బాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి: వైఎస్‌ జగన్‌ | YS Jagan tweet about AP DSC Chandrababu govt | Sakshi
Sakshi News home page

బాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి: వైఎస్‌ జగన్‌

Sep 5 2026 5:05 PM | Updated on Sep 5 2026 5:43 PM

YS Jagan tweet about AP DSC Chandrababu govt

సాక్షి, తాడేపల్లి: హలో ఇండియా.. అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. డీఎస్సీ కుంభకోణం, కొన్ని సామాజిక మాధ్యమ ఖాతాలను కనపడకుండా చేయడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. డీఎస్సీ 2025 నియామక కుంభకోణంలోని అంశాలు రోజురోజుకూ బయటపడున్నాయని చెప్పారు.

‘‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తూ తీవ్రమైన అక్రమాలను బయటపెడుతున్నాయి. దీనిపై నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు నిజానిజాలు వెలుగులోకి రావడానికి సీబీఐ విచారణకు అంగీకరించాల్సింది పోయి, టీడీపీ కూటమి ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తును నిరాకరిస్తోంది. ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్న గొంతులను అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది.

మెటా సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో డీఎస్సీ నియామక కుంభకోణంపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రతిపక్ష పార్టీలు, మీడియా వేదికలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తుల పోస్టులు, ఖాతాలను పరిమితం చేయడం, తొలగించడం లేదా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాల్లో కనిపించకుండా చేయడం జరుగుతోంది. ఇందుకు మెటా “చట్టపరమైన అవసరాలు” కారణంగా పేర్కొంటోంది’’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

‘సోషల్‌’ ఖాతాలపై ఆంక్షలు 
ఈ ఆంక్షలకు గురైన ఖాతాల పేజీల్లో ఫేస్‌బుక్‌లో సాక్షి టీవీ, ఇన్‌స్టాగ్రామ్‌లో సాక్షి డిజిటల్, బిగ్ టీవీ, జగన్‌అన్న కనెక్ట్స్‌తో పాటు ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్న ఇతర వ్యక్తిగత ఖాతాలు కూడా ఉన్నాయని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ‘‘ఇది కేవలం డీఎస్సీ కుంభకోణంతో ఆగిపోవడం లేదు. అవినీతి, వైఫల్యాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలులో వైఫల్యం, అధికార దుర్వినియోగం లేదా అధికార అహంకారంపై టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటున్నారు.  ప్ర  శ్ని  స్తోంది

ప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు ప్రశ్నలు అడిగేవారి గొంతును అణచివేస్తున్నారు. ఇది పాలన కాదు. ఇది సెన్సార్‌షిప్. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నాయి. రాజకీయంగా అసౌకర్యంగా ఉన్న ప్రశ్నలు అడుగుతున్నారనే కారణంతో ప్రతిపక్షాన్ని, మీడియాను, కార్యకర్తలను లేదా పౌరులను నోరు మూయించే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు’’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

దేనికి భయపడుతున్నారు?
చంద్రబాబు నాయుడు దేనికి భయపడుతున్నారని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నలకా? సమాధానాలకా? అని అన్నారు. ‘‘డీఎస్సీ నియామకంలో ప్రతిరోజూ వెలుగులోకి వస్తున్న ఆధారాలు తప్పు అని మీరు చెబుతున్నట్లయితే, ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలతో వాటిని ఖండించండి. సీబీఐ విచారణను ఎందుకు నిరాకరిస్తున్నారు? ఈ ఆరోపణలను బయటపెడుతున్న వారి గొంతులను ఎందుకు అణచివేస్తున్నారు? వారి పోస్టులు, ఖాతాలను ఎందుకు పరిమితం చేస్తున్నారు?

ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలను తొలగించలేరు. ఒక ఖాతాను నిరోధించినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోండి, ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పండి, రాజ్యాంగబద్ధంగా పాలించండి. డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? టెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సమర్థించుకుంటారు?’’ అని నిలదీశారు.

అవినీతి వాసనను వెదజల్లుతున్నాయి 
క్రీడా కోటాకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి, నియామకాల తర్వాత ఆ క్రీడా కోటా ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేశారని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. ‘‘అయినా ఆ ఉత్తర్వుల కింద నియమితులైన అభ్యర్థులు ఇప్పటికీ ఉద్యోగాల్లో కొనసాగడం, నియామకాలకు ముందు మార్గాలను తెరిచి, నియామకాల తర్వాత మార్గాలను మూసివేయడం. ఇవన్నీ అవినీతి వాసనను వెదజల్లుతున్నాయి.

ఈ సెన్సార్‌షిప్ చర్యల్లో పరిమితం చేసిన ప్రతి ఖాతా, పోస్టు, కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని కోరుతున్నాను. డీఎస్సీ 2025 నియామకాలు స్వచ్ఛంగా, పారదర్శకంగా జరిగాయని మీరు చెబుతున్నట్లయితే, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని చంద్రబాబు నాయుడిని, ఆయన ప్రభుత్వాన్ని నేను సవాల్ చేస్తున్నాను.

స్వతంత్ర దర్యాప్తు నిజానిజాలను తేల్చనివ్వండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ ఆరోపిత అక్రమాలకు బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి. ఖాతాలను పునరుద్ధరించండి. సెన్సార్‌షిప్‌ను ఆపండి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి. దాచాల్సిందేమీ లేకపోతే, దేనికి భయపడుతున్నారు?’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement