ఎందుకో తెలుసు! | - | Sakshi
Sakshi News home page

ఎందుకో తెలుసు!

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

ఎందుకో తెలుసు! నోటి దురుసు..

మారని ఎమ్మెల్యే కూన రవి తీరు చంద్రబాబు దృష్టిలో పడేందుకు తాపత్రయం మంత్రి పదవి కోసం ఆరాటం జెడ్పీలో ప్రతి సారీ వీరావేశం ప్రతిపక్షంపై నోరుపారేసుకుంటే చంద్రబాబు మంత్రి పదవి ఇస్తారని ఆశ

ప్రతిపక్షంలో దారుణాలెన్నో..

అధికారంలోకి వచ్చినా..

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

‘కాళింగ సామాజిక వర్గం తరఫున ఎవరికీ కేబినెట్‌లో చోటు దక్కలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడ్డారు. కింజరాపు ఫ్యామిలీలోనే ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేశారు. చంద్రబాబుపై ఆ సామాజిక వర్గమంతా గుర్రుగా ఉంది. కూన రవికుమార్‌ను చంద్రబాబు పట్టించుకోలేదు.’

ఇదీ కూన రవికుమార్‌పై ఆ పార్టీలోని కాళింగ సామాజిక వర్గంలో ఉన్న సానుభూతి. ఆ సానుభూతిని దాటి చంద్రబాబు దృష్టిలో మరింత పడేందుకు కూన రవికుమార్‌ ఆపసోపాలు పడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి వీరావేశం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా జెడ్పీ సమావేశాల్లో సైతం జెడ్పీటీసీలు గొంతెత్తాల్సిన చోట కూన రవికుమార్‌ పెద్ద ఎత్తున గొంతెత్తి అంతెత్తున లేస్తున్నారు.

కూన రవి నోటి దురుసు గురించి జిల్లాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సంబంధించి ఆడియో, వీడియోలు సంచలనం రేపాయి.

పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సమయంలో కోవిడ్‌ నిబంధనల మేరకు కొందరే రావాలని పోలీసు అధికారులు అన్నందుకు ‘జాగ్రత్త.. శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త.. ఎవడక్కడ.. మీ స్థాయి ఎంత.. మీరు ఎంత’ అని నరసన్నపేట సీఐ, ఎస్‌లను ఉద్దేశించి నోరు పారేసుకున్నారు.

పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్‌లోనే ‘నేను ఖాళీ చేయను, నువ్వు మర్యాదగా బీహేవ్‌ చేస్తే ఫర్వాలేదు, నువ్వేగాని అక్కడేమైనా చేస్తే చాలా సీరియస్‌గా ఉంటుంది’ అని బెదిరించారు.

పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీకి ‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను’ అంటూ బెదిరించారు.

పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే ‘కుర్చీలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా’ అని పంచాయతీ కార్యదర్శులను భయపెట్టారు.

ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్‌చార్జి ఈఓపీఆర్‌డీపై ‘నీకెంత ఒల్లు బలిసిందిరా.. నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు.

మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టలేదని పొందూరు తహసీల్దార్‌పై ‘పట్టుకున్న వాహనాలు విడిచి పెట్టకపోతే లంచం డిమాండ్‌ చేశావని నీ మీద కంప్లైంట్‌ చేస్తాను.’ అంటూ విరుచుకుపడ్డారు.

‘నా ఇంటి లోపలకు నువ్వు పోలీసులను పంపిస్తే నీ కాళ్లు ఇరగకొట్టకపోతే చూద్దువుగాని..’ అంటూ శ్రీకాకుళం టూటౌన్‌ పోలీసులపై జులుం చూపించారు.

అధికారం దక్కాక కూడా కూన తీరు మారలేదు. ప్రెస్‌మీట్లు, మిగతా సమావేశాలు పక్కన పెడితే జిల్లా పరిషత్‌ సమావేశాల్లో ఆయన వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. జెడ్పీ సమావేశాల్లో సభ్యులుగా జెడ్పీటీసీలకు చాన్స్‌ ఇవ్వాలి. కానీ కూన రవికుమార్‌ ఎవరినీ మాట్లాడనివ్వకుండా ఆయనే మాట్లాడుతున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. పెద్ద పెద్ద అరుపులు, కేకలతో జెడ్పీ దద్దరిల్లిపోతోంది. గొడవకు వచ్చారా అన్నట్టుగా మాట్లాడుతుండడంతో కూన రవికుమార్‌ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కరుణిస్తారో లేదో గానీ ఈ అరుపులతో విమర్శలకు కేంద్ర బిందువు అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement