జియో కక్ష్యలో దేశ తొలి ఇమేజింగ్ ఉపగ్రహం
2,367 కిలోల ఈఓఎస్–05ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో
జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్17రాకెట్ ద్వారా ప్రయోగం
దేశానికి వ్యూహాత్మక సమాచారాన్ని అందించనున్న ఉపగ్రహం
ఇస్రోకు 2026లో తొలి విజయం
ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ, మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా జియోసింక్రోనస్ కక్ష్య నుంచి భూమిని చిత్రీకరించగల అధునాతన ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్–05 (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. 2,367 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ–17 రాకెట్ ద్వారా నిర్దేశిత సబ్–జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.
శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి తెల్లవారుజామున 2.55 గంటలకు జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లింది. 27 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఈ ప్రయోగం చేపట్టారు. రాకెట్ నింగిలోకి ఎగిసిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. శుక్రవారం ప్రయోగంతో దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత ఇస్రోకు విజయం లభించింది. ఈ ఏడాది జనవరి 12న 16 ఉపగ్రహాలతో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ–సీ62 రాకెట్.. మూడో దశలో ఏర్పడిన సమస్య కారణంగా వాటిని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయింది.
వ్యూహాత్మక సమాచారం మన సొంతం
ఈ ఉపగ్రహం ద్వారా భూమికి సంబంధించిన దాదాపు రియల్‌టైమ్ చిత్రాలను పొందవచ్చు. వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా దేశ అవసరాలకు ఈ చిత్రాలు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా దేశానికి అవసరమైన ‘వ్యూహాత్మక సమాచారం’ అందించడంలో ఈఓఎస్–05 కీలకంగా వ్యవహరించనుంది. ఈ ఉపగ్రహాన్ని మిషన్‌లో భాగమైన ఓ సీనియర్ శాస్త్రవేత్త ‘ఆకాశ నేత్రం’గా అభివర్ణించారు.

ప్రయోగ వివరాలు వెల్లడిస్తున్న మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్, ఇస్రో చైర్మన్ నారాయణన్ తదితరులు
ఇప్పటివరకు అనేక భూ పరిశీలన ఉపగ్రహాలు తక్కువ భూ కక్ష్య (ఎల్‌ఈఓ) నుంచి పనిచేస్తున్నాయి. అయితే ఈఓఎస్–05 సుమారు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియోసింక్రోనస్ కక్ష్యలో పనిచేయనుంది. ఈ ఎత్తులో ఉపగ్రహం భూమి భ్రమణ వేగంతో సమానమైన వేగంతో పరిభ్రమిస్తుంది. 2,367 కిలోల బరువున్న ఈఓఎస్–05 జీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లోనే అత్యంత బరువైనది. ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని, సౌర ఫలకాలు విజయవంతంగా తెరుచుకున్నాయని ఇస్రో తెలిపింది.
చాలా సంతోషంగా ఉంది
జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్17 రాకెట్ అధునాతన ఈఓఎస్–05 జియో ఇమేజింగ్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా, కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇది శ్రీహరికోట నుంచి చేపట్టిన 107వ ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీకి ఇది 19వ మిషన్. జీఎస్‌ఎల్‌వీ తొలి ప్రయోగం (డీ1)లో 1,536 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. అప్పటి నుంచి నిర్మాణ బరువును తగ్గించడం, ప్రొపల్షన్ వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా జీఎస్‌ఎల్‌వీ సామర్థ్యాన్ని ఇస్రో క్రమంగా పెంచింది.
ఇప్పుడు 2,367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆర్బిట్ రైజింగ్ ప్రక్రియను చేపట్టి ఉపగ్రహాన్ని అవసరమైన ఎత్తుకు చేర్చి జియో ప్లాట్‌ఫామ్‌లో ప్రవేశపెడతాం. ఈ విజయం ఇస్రోతో పాటు ఇందులో భాగస్వాముల సమష్టి కృషి ఫలితం. ఈఓఎస్–05 జీవితకాలం తొమ్మిదేళ్లు. ఇది ‘గూఢచారి ఉపగ్రహం’ అంటూ వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. దేశ అవసరాల కోసం భూ పరిశీలన, ఇమేజింగ్ సేవలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. 2027 మార్చి నాటికి ప్రధాని మోదీ నిర్దేశాల మేరకు ఆరు ప్రయోగాలు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం – ఇస్రో చైర్మన్ వి.నారాయణన్
రియల్‌టైమ్‌లో చిత్రాలను అందిస్తుంది
ప్రత్యేకంగా రూపొందించిన ఈఓఎస్–05 ఉపగ్రహం దాదాపు రియల్‌టైమ్‌లో చిత్రాలను అందించగలదు. జీఎస్‌ఎల్‌వీ ద్వారా జీటీఓ లేదా సబ్–జీటీఓ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఇది అత్యంత బరువైనది. – మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్
మోదీ అభినందనలు
ఈఓఎస్–05 మిషన్ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది దేశానికి గర్వకారణమైన సందర్భమని పేర్కొన్నారు. జియోసింక్రోనస్ కక్ష్య నుంచి పనిచేసే దేశ తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించడం భారత అంతరిక్ష రంగం సాధించిన అద్భుత విజయమని తెలిపారు.
జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: జీఎస్‌ఎల్‌వీఎఫ్17 రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, సాంకేతిక బృందానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ట్వీట్ చేశారు. నిరంతరం సరికొత్త విజయాలతో అంతరిక్ష పరిశోధనల్లో మన భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు చూపుతున్న అపారమైన సామర్థ్యం, కృషి, సాధిస్తున్న విజయాలు దేశప్రజలందరికీ ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో ఇస్రో మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు.
2021 ప్రయోగానికి ప్రత్యామ్నాయం!
కాగా, జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్17/ఈఓఎస్–05 మిషన్... 2021లో విఫలమైన జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్10/ఈఓఎస్–03 మిషన్‌కు ప్రత్యామ్నాయంగా చేపట్టినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రయోగంలో రాకెట్ ప్రయాణం ప్రారంభమైన 307 సెకన్ల వద్ద ఆన్‌బోర్డ్ కంప్యూటర్ ప్రయోగాన్ని నిలిపివేసింది. అనంతరం జరిపిన పరిశీలనలో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్‌లో ఏర్పడిన లోపం కారణంగానే ఆ మిషన్ విఫలమైనట్లు ఇస్రో గుర్తించింది.


