నెర్రెలిచ్చిన ఆశలు.. బీడువారిన బతుకులు | Sakshi ground report on the hardships and losses faced by farmers | Sakshi
Sakshi News home page

నెర్రెలిచ్చిన ఆశలు.. బీడువారిన బతుకులు

Sep 5 2026 3:30 AM | Updated on Sep 5 2026 3:30 AM

Sakshi ground report on the hardships and losses faced by farmers

వర్షాలు లేక ఎండుతున్న పంట పొలాలు

చేలకు చేరని సర్కారువారి ఉచిత విద్యుత్‌ సరఫరా  

ఇచ్చేది 6 నుంచి 7 గంటలే..అదీ వారంలో ఐదు రోజులు 

మరమ్మతులు, నిర్వహణ పేరుతో రెండు రోజులపాటు కోత 

ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటున్న అన్నదాతలు 

ఉచిత విద్యుత్‌ అందక రైతులు పడుతున్న కష్ట–నష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు  

(గవరవరం నుంచి సాక్షి ప్రతినిధి) :  ఈ చిత్రంలోని రైతు పేరు పలివెల వరదయ్య. సొంత పొలం ఎకరంతో పాటు మరి కొంత కౌలుకు తీసుకుని గవరవరంలో వ్యవసాయం చేస్తున్నారు. ‘ఓ వైపు వర్షాలు తగ్గిపోయాయి. మరోవైపు కరెంటు లేదు. వారం రోజులకు ఒకసారి మాత్రమే చేనుకు నీరు అరకొరగా పెట్టుకోగలుగుతున్నాం. ఈ పంటకు వారం అయినా నీరు లేకపోవడంతో నెర్రె కొట్టేసింది. ఇక పంట పోయినట్టే. కౌలు కింద రూ.40 వేలు ముందే చెల్లించేశాం. 

పెట్టుబడులకు ఎకరాకు ఇంకో రూ.30 వేలు ఖర్చుచేశాం. ఇప్పుడు అదంతా పోయినట్టే. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు.’ అంటూ కంట తడిపెట్టారు..ఇది కేవలం వరదయ్యకు వచ్చిన కష్టం మాత్రమే కాదు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల కన్నీటి వ్యధకు ప్రత్యక్ష సాక్ష్యం. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ఉచిత విద్యుత్‌ అందక రైతులు పడుతున్న అగచాట్లపై ఏలూరు జిల్లా గవరవరం గ్రామం నుంచి  ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌..

తీగలపై బట్టలారేసుకోవడమే..
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందిస్తామంటే ‘ఉచిత విద్యుత్‌ ఇస్తామనేది పచ్చి అబద్ధం..తీగలపై బట్టలు ఆరేసుకోవడమే’ అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన అధికారంలో నిజంగా అదే పరిస్థితి వచ్చిందంటున్నారు అన్నదాతలు. రాష్ట్రంలో దాదాపు 22 లక్షల వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులున్నాయి. వాటి ఆధారంగా లక్షలాది ఎకరాలకు సాగు నీరును బోర్ల ద్వారా వినియోగించుకుంటున్నారు రైతులు. 

అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి కష్టకాలం మొదలైంది. ముఖ్యంగా విద్యుత్‌ సరఫరాలో నాణ్యత కరువైంది. రెండు, మూడు గంటలు కోతతో రోజులో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దానివల్ల తడిచిన చేనే మళ్లీ తడపాల్సి వస్తోంది. మరమ్మతులు, నిర్వహణ పేరుతో వారంలో ఒకటి, రెండు రోజులు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఫలితంగా నేల ఎండిపోయి, పంటలు దెబ్బతింటున్నాయి. 

9 గంటలు విద్యుత్‌ సరఫరా అబద్ధం
వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని విద్యుత్‌ పంపిణీ సంస్థలు చెబుతున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయానికి 10,948.65 మిలియన్‌ యూనిట్లు (1,094.87 కోట్ల యూనిట్లు) విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని అంటున్నాయి. ఇందులో ఏపీ ఎస్పీడీసీఎల్‌ 6,352.86 మిలియన్‌ యూనిట్లు, ఏపీ సీపీడీసీఎల్‌ 2,149.24 మిలియన్‌ యూనిట్లు, ఏపీ ఈపీడీసీఎల్‌ 2,446.55 మిలియన్‌ యూనిట్లు ఇస్తున్నట్లు లెక్కల్లో చూపిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం పగటి పూట 9 గంటలు విద్యుత్‌ సరఫరా అనేది లేనే లేదు. కేవలం 6 నుంచి 7 గంటలే వస్తోందని రైతులు స్పష్టం చేస్తున్నారు. అదైనా నిరంతరాయంగా ఇస్తున్నారా అంటే అదీ లేదు.  విడతల వారీగా పగలు, రాత్రీ అనే తేడా లేకుండా ఇవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ పొలాల్లో భయంతోనే గడుపుతున్నారు. మరోవైపు కొత్త వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం ఎదురుచూసూ్తనే ఉన్నారు. దాదాపు 45 వేల కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఓ అంచనా.

