గొంతు ఎండనీ.. కళ్లు తిరగనీ..! | - | Sakshi
Sakshi News home page

గొంతు ఎండనీ.. కళ్లు తిరగనీ..!

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

గొంతు ఎండనీ.. కళ్లు తిరగనీ..! ● పాఠశాలల్లో అందని శుద్ధజలం ● కూటమి ప్రభుత్వంలో మూలకుచేరిన ఆర్వోప్లాంట్లు ● ఉద్దానంలో తల్లిదండ్రుల ఆందోళన ● పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

రక్షిత మంచి నీటినే వాడాలి

ఆర్వో ప్లాంట్లు మంజూరు చేయాలి

● పాఠశాలల్లో అందని శుద్ధజలం ● కూటమి ప్రభుత్వంలో మూలకుచేరిన ఆర్వోప్లాంట్లు ● ఉద్దానంలో తల్లిదండ్రుల ఆందోళన ● పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

ఇచ్ఛాపురం రూరల్‌:

చ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామానికి చెందిన బుంగ యోగి(15) స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు చూపించారు. పిడుగులాంటి వార్త.. చిన్నతనంలోనే రెండు కిడ్నీలు పాడైపోయినట్లు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకును రక్షించుకోవడానికి ఆ తల్లిదండ్రులు రూ.లక్షలు అప్పు చేసినా ప్రయోజనం కనిపించలేదు. చదువుకుంటూనే ఐదు నెలల్లో నూరేళ్లు నిండిపోయాయి. ఇలా ఉద్దానంలో ఎంతోమంది విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారు.

విద్యార్థుల ఆరోగ్యం బాగుండాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పలు పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం వాటిలో అనేకం నిర్వహణ లేక మూలకుచేరడంతో విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీరు అందని పరిస్థితి నెలకొంది. కొనిచోట్ల ప్లాంట్లు పనిచేయకపోవడంతో విద్యార్థులు ఇంటి వద్ద నుంచే బాటిళ్లలో నీటిని తీసుకురావాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో 2020, 2021 సంవత్సరంలో జిల్లాలోని 1,217 పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీటి నిర్వహణ బాధ్యత ఏపీఈడబ్లూఐడీసీ, ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌అండ్‌బీ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ శాఖలకు అప్పగించింది. 2024 వరకు సకాలంలో సర్వీసింగ్‌ ఫిల్టర్ల మార్పు, చిన్నపాటి మరమ్మతులు చేపట్టిన సంబంధిత శాఖలు, 2024 ఎన్నికల అనంతరం వీటి నిర్వహణపై అశ్రద్ధ చూపించాయి. స్థానిక ఉపాధ్యాయుల ఫిర్యాదుల మేరకు ఈ ఏడాది వేసవి సెలవుల్లో టెక్నికల్‌ సిబ్బంది వచ్చి తూతూమంత్రంగా మరమ్మతులు చేపట్టినప్పటికీ.. కొన్ని పాఠశాలల్లో అవి పనిచేయడం లేదని సమాచారం. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల గొంతు ఎండుతోంది. కొన్నిచోట్ల అందుబాటులో ఉన్న నీటినే విద్యార్థులు వినియోగించాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం

విద్యార్థుల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో బాలల ఆరోగ్య సురక్ష పథకం ద్వారా పాఠశాలల్లో విద్యార్థులకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించేవారు. ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య సిబ్బంది పాఠశాలలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేవారు. ఎత్తు, బరువు, రక్త పరీక్షలు, కంటిచూపు, దంతాలు తదితర ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన వారికి వైద్య సేవలు అందించేవారు. పరీక్షల వివరాలను హెల్త్‌కార్డుల్లో నమోదు చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా వైద్య పరీక్షలు క్రమంగా కనుమరుగయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

విద్యార్థులు తప్పనిసరిగా రక్షిత మంచినీటినే వాడాలి. పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు లేకపోతే ఇంటి వద్ద నుంచి మంచినీరు తీసుకెళ్లాలి. ప్రస్తుతం వర్షాకాలం దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యంపై అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయు లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతీ మూడు నెల లకు ఒకసారి దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించుకుంటే మంచిది.

– డాక్టర్‌ వై.కల్యాణి,

ప్రభుత్వ వైద్యాధికారి, కొళిగాం

మా గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నా యి. ఉన్నత పాఠశాలకు ఆర్వో ప్లాంటు లేకపోగా, ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంటు ఉన్నప్పటికీ మూల కు చేరింది. దీంతో విద్యార్థులు తాగేందుకు శుద్ధ జలం లేకుండా పోవడంతో ఇంటి నుంచి వాటర్‌ బాటిల్స్‌ తీసుకెళ్తున్నారు. అధికారులు స్పందించి ప్రతినెలా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉద్దానం ప్రాంతంలో అన్ని పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. – దున్న గురుమూర్తి, బూర్జపాడు, ఇచ్ఛాపురం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement