సాక్షి, అనకాపల్లి: చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువేనని.. ఇది దేవుడు చెప్పిన సత్యం అని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో ఎక్కడ చూసినా మైనింగ్ జరుగుతుంది. ఏపీ గంజాయి మత్తులో తూగుతోంది. వాస్తవాలను చెబుతున్నప్పుడు సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేసే అధికారం ఎవరిచ్చారు?’’ అంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
‘‘వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు పదివేలకు పైగా డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చాము. సుమారు లక్షల 50 వేల సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎక్కడైనా మాపై ఒక చిన్న ఆరోపణ వచ్చిందా? ఎక్కడైనా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆధారాలు లభించాయా?. వైఎస్ జగన్ పాలనలో ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరిగింది. కూటమి పాలనలో స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఒక జీవో తీసుకువచ్చారు. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేశారు’’ అంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీఎస్సీలో ఉద్యోగాల కోసం బేరాలు పెట్టారు. శాసనమండలిలో చర్చకు రమ్మంటే తోక ముడిచి పారిపోయారు. విశాఖ నగరాన్ని సర్వనాశనం చేశారు. గీతం యూనివర్సిటీకి వేల కోట్లు చేసే భూములు అప్పగించారు. ఎవడబ్బ సొమ్ము అని 3 వేల కోట్లు ధారాదత్తం చేస్తారు?. గ్రావిటీ ద్వారా పోలవరం ఎడమ కాలువకు నీరు ఇవ్వాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం చివరికి నీరు ఇవ్వాలి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇచ్చి గోదావరి జలాలు ఇచ్చామని ప్రచారం చేస్తారా?. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది వైఎస్సార్.. అందుకు నేను సాక్ష్యం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి గెలిచి తీరాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబులా పారిపోయే మనస్తత్వం వైఎస్ జగన్‌ది కాదు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.


