డీఎస్సీని కుదిపేస్తున్న ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం
పుట్టలో పాముల్లా బయటికొస్తున్న అక్రమాలు
శ్రీకాకుళంలో టాపర్‌ను బలిచేసి అనర్హురాలికి అందలం.. సర్టిఫికెట్లు ఫేక్ అని తేలడంతో హోల్డ్‌లో పోస్టింగ్
ఫేక్ సర్టిఫికెట్‌తో అన్నకు పీఈటీ ఉద్యోగం.. నకిలీ అని తేలడంతో ఆగమేఘాలపై తమ్ముడి సర్టిఫికెట్ అప్‌లోడ్.. ఆర్చరీలో గోల్డ్‌మెడలిస్ట్ దుర్గయ్యకు మాత్రం అడ్డొచ్చిన రూల్స్
నిఖార్సయిన సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయడానికి ససేమిరా
నంద్యాలలో నకిలీ సర్టిఫికెట్లతో భార్యాభర్తలకు ఉద్యోగాలు
వెయిట్ లిఫ్టర్ బోగస్ జనన ధ్రువీకరణ పత్రం.. పోస్టల్ డిపార్ట్‌మెంట్ నిరాకరించినా డీఎస్సీలో ఉద్యోగం
సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు అసలు గుర్తింపే లేదు
అయినా కూనరవికుమార్ సంతకాలు.. సర్టిఫికెట్లు.. ఉద్యోగాలు
సాక్షి నెట్‌వర్క్: మైదానంలో గెలవాలంటే ప్రతిభ ఉండాలి.. డీఎస్సీలో ఉద్యోగం రావాలంటే మెరిట్ ఉండాలి. కానీ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ నడిపిన మెగా డీఎస్సీ దగా నాటకంలో ఉద్యోగం రావాలంటే నకిలీ సర్టిఫికెట్లు ఉండాలి. స్పోర్ట్స్ కోటా పేరుతో నచ్చినోళ్లకు నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చేసి ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేసిన కుంభకోణం ఇçప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఎక్కడో ఒకచోట నకిలీ సర్టిఫికెట్ బయటపడుతోంది.. మరోచోట వేరొకరి ధ్రువపత్రంతో ఉద్యోగం కొట్టేశారన్న ఫిర్యాదు వస్తోంది.. ఇంకొకచోట గడువు ముగిసిన తర్వాత సర్టిఫికెట్ మార్చుకునే అవకాశం ఎలా వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. మరొక వ్యవహారంలో గుర్తింపు లేని క్రీడా సంఘం ధ్రువపత్రాలతోనే కొలువులు దక్కాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే నియామక ప్రక్రియలో ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన వర్తించినట్లుగా కనిపిస్తుండటమే ఇప్పుడు అసలు అనుమానాలకు తావిస్తోంది. మెరిట్‌లో ముందున్నవారికి అన్యాయం జరిగిందన్న ఆరోపణల నుంచి.. అనుమానాస్పద సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వ్యవహారాల వరకు.. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఉదంతాలు మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియలో జరిగిన అక్రమాలను బైటపెడుతున్నాయి. కేసులు వేరు.. వ్యక్తులు వేరు.. క్రీడలు వేరు. కానీ జరిగింది ఒక్కటే...ఇదో పెద్ద స్కామ్.. స్పోర్ట్స్ కోటా ఎంపిక మొత్తం ఓ పెద్ద కుంభకోణం.. దానిని నిరూపించే కొన్ని ఉదంతాలను చూద్దాం...
