బాలిక, కిడ్నాపర్ హరియాణాలో దొరికినట్లు పోలీసుల వెల్లడి
ఇద్దరినీ గుంటూరు తీసుకువస్తున్న పోలీసులు
దాదాపు మూడు నెలల కిందట బాలికను తీసుకువెళ్లిపోయిన జాన్ సైదా
తల్లిదండ్రులు ఎంతగా వేడుకొన్నా మూడు నెలలుగా ఆచూకీ కనిపెట్టని పోలీసులు
హైకోర్టు ఆదేశించిన 24 గంటల్లోనే వారు దొరికినట్లు చెప్పడంపై అనుమానాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: దాదాపు మూడు నెలల కిందట మాయమైన బాలిక ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదని చెబుతున్న పోలీసులు.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం, హెచ్చరికల నేపథ్యంలో బాలికను, ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ హరియాణా రాష్ట్రం కర్నాల్ నగరంలోని ఓ లాడ్జిలో ఉండగా సిట్ బృందం అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. వారిద్దరినీ గుంటూరు తీసుకువస్తున్నారు. మూడు నెలలుగా ఆచూకీ కనిపెట్టలేకపోయిన పోలీసులు.. సోమవారానికల్లా బాలిక ఆచూకీ కనిపెట్టి కోర్టులో హాజరు పరచాలని ఆదేశించిన 24 గంటల్లోనే అంత దూరంలో ఉన్న వారిని ఎలా పట్టుకోగలిగారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇప్పటి వరకు వదిలేయడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా, దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన నిందితుడు షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బాని అలియాస్ పండు ఆమెను జూన్ 9న తీసుకెళ్లిపోయాడు. ఆ సమయంలో బాలిక ఇంటి నుంచి 200 గ్రాముల బంగారం తీసుకెళ్లింది. ఆ బంగారంలో సగం వరకు అమ్మేసిన కిడ్నాపర్ సైదా మూడు నెలలపాటు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
బాలిక అశ్లీల వీడియోలు, ఫొటోలు తన వద్ద ఉన్నాయని, తన వెంట రాకపోతే గ్రూపుల్లో షేర్ చేస్తానంటూ బెదిరించి బాలికను తీసుకెళ్లినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు చెబుతున్నారు. షేక్ జాన్ సైదా సెల్‌ఫోన్‌ను స్వాదీనం చేసుకుని, అందులో బాలిక వీడియోలు, ఫొటోలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, పూర్తి విచారణ అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు చెబుతున్నారు. కిడ్నాపర్‌కు ఎవరెవరు సహకరించారనేది విచారణలో తేలుతుందని, దాన్ని బట్టి వారిపైనా కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు చెబుతున్నారు.
ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేదు?
బాలిక కనిపించడం లేదంటూ ఆమె తండ్రి జూన్ 10న ఫిర్యాదు చేసినా గుంటూరు పట్టాభిపురం పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. అన్ని ఆధారాలు ఇచ్చినా, వారి ఖర్చులు భరించినా కాలం వెళ్లదీశారు. పైగా షేక్ సైదా చేతనైతే పట్టుకోవాలని పోలీసులకు సవాలు కూడా విసిరాడు. అతడి గురించి సమాచారం ఉన్నా పట్టుకొని తీసుకురావడంలో పోలీసులు ఘోరంగా విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. చివరకు బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గురువారం పోలీసులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారానికల్లా బాలిక ఆచూకీ కనిపెట్టి, హాజరుపరచాలని గట్టిగా హెచ్చరించడంతో దిగివచ్చిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
పోలీసులకు అధికారపార్టీ నేతలు, ఉన్నతాధికారుల అండ?
బాలిక కిడ్నాప్ కేసును ఛేదించడంలో మూడు నెలలుగా నిర్లక్ష్యం వహించిన పట్టాభిపురం పోలీసులపై చర్యలు తీసుకుంటారా లేక వదిలేస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాలిక కిడ్నాప్‌పై స్పందించకపోవడం వెనుక పెద్ద తలకాయలే ఉంటాయన్న అనుమానాలున్నాయి. బాలిక తండ్రి పోలీసుల చుట్టూ తిరుగుతూ.. వారికి స్వయంగా కార్లు, ఫ్లైట్ టికెట్లు పెట్టి సహకరిస్తున్నా నిందితుడిని పట్టుకోకపోవడం వెనుక పెద్ద వ్యక్తులు ఉంటారని తేటతెల్లమవుతోంది. పట్టాభిపురం పోలీసులపై చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ నేతలు, కొందరు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


