శ్రీకాకుళం క్రైమ్ : ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ మోసానికి గురైతే తక్షణమే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, ఓటీపీ, బ్యాంకింగ్, సోషల్ మీడియా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్ వంటి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు ఇతరులతో పంచుకోవద్దన్నారు. ఏటీఎంల వద్ద అపరిచిత వ్యక్తులు ఫోన్ పే చేస్తామన్నా.. లేదా ఫోన్‌పే చేయండన్నా స్పందించవద్దన్నారు. నారీ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలు, బాలికల భద్రతకు అందుబాటులో ఉన్న శక్తియాప్ వినియోగించాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం ఇవ్వాలన్నారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వలన ఆరోగ్య, ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అనర్థాలు జరుగు తాయన్నారు. అభయం హెల్మెట్ కార్యక్రమం ద్వా రా అవగాహన కల్పించి ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన ఐఎస్‌ఐ ప్రమాణాలతో కూడిన హెల్మెట్లు వాడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ద్విచక్రవాహనంపై వెనక కూర్చొన్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలన్నారు.