ఒక్క ఎకరాకూ నీరు అందడం లేదు.. 
పదెకరాల్లో వరి సాగు చేశాను. ఒక్క ఎకరానికి కూడా నీరు అందడం లేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 7–8 గంటలే వస్తోంది. అది కూడా విడతల వారీగా ఇస్తున్నారు. దాని వల్ల శివారు భూములకు నీరు అందడం లేదు. రాత్రి పూట రెండు గంటలు ఇస్తుంటే రైతు ఆసమయంలో పొలంలోకి వచ్చి ఎలా చేలకు నీరు పెట్టుకోగలడు.  – గంటా రమేష్, రైతు, గవరవరం 

పెట్టుబడి కూడా రాదు..
ఎకరా కౌలు రూ.40 వేలు, దుక్కులకు రూ.3 వేలు, ఊడ్పులకు రూ.5 వేలు, నారుమడికి రూ.2 వేలు, ఇవి కాకుండా మూడుసార్లు ఎరువులు వేయాలి. అంతా కలిపి ఎకరాకు రూ.70 వేల వరకు పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయి. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ రావడం లేదు. గతంలో రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వమే బీమా డబ్బులు చెల్లించేది. ఇప్పుడు అదీ లేదు. – బిరుదుగడ్ల ప్రేమ్‌కుమార్, రైతు, గవరవరం 

పంట మొత్తం ఎండిపోతోంది
కరెంటు సరిగ్గా ఇవ్వడం లేదు. ఫ్యూజు పోతే రేపొస్తాం అంటున్నారేగాని విద్యుత్‌ సిబ్బంది వెంటనే వచ్చి బాగు చేయడం లేదు. 15 ఎకరాల్లో వరి, 7 ఎకరాల్లో మినుము సాగు చేశాను. నీరు అందక మొత్తం పంట ఎండిపోతోంది. – నల్లూరు రాజు, రైతు, చొప్పరామన్నగూడెం 

‘ఓటీపీ’ నిర్ణయిస్తోంది..
ఈ ఏడాది వ్యవసాయంలో మొత్తం నష్టపోవాల్సిందే. ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకువెళ్లే పరిస్థితి లేదు. విద్యుత్‌ సరఫరా విడతల వారీగా ఇస్తున్నారు. విద్యుత్‌ ఉన్నప్పుడు చేనుకు నీరు పెట్టి ఎరువుల కోసం వెళితే అక్కడ ఓటీపీలు రావడం లేదు. ఇక్కడ నీరు ఉండటం లేదు. నిరంతరం ఇదే పరిస్థితి. రైతు బతుకును ఓటీపీలు నిర్ణయిస్తున్నాయి. – యన్నంశెట్టి మంగరాజు, కౌలు రైతు, గవరవరం

ఎలా బతకాలి?
నేను కూరగాయలు సాగు చేస్తున్నాను. యూరి­యా లేకపోతే పంట లేదు. ఇరవై రోజులకు గానీ ఇవ్వడం లేదు. వేరే రకం ఎరువు వేయాలంటే బస్తా రూ.1500 పైనే ఉంది. మార్కెట్‌లో కూరగాయలు కొనాలంటే ధరలు ఎక్కువగా ఉన్నాయి. మా వద్ద కిలో బెండకాయ రూ.1.50 ధరకు కొంటున్నారు. ఇలా అయితే మేం ఎలా బతకాలి. – వేముల సత్యనారాయణ, కూరగాయల రైతు, గవరవరం

వైఎస్సార్‌సీపీ హయాంలో పెద్దపీట
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి పెద్దపీట వేసింది. 2019 తర్వాత అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పగటిపూట విద్యుత్‌ సరఫరా అందించింది. ఇందు కోసం వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్లను కూడా ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రూ.1700 కోట్లతో ఏర్పాటు చేయించారు. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయగలిగారు. ఇక ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్‌ సరఫరాకు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. ఒక సారి ట్రాన్స్‌ఫార్మర్‌ దెబ్బతింటే నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement