చర్చలు ఫలించే వరకూ పోరాటం ఆగదు | There is no change in the agitations action plan says AP JAC | Sakshi
Sakshi News home page

చర్చలు ఫలించే వరకూ పోరాటం ఆగదు

Sep 5 2026 4:07 AM | Updated on Sep 5 2026 4:07 AM

There is no change in the agitations action plan says AP JAC

ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి స్పష్టీకరణ 

చర్చలకు ఆహ్వనించినా ఉద్యమ కార్యాచరణలో మార్పుండదు 

పీఆర్సీ కమిషన్‌ వేయాలి.. ఐఆర్‌ వెంటనే ప్రకటించాలి 

ఐదు పెండింగ్‌ డీఏలు, రూ.40 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి

సాక్షి, అమరావతి:  ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం తమ ఉద్యమానికి తొలి విజయమని, చర్చలు ఫలించే వరకు తమ పోరాటం ఆగదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు స్పష్టం చేశారు. ఉద్యోగులు సంఘాలకు అతీతంగా తమకు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం స్పందించిందని చెప్పారు. తక్కువ కాల పరిమితితో పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, జాప్యం జరిగినందున వెంటనే ఐఆర్‌ మంజూరు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయడంతో పాటు రిటైర్డ్‌ ఉద్యోగులకు అదనపు పింఛను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. 

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయడం, గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు ప్రత్యేక సర్వీస్‌ రూల్స్‌ రూపొందించడం వంటి డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్న విద్యుత్‌ బస్సులను ప్రైవేట్‌ ఆపరేటర్లకు అప్పగించకుండా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలన్నారు. జూలై 22న జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి తరఫున ప్రస్తావించిన ఇతర 30 డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరారు. మొత్తంగా రూ.40 వేల కోట్ల బకాయిలు చెల్లించాలన్నారు. 

శనివారం జరిగే చర్చల్లో ఉద్యోగుల న్యాయమైన ఆర్థిక డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినా, ఇప్పటికే ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. శనివారం భోజన విరామ సమయంలో ‘డిమాండ్స్‌ డే’ నిరసనలు యథాతథంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement