెంటనే అనుమతివ్వాలని కోరగా చంద్రబాబు అంగీకరించారు. కానీ అది అమ­లయ్యే అవకాశం ఎంతవరకూ ఉందో అర్థం కావడంలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఆ హమీని కూడా అమలు చేస్తామని గతంలో చెప్పిన బాబు తుంగలో తొక్కారు. ఇప్పుడు మళ్లీ అమలు చేస్తామంటుండడంతో దాన్ని ఉద్యోగులు నమ్మలేకపోతున్నారు. 

రిటైర్‌ అయ్యే ఉద్యోగులకు జీపీఎఫ్, జీఎల్‌ఐ, గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ వంటి ప్రయోజనాలను సకాలంలో చెల్లించాలనే దానిపైనా సీఎం సరైన సమాధానం చెప్పలేదు. ఇక కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలనే అంశం అసలు ప్రస్తావనకే రాలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు పెట్టిన 30కిపైగా డిమాండ్లలో తూతూమంత్రంగా నాలుగైదు డిమాండ్లకు ఒప్పుకున్నట్లు చెప్పిన చంద్రబాబు మిగిలిన వాటికి ఎగనామం పెట్టారని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అంగీకరించిన వాటి­నీ ఎంతవరకూ ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement