సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వీలుగా ఉదయం వేళల్లో విజయవాడ – తిరుపతి మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. శుక్రవారం ఏపీ చాంబర్స్ ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆయన మాట్లాడుతూ ఫ్లై–91 అనే సంస్థ ఉదయం వేళల్లో విజయవాడ–తిరుపతి మధ్య సర్వీసును ప్రారంభించనుందన్నారు. కొత్త ఎయిర్‌పోర్టు టెర్మినల్ పనులు అక్టోబర్ నాటికి పూర్తి చేసి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ఈ టెర్మినల్‌లో ఆరు ఎయిరోబ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి రోజూ 22 విమాన సర్వీసుల ద్వారా 2,000 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూరప్, అమెరికా, దుబాయ్‌కు ప్రత్యక్షంగా కనెక్టివిటీ వచ్చే అవకాశం ఉందన్నారు.


