సాక్షి, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా డీఎస్సీ అక్రమాలు బయటపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా బండారం బయటపడింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజుపై ఫిర్యాదులు వచ్చాయి. ఉద్యోగం పొందిన వ్యక్తి పేరు “పెద్ద అప్పలరాజు” కాగా, “పాండ అప్పలరాజు” పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేశారు. శాప్ పోర్టల్‌లో అభ్యర్థి తమ్ముడి పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను ఎందుకు అప్‌లోడ్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా, సర్టిఫికెట్‌ను మూడు సార్లు ఎందుకు మార్చారు? అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ..
ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ డీఎస్సీ నూయామకాల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బ్లైండ్ సెర్టిఫికెట్‌తో ఒక వ్యక్తి ఉద్యోగం పొందాడని మరో మహిళా అభ్యర్థి ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్‌ని స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇవ్వాలని సాక్షి మీడియా కోరగా.. జాబితా ఇవ్వకూడదని.. ఉన్నతాదికారుల ఆదేశాలు పాటిస్తున్నామని డీఈవో తెలిపారు. ఏ సమాచారం కావాలన్నా లిఖిత పూర్వకంగా కోరితే ఆర్‌జేడీకి పంపుతామంటూ వెల్లడించారు.
కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా పోస్టింగులు..
కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా డీఎస్సీ అభ్యర్థుల పోస్టింగులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంకకు చెందిన గాయత్రి సాయిశ్రీకి కాట్రేనికోన మండలం బ్రహ్మసమేద్యం పోస్టింగ్ ఇచ్చారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ రిమార్క్స్‌లో నాట్ క్వాలిఫైడ్ అని అధికారులు రాశారు. ఆమె బీఈడీ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఫైనల్ లిస్ట్‌లో మాత్రం బాక్సింగ్ స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం.. ఉద్యోగం ఇచ్చేసింది. బీఈడీ సర్టిఫికెట్లు లేకపోయినా అధికారులు ఎలా ఉద్యోగం ఇచ్చారో స్పష్టం కాలేదు. 11 సార్లు తెలుగు టెట్ రాసిన ఆమెకు సోషల్ స్కూల్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ పోస్టింగ్‌పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు పండిట్‌కు సోషల్ పోస్టింగ్ ఎలా ఇచ్చారో అధికారులు స్పష్టం చేయలేదు.
రిజర్వేషన్లలోనూ గోల్‌మాల్
వైఎస్సార్ జిల్లాలోనూ డీఎస్సీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. రిజర్వేషన్లలోనూ గోల్‌మాల్ చేసి అభ్యర్థులు ఉద్యోగం పొందినట్లు తేలింది. వైఎస్సార్ జిల్లాలో బీసీ–ఈ అభ్యర్థి మనూర్ రసూల్ ఓసీ కింద ఉద్యోగం పొందారు. 2008, 2012, 2018 డిఎస్సీల్లో తాను బీసీ–ఈ కేటగిరీగా నమోదు చేసుకున్న రసూల్.. 2025 డిఎస్సీలో మాత్రం తాను ఓసీ (ఈడబ్ల్యూఎస్) కింద దరఖాస్తు చేసుకుని ఉద్యోగం పొందారు.
రసూల్ చేసిన అవకతవకల వల్ల తనకు ఉద్యోగం రాలేదని రాయచోటికి చెందిన జమీల్ ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని జమీల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా రిజర్వేషన్లనే మార్చేసి అక్రమంగా ఉద్యోగం పొందడంపై చంద్రబాబు సర్కార్ నోరు విప్పడం లేదు. ఏడాదిగా ఈ అంశంపై జిల్లా యంత్రాంగం విచారణ చేస్తూనే ఉన్నారు. రసూల్ చేసిన అక్రమాలపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన ఉద్యోగం ఇప్పించాలని జమీల్ కోరుతున్నారు.
విద్యా శాఖ ప్రకటనతో అనుమానాలు
కర్నూలు డీఎస్సీ అక్రమాలు కప్పి పుచ్చేందుకు విద్యాశాఖ ప్రయత్నం చేస్తోంది. విద్యాశాఖ ప్రకటనతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ అంతా పారదర్శకం అంటూ విద్యాశాఖ మీడియా ప్రకటన చేసింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం, వల్లూరు ఎంపీపీఎస్ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్, SGT(తెలుగు)గా ఎంపిక, పోస్టింగ్ ప్రక్రియలో అక్రమాలపై పాఠశాల విద్యా శాఖ వివరణ ఇచ్చింది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఘటన గురించి తెలిసిన వెంటనే శాఖాపరమైన దర్యాప్తును విద్యా శాఖ ప్రారంభించింది.
ఉన్నతాధికారులు విచారణ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. కర్నూలు డీఈవో విచారణను ప్రారంభించి, సమగ్ర పరిశీలన కోసం సంబంధిత రికార్డులను, వెరిఫికేషన్ ఫైళ్లను తెప్పించారు. విచారణ నివేదిక అందగానే, రిక్రూట్మెంట్, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని.. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో సంపూర్ణ పారదర్శకత, ప్రతిభ ఆధారిత ఎంపిక, విధానాన్ని అవలంభించామని పాఠశాల విద్యాశాఖ పునరుద్ఘాటిస్తోంది.


