సాధారణ సుద్దముక్క.. ఆ మనిషి చేతిలో పడితే లక్షల తలరాతలు మార్చగలదు. మామూలు నల్లబల్ల.. ఆ వ్యక్తి
ముందు పెడితే పేద బతుకులను మార్చే ఆయుధంగా మారగలదు. నాలుగు గోడల ఓ చిన్న గది.. ఆ రూపం నిలుచుంటే చాలు గర్భగుడి అంత పవిత్రత పొందగలదు. గురువు గొప్పదనమది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం. బతుకుల్లో దీపాలు వెలిగిస్తున్న గురువులు మన వద్దా ఉన్నారు. శిష్యుల మనసులు గెలిచిన టీచర్లు అన్ని చోట్లా కనిపిస్తున్నారు.
– టెక్కలి/జి.సిగడాం/ఇచ్ఛాపురం రూరల్/నరసన్నపేట
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని తుమ్మ వీధిలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఫౌండేషన్ స్కూల్‌లో ఎస్‌జీటీగా పనిచేస్తున్న పేడాడ వేదవతి పాటల ద్వారా బోధన సాగిస్తూ విద్యార్థుల మనసులు గెలుచుకుంటున్నారు. ఇప్పటికీ పదహారేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఈమె కరోనా సమయంలో తన పిల్లలు ఓ యూట్యూబ్ చానెల్ పెట్టి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండడాన్ని గమనించారు. దీంతో తాను సాగిస్తున్న బోధనపై ఓ చానెల్ పెట్టాలని యోచించి పీవీవీ సాంగ్స్ పేరిట ఓ చానెల్‌ను సిద్ధం చేశారు. ఆ చానెల్‌లో భక్తి పాటలు అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. పాఠశాలలు పునః ప్రారంభమైన తర్వా త తోటి ఉపాధ్యాయులు భక్తి పాటలతో పాటు తరగతిలో బోధిస్తున్న తీరును చానెల్‌లో అప్‌లోడ్ చేస్తే బాగుంటుందని అవి కూడా అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టారు. ఈ చానెల్‌కు ఇప్పటివరకు 1,44,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉండగా 19 కోట్ల వ్యూయర్‌షిప్ ఉంది. ఏడాదికాలంగా తుమ్మా వీధి పాఠశాలలో పనిచేస్తున్న ఈమె అంతకుముందు నగరంలోని రెల్ల వీధి ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు. ఈమె అక్కడ విధుల్లో చేరిన సమయానికి 40 మంది విద్యార్థులు ఉండగా ఈమె బోధిస్తున్న తీరు పిల్లలకు బాగా ఇష్టపడడంతో విద్యార్థుల సంఖ్య 42 నుంచి 70 కు పెరిగింది. దీంతో ఉపాధ్యాయ పోస్టులు కూడా ఐదుకు పెరిగాయి.
ప్రత్యేక సెలవులు వినియోగించుకోని వేదవతి
ఉపాధ్యాయులకు ఏటా 27 వరకు సాధారణ సెలవులు ఉండగా మెడికల్ లీవ్, చైల్డ్ కేర్ లీవ్, ఎర్నడ్ లీవ్ వంటి ప్రత్యేక సెలవులు ఉన్నప్పటికీ పదహారేళ్లలో వీటిని ఏనాడూ ఉపయోగించుకున్న దాఖలా లు లేవు.