టాపర్‌ను బలిచేసి అనర్హురాలికి పోస్టు
కోటిపల్లి అనిల్‌కుమార్‌ది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామం. మెగా డీఎస్సీలో 2025లో ఎస్సీ గ్రూప్–1 కేటగిరీ కింద స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుకు ఎగ్జామ్ రాశారు. ఎస్సీ గ్రూప్–1 మెరిట్ లిస్టులో మూడో వ్యక్తి. అనిల్ కంటే ముందు ఉన్న ఇద్దరికీ ఓపెన్‌లో 13, 14వ ర్యాంకులు రావడంతో ఓపెన్ కేటగిరీలో పోస్టులు సాధించారు. వారి తర్వాత 73 మార్కులతో అనిల్ (168ఓపెన్ ర్యాంకు) ఉన్నారు. అంటే ఎస్సీ గ్రూప్–1 కేటగిరీ కింద అనిల్ టాప్‌లో ఉన్నారు. ఆ కేటగిరీ పోస్టు ఆయనకే దక్కాలి. కానీ ఎలాంటి మెరిట్ లిస్టు ప్రకటించకుండా విడుదల చేసిన స్పోర్ట్స్ కోటా కింద ఎస్సీ కేటగిరీకి చెందిన నాగరత్నం అనే మహిళను ఎస్సీ గ్రూప్ 1 సోషల్ రిజర్వేషన్ పోస్టులో భర్తీ చేశారు. దానిపై అభ్యంతరాలు స్వీకరించకుండా ఏకపక్షంగా నియమించేశారు. తీరా చూస్తే ఆ మహిళా అభ్యర్థి అనర్హురాలు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రెగ్యులర్‌గా పనిచేస్తున్న ఆమె బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ పెట్టారు. బీపీఈడీ అనేది డిస్టెన్స్ మోడ్‌లో పూర్తి చేయాల్సిన కోర్సు కాదు. రెగ్యులర్‌గా కాలేజికి వెళ్లి చేయాల్సిన కోర్సు అది. కానీ ఇక్కడ నాగరత్నం సెలవు పెట్టకుండా కోర్సు పూర్తి చేసినట్టు తేలింది. అంటే, అది ఫేక్ సర్టిఫికెట్. అలాగే, డిగ్రీ కూడా ఫేక్ సర్టిఫికెట్ అని గుర్తించారు. దీనిపై అనిల్‌తో పాటు స్పోర్ట్స్ కోటాలో నాగరత్నం కంటే ముందు ఉన్న బి.ఎర్రయ్య అనే వ్యక్తి కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు కూడా ఆ సర్టిఫికెట్లు ఫేక్ అని గుర్తించారు. దీంతో ఆమెకు పోస్టు ఇవ్వకుండా హోల్డ్‌లో పెట్టారు.
సమాధానం లేని ప్రశ్నలు
డీఎస్సీ అభ్యర్థులు, ప్రతిపక్షాలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు జవాబుందా?
⇒ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల పూర్తి మెరిట్ జాబితాను ప్రభుత్వం ఎందుకు బహిరంగపరచలేదు?
⇒ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఎవరు తుది నిర్ణయం తీసుకున్నారు? వారి బాధ్యతను ప్రభుత్వం వెల్లడిస్తుందా?
⇒ ఫేక్/అనుమానాస్పద సర్టిఫికెట్లపై వచ్చిన ఫిర్యాదులన్నింటిపై ఒకే స్థాయి విచారణ జరిగిందా? లేక కేసు కేసుకు వేర్వేరు ప్రమాణాలు పాటించారా?
⇒ అనర్హత నిర్ధారణ అయిన అభ్యర్థులకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, ఆ నియామకాలను రద్దు చేస్తారా? వారికి చెల్లించిన వేతనాల పరిస్థితి ఏమిటి?
⇒ అక్రమంగా పోస్టు కోల్పోయినట్లు చెబుతున్న మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయడానికి తీసుకుంటున్న చర్యలేమిటి?
⇒ మొత్తం స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎన్ని సర్టిఫికెట్లను, ఎంతమంది అభ్యర్థులను ప్రత్యేకంగా ఆడిట్ చేశారు?
⇒ గుర్తింపు రద్దయిన లేదా గుర్తింపు లేని స్పోర్ట్స్ సంఘాల సర్టిఫికెట్లను డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఏ నిబంధన ప్రకారం అంగీకరించారు?
⇒ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు గుర్తింపు లేకపోయినా ఆ సంఘం జారీ చేసిన సర్టిఫికెట్ల ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు?
సర్టిఫికెట్లు ఎప్పుడైనా మార్చవచ్చా?
శ్రీకాకుళం జిల్లాలోనే ఇది మరో వ్యవహారం. స్పోర్ట్స్ కోటాలో పెద్ద అప్పలరాజుకు పీఈటీ ఉద్యోగం వచ్చింది. పోస్టు కోసం దరఖాస్తు చేసిన సమయంలో హయ్యెస్ట్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కింద 37వ నేషనల్ గేమ్స్ 2023 పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయగా, బ్యాకప్ సర్టిఫికెట్‌గా 4వ యూత్ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పార్టిసిపేషన్‌ను అప్‌లోడ్ చేశారు. ఇక్కడే తేడా జరిగింది. బ్యాకప్ సర్టిఫికెట్‌గా అప్‌లోడ్ చేసిన 4వ యూత్ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ సర్టిఫికెట్ ఆయనది కాదు. ఆయన సోదరుడు విశ్వేశ్వరరావుది. అంతేకాదు అప్పలరాజు పుట్టిన తేదీ 1998 జూలై 29 కాగా, బ్యాకప్ సర్టిఫికెట్‌లో విశ్వేశ్వరరావు పుట్టిన తేదీ 2003 జూన్ 12గా ఉంది. అటు సర్టిఫికెట్లు చూసినా, ఇటు పుట్టిన తేదీ చూసినా తేడా ఉందని అధికారులు గుర్తించాలి. అభ్యంతరం పెట్టాలి. ఇదేమీ పరిశీలించకుండా పెద్ద అప్పలరాజుకు ఉద్యోగం ఇచ్చేశారు. వీటిపై ఆరోపణలు వచ్చే సరికి శాప్‌లో తన సోదరుడు విశ్వేశ్వరరావు సర్టిఫికెట్ తీసేసి బ్యాకప్ సర్టిఫికెట్‌గా అప్పలరాజుకు చెందిన 6వ ఎలైట్ మెన్స్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2022 పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పెట్టారు. అభ్యంతరాలు వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే మార్పులు, చేర్పులు జరిగిపోయాయి.
మరి గిరిజనుడైన దుర్గయ్యకు ఆ రూల్ వర్తించదా?
పెద్ద అప్పలరాజు అర్హుడైనప్పుడు గిరిజనుడైన దుర్గయ్య కూడా అర్హుడే అని చెప్పాలి. ఆర్చరీలో గోల్డ్ మెడలిస్టు అయిన దుర్గయ్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ పెట్టానని దుర్గయ్య అంటుంటే సిల్వర్ మెడల్ పెట్టారని ప్రభుత్వం చెబుతోంది. ఒక వేళ మిస్సయిందనుకుంటే గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ జత పరుస్తానని దుర్గయ్య చెబుతూ వచ్చారు. కానీ పరిగణనలోకి తీసుకోలేదు. దరఖాస్తు గడువు ముగిశాక వెనక్కి వెళ్లి పాత తేదీలతో ధ్రువీకరణ పత్రాలను స్వీకరించడం చట్టబద్ధంగా నిబంధనలకు విరుద్ధమని, సాంకేతికంగా ఆయన దరఖాస్తును పరిశీలించలేమని చెప్పేసింది. ఆన్‌లైన్‌లో గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయలేదని దుర్గయ్య దరఖాస్తును పరిశీలించినప్పుడు పెద్ద అప్పలరాజు ఆన్‌లైన్‌లో తన తమ్ముడు విశ్వేశ్వరరావు నేషనల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయడమే కాకుండా, పుట్టిన తేదీల్లో కూడా తేడాలున్నాయి. దానిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేయాలి. కానీ అలా చేయలేదు. అప్పలరాజుకు తన తమ్ముడు సర్టిఫికెట్ తీసి, తన సర్టిఫికెట్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. అది కూడా జాబ్ వచ్చాక, అభ్యంతరాలు వచ్చిన తర్వాత. దీనివెనకున్న మర్మమేంటో ప్రభుత్వమే చెప్పాలి. సర్టిఫికెట్ అప్‌లోడ్ విషయంలో పొరపాటు జరిగిందని, వెరిఫికేషన్ సమయంలో ఆ సర్టిఫికెట్ మార్చడం జరిగిందని పెద్ద అప్పలరాజు మీడియా ముందు కూడా అంగీకరించారు.
అర్హత లేకపోయినా కూన రవికుమార్ సంతకంతో ఉద్యోగాలు
అర్హత లేని సంఘాల ద్వారా కూడా స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇందులో నిబంధనలు కూడా పాటించలేదు. దీనికి సాఫ్ట్‌బాల్ అసోసియేషనే ఉదాహరణ. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ గానీ మినిస్ట్రీ ఆఫ్ యూత్ సర్వీసెస్ గుర్తింపుగానీ లేదు. ఇది లేకుండా ఏ సంఘం పనిచేసే అవకాశం లేదు. 2021లో ఇచ్చిన ఫేక్ సర్టిఫికెట్ల కారణంగా సంఘం గుర్తింపు రద్దు అయ్యింది. గతంలో ఒక వ్యక్తి సాఫ్ట్‌బాల్ నేషనల్స్ అడకుండానే హైకోర్టు ఉద్యోగానికి స్పోర్ట్స్ కోటాలో సెలక్టయ్యాడు. అతడి సర్టిఫికెట్‌పై అనుమానం వచ్చి విచారణ చేయగా అతను నేషనల్స్ అడినట్లు చెబుతున్న తేదీల్లో ఒక కాలేజీలో పరీక్షలు రాస్తున్నట్లు తేలింది. దీంతో 2025 డిసెంబర్ 15న అసోసియేషన్ గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు అసలు గుర్తింపే లేకుండా డీఎస్సీ స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు ఎలా ఇచ్చారన్నది ప్రశ్న. జీవో–4 ప్రకారం నోట్ అని ఒక కాలమ్ ఇచ్చారు.
అందులో రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి లేదా ఫెడరేషన్ కార్యదర్శి సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా ఫెడరేషన్ కార్యదర్శి, అసోసియేషన్ కార్యదర్శితోపాటు అసోసియేషన్ అధ్యక్షుని హోదాలో ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా విచ్చలవిడిగా సర్టిఫికెట్లు ఇచ్చేశారు. అతని సర్టిఫికెట్లను కూడా పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆఖరికి శ్రీకాకుళం సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి రమణ భార్య లక్ష్మీదేవికి కూడా ఇదే కోటాలో ఉద్యోగం దక్కింది. శాప్ గుర్తింపు లేదంటూ రెజ్లింగ్ వంటి సంఘాలకు ఉద్యోగాలు నిరాకరించారు. అటువంటిది ఒలింపిక్ అసోసియేషన్ గాని కేంద్రం గుర్తింపు లేని సంఘం నుంచి ఉద్యోగాలివ్వడం వెనుక శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో సంబంధిత అసోసియేషన్ కార్యదర్శి సమక్షంలో ఈ ప్రక్రియ చేయాల్సి ఉండగా దీనికి భిన్నంగా శాప్ ఎండీకి కూడా సంబంధం లేకుండా శాప్ పరిపాలనా అధికారితో దీన్ని పూర్తి చేశారు. వాలీబాల్ అసోసియేషన్‌కు కూడా గుర్తింపు లేదని సమాచారం. ముఖ్యనేత అండ, భరోసా లేకుండా ఇలా చేయడం సాధ్యం కాదని డీఎస్సీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
పోస్టల్ డిపార్ట్‌మెంట్ నిరాకరించినా.. దగా డీఎస్సీలో ఉద్యోగం..
వెయిట్ లిఫ్టింగ్‌లో కతిల వెంకటలక్ష్మి తప్పుడు జనన ధ్రువీకరణ ఇచ్చారని రుజువు కావడంతో పోస్టల్ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం నిరాకరించారు. ఆమె 1992 మే 20న పుట్టినట్లు స్కూల్ సర్టిఫికెట్లలో ఉంటే 1993 మే 10 పుట్టినట్లుగా బోగస్ జనన ధ్రువీకరణ పత్రం సృష్టించి వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొనట్లు గుర్తించారు. తాజాగా డీఎస్సీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్‌లో మాత్రం ఉద్యోగం ఇచ్చేశారు.
నాట్ క్వాలిఫైడ్.. కానీ ఉద్యోగం..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కాట్రేనికోన మండలం గచ్చకాయలపోర జెడ్పీ హైస్కూల్‌లో తెలుగు పండిట్‌గా విధులు నిర్వహిస్తున్న మిరియాల గాయత్రి సాయిశ్రీ ఇటీవల సోషల్ (బ్యాక్‌లాగ్) కేటగిరీలో టీచర్ పోస్టు సాధించారు. అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ రిమార్క్‌లో నాట్ క్వాలిఫైడ్ అని ఉన్నా, బీఈడీకి సంబంధించి ఆమె సరైన ఆధారాలు సమర్పించకపోయినా ఫైనల్ లిస్టులో ఉద్యోగం ఎలా వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం డివైఈఓ కిషోర్ గాయత్రిని తన కార్యాలయానికి పిలిచి విచారణ చేపట్టారు. ఆమె విద్యార్హత పత్రాలు, కుల ధృవీకరణ, బీఈడీ సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. అనంతరం విచారణ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపినట్టు ఆయన తెలిపారు. 
సాఫ్ట్‌బాల్ సర్టిఫికెట్లపై అధ్యక్షుడి హోదాలో సంతకం చేసిన కూన రవికుమార్
నకిలీ పత్రాలతో అడ్డంగా దొరికిపోయారు..
దగా డీఎస్సీ నకిలీ సర్టిఫికెట్ల బాగోతంలో ఇదో కొత్త అంకం.. భార్యాభర్తలు ఒకే గేమ్ సర్టిఫికెట్‌లతో స్పోర్ట్స్ కోటా కింద రెండు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన షేక్ ఇమాంహుసేన్, అతని భార్య కరిష్మా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో జూడో ఛాంపియన్స్ అంటూ ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం వీరు కౌతాళం మండలంలో ఉర్దూ ఎస్జీటీగా ఇమామ్ హుసేన్, తెలుగు ఎస్జీటీగా కరిష్మా విధులు నిర్వహిస్తున్నారు. కానీ వీరు సమర్పించిన ధ్రువపత్రాల్లో స్థానికత వేరువేరుగా ఉన్నాయి. 73కిలోల విభాగంలో జూడో హరిక్రిష్ణ అనే వ్యక్తి స్పోర్ట్స్ సర్టిఫికెట్‌ను సవరించి అందులో పేరు మాత్రం మార్చి వీరి పేరుతో సర్టిఫికెట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు ఇమామ్ హుసేన్ స్వస్థలం ఒకచోట విశాఖ, మరో చోట దొర్నిపాడు అని, భార్య కరిష్మాది ఒక చోట దొర్నిపాడు అని మరోచోట విజయనగరం స్వస్థలాలుగా ఉన్నట్లు గుర్తించారు.
ఒకే వ్యక్తికి రెండు స్వస్థలాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ అనుమానం. దీనిని బట్టి ఇవీ తప్పుడు స్పోర్ట్స్ ధ్రువీకరణ పత్రాలే అని తెలిసిపోయింది. ఎక్కడైతే చదువుతున్నామో అక్కడి నుంచే స్పోర్ట్స్ ఆడాల్సి ఉంటుంది. కానీ 2014లో కర్ణాటకలో డీఈడీ చదువుతూ అదే ఏడాది 2014లో ఏపీలో జూడో పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి సర్టిఫికెట్ ఎలా పొందారన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. నొస్సం కరిష్మా ఇంటర్ 2011–2013లో చదివారు. 2014లో ఏదో ఒక కోర్సు చేస్తూ ఉండాలి. జూడో స్పోర్ట్స్ సర్టిఫికెట్లో మాత్రం 2014లో ఆడినట్లు ఉంది. కానీ ఆ సమయంలో ఆమె ఖాళీగా ఉంది. ఎందుకంటే డీఈడీ మాత్రం 2015–2017లో చేసినట్లు సర్టిఫికెట్ ఉంది. అంటే 2017లో డీఈడీ పూర్తి చేసి ఎలాంటి విద్యాభ్యాసం చేయకుండా ఉన్న 2014 సర్టిఫికెట్ ఎలా చెల్లుతుందనేది అనుమానం.


