మెగా డీఎస్సీ కాదది.. నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’ | Perni Nani lashes out at the Chandrababu government on dsc irregularities | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీ కాదది.. నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’

Sep 5 2026 3:39 AM | Updated on Sep 5 2026 3:39 AM

Perni Nani lashes out at the Chandrababu government on dsc irregularities

డీఎస్సీ పాపాలను ఇంకా ఎంత కాలం కప్పిపుచ్చుతారు?

చంద్రబాబు సర్కారుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపాటు

వైఎస్‌ జగన్‌ తీగ లాగితే డీఎస్సీ స్కామ్‌ డొంక కదులుతోంది

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో టెట్‌ పాసవ్వకుండానే ఎలా ఉద్యోగం ఇచ్చారు?

ఆయన దరఖాస్తు ఎందుకు రిజెక్ట్‌ చేయలేదు?

ఆ ఒక్క మండలంలోనే ఏకంగా 24 మందికి స్పోర్ట్స్‌ కోటా కింద టీచర్‌ పోస్టులా?

డీఎస్సీ–2025 ఎంపికలపై కంప్యూటర్‌ క్రాస్‌ వెరిఫికేషన్‌కు ప్రభుత్వం సిద్ధమా?

యువగళం కోటాలో స్పోర్ట్స్‌ ముసుగులో రూ.కోట్ల దందా

సంబంధిత శాఖ మంత్రిగా లోకేశ్‌ ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు హోం మంత్రితో మాట్లాడిస్తున్నారు?

మేం స్కామ్‌ గురించి మాట్లాడుతుంటే మీరు టీచర్లను బెదిరించి ర్యాలీలు చేయిస్తారా?

డీఎస్సీ బాగోతంపై సీబీఐ విచారణ జరిపించాలి 

అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్‌ తక్షణమే రాజీనామా చేయాలి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. డీఎస్సీ–2025 కుంభకోణం తీగ లాగితే అక్రమాల డొంకలు కదులుతున్నాయని వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో జరిగింది మెగా డీఎస్సీ కాదు, యువగళం డీఎస్సీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొన్న వారికి స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని.. చంద్రబాబు, లోకేశ్‌ల పాపాలు ఒక్కటొక్కటిగా బట్టబయలవుతు­న్నాయని చెప్పారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని, అది నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’ అని మండిపడ్డారు. 

శుక్రవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘అధికార బలం, అనుకూల మీడియా సాయంతో చేసిన పాపాలను ఎంతకాలం కప్పిపుచ్చగలరు? టెట్‌ పరీక్షలో పాస్‌ అవ్వని వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా లోకేశ్‌కే దక్కుతుంది. రాజకీయ పార్టీలు కాదు.. స్వయంగా ప్రజలే శోధించి డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. డీఎస్సీ అంటే తెలుగుదేశం అని ప్రగల్భాలు పలికిన వాళ్లకు ప్రజలు చెంపపెట్టు లాంటి నిజాలు చూపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో మొదలైన డీఎస్సీ అక్రమాల డొంక చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలకూ పాకింది’ అని నిప్పులు చెరిగారు. 

నారా లోకేశ్‌ తన ‘యువగళం’ కోటా కింద, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అర్హత లేని తమ వారికి స్పోర్ట్స్‌ కోటా పేరుతో లక్షల రూపాయలకు టీచర్‌ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ–2025లో ఎంపికైన అభ్యర్థుల టెట్‌ స్కోర్, కేటగిరీ, సబ్జెక్ట్‌ అర్హత, కేటాయించిన పోస్టును కంప్యూటర్‌ ఆధారంగా క్రాస్‌ వెరిఫికేషన్‌ చేయడానికి ప్రభుత్వం సిద్ధమా? అని నాని సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ నాయుడులకు నిజాలు బయటపెట్టే దమ్ముందా? అని నిలదీశారు. స్పోర్ట్స్‌ కోటాలో సమర్పించిన సర్టిఫికెట్లను, ముఖ్యంగా జరగని ఈవెంట్లకు సంబంధించినవిగా ఆరోపణలు వస్తున్న సర్టిఫికెట్లను పూర్తి స్థాయిలో వెరిఫై చేయించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర థర్డ్‌ పార్టీ ఏజెన్సీ అయిన సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాని ఇంకా ఏమన్నారంటే..

టెట్‌ పాస్‌ కానివాడికి టీచర్‌ ఉద్యోగమా?
» కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదు. నిన్నటిదాకా అసలు తప్పే జరగలేదన్న ఈ పాలకులు, ఇవాళ 16 వేల మందిలో ఒక్క తప్పు జరిగిందని తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రజలే శోధించి ఆధారాలతో సహా లోకేశ్‌ బండారాన్ని బద్దలు కొడుతున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం టీచర్‌ ఉద్యోగం రావాలంటే టెట్‌ అర్హత తప్పనిసరి. ఏ కోటాలో వచ్చినా ఈ నిబంధన వర్తిస్తుంది. 

»   బీసీలకు 75 మార్కులు రావాల్సి ఉండగా, కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఒల్లూరు ప్రాథమిక పాఠశాలలో కేవలం 65 మార్కులు వచ్చిన ప్రభాకర్‌ అనే వ్యక్తికి ఎస్జీటీ ఉద్యోగం ఎలా ఇచ్చారు? 150 మార్కులకు కనీస అర్హత సాధించని అభ్యర్థి ఆన్‌లైన్‌ దరఖాస్తును కంప్యూటర్‌ ఎలా స్వీకరించింది? డీఈవోలు, ఐఏఎస్‌ అధికారులు ఎదురెదురుగా కూర్చుని స్క్రూటినీ చేశామని చెప్పారు కదా.. మరి ఈ అనర్హుడిని ఎలా ఎంపిక చేశారు? పైనుంచి వచ్చిన బలమైన ఒత్తిళ్లు కాక దీనికి కారణమేంటి?

బోర్డర్‌ మండలాల్లో స్పోర్ట్స్‌ కోటా దందా 
»  ఎవరూ రారు, చూడరు అనే ధీమాతో కర్ణాటక సరిహద్దున ఉన్న కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఏకంగా 24 మంది స్పోర్ట్స్‌ కోటా టీచర్లను నియమించారు. ఒక్క ఒల్లూరు స్కూల్‌లోనే ఐదుగురు స్పోర్ట్స్‌ కోటా వాళ్లే పాఠాలు చెబుతున్నారు. 41 ఏళ్ల వయసులో 2009–10 నాటి జూడో పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే, 42 ఏళ్లకు టీచర్‌ కొలువు ఇచ్చేశారు. జూడో ఆడేవాళ్లే లేని రాష్ట్రంలో 30–40 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు?

»  ఇంత జరుగుతుంటే ఎంఈవో, డీఈవో ఆఫీసుల్లో కాకుండా ‘గోతులదొడ్డి’ స్కూల్లో చీకట్లో రహస్య విచారణలు ఎందుకు జరుపుతున్నారు? ఇవాళ శాప్‌ ఒక దొంగల బండిలా మారింది. శ్రీకాళహస్తిలోని ఒక ప్రైవేట్‌ బీఈడీ కళాశాల కేంద్రంగా ఈ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల దందా నడిచింది. నోటిఫికేషన్‌ ఇచ్చేటప్పుడు రాత పరీక్ష నిబంధనను ఎత్తేస్తూ జీవో 4, జీవో 47 తెచ్చారు. మేము నిలదీశాక మళ్లీ జీవోలు మార్చారు. గుర్రపు స్వారీ (ఈక్వెస్ట్రి­యన్‌), ఫెన్సింగ్, రైఫిల్‌ షూటింగ్‌ వంటి సంపన్నుల ఆటలను ఏకేటగిరీలో పెట్టి.. సామాన్యులు ఆడే కబడ్డీ, బాడీబిల్డింగ్, చెస్, క్యారమ్స్‌లను బికేటగిరీకి నెట్టేశారు. అసలు జరగని టోర్నమెంట్లకు ఫేక్‌ సర్టిఫికెట్లు తెచ్చిన వారికి కొలువులు కట్టబెట్టారు.

సీబీఐ లేదా థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలి 
» సంబంధిత శాఖ మంత్రిగా లోకేశ్‌ ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదు? హోం మంత్రితో ఎందుకు మాట్లాడిస్తు­న్నారు? ఈ ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులతోనూ అబద్ధాలు చెప్పించి.. వారిని అక్కడి నుంచి పంపించేసింది. ఒక్క తప్పిదం లేకుండా డీఎస్సీ పూర్తి చేశామన్న వారు ఇప్పుడేమంటారు? టెట్‌ పాస్‌ కాని అభ్యర్థి అప్లికేషన్‌ను ఎందుకు రిజెక్ట్‌ చేయలేదు?

» ‘16 వేల మందిలో ఒక్క తప్పు మాత్రమే జరిగిందని చేతులు దులుపుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకోం. జీవో–15 ప్రకారం టెట్‌ క్వాలిఫై కాకుండా టీచర్‌ ఉద్యోగం ఇవ్వడం ఉల్లంఘనే. చిత్తూరు జిల్లాలో ఓసీ అభ్యర్థికి టెట్‌లో 90 మార్కులు రావాల్సి ఉండగా, 79 మార్కులొచ్చినా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం కట్టబెట్టారు. 

»  తూర్పుగోదావరి జిల్లాలో తెలుగులో టెట్‌ రాస్తే, సోషల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టింగ్‌ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థుల టెట్‌ స్కోర్లు, కేటగిరీలను కంప్యూటర్‌ క్రాస్‌ వెరిఫికేషన్‌ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా? తక్షణమే ఈ ‘దగా డీఎస్సీ’పై సీబీఐ లేదా థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలి. నారా లోకేష్‌ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. 

»  శాప్‌ (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌) ఒక పెద్ద దొంగల బండి లా మారింది. అక్కడ ముద్ర పడితే చాలు అర్హత లేకున్నా కొలువులు ఇచ్చేస్తున్నారు. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్‌ బీఈడీ కాలేజీ కేంద్రంగా సాగిన ఈ స్పోర్ట్స్‌ కోటా దందాను పూర్తిగా నిగ్గు తేల్చాల్సిందే.

యువగళం కోటా వాళ్లకు రూల్స్‌ మినహాయింపు
పాతికేళ్లు, ముప్పై ఏళ్లుగా నిబద్ధతతో పాఠాలు చెబుతూ సమాజానికి ఎంతో మంది ప్రయోజకులను అందించిన సీనియర్‌ టీచర్లనేమో టెట్‌ పాస్‌ కావాలని వేధిస్తారు. కానీ మీ యువగళం కోటాలో అర్హత లేక­పో­యినా, టెట్‌ తప్పినా అడ్డగోలుగా ఉద్యోగాలు కట్టబెడ­తారా? లోకేశ్‌  రాజకీయాల్లో ఒక కామెడీ పీస్‌గా మారి­పో­తు­న్నారు. డబ్బులిచ్చి సర్వేలు రాయించుకుంటూ 82 శాతం అక్షరాస్యత వచ్చిందని పోస్టులు పెట్టుకో­వ­డం హాస్యాస్పదం.రెండేళ్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక, చదువు భారమై సుమారు నాలుగైదు లక్షల మంది పేద విద్యార్థులు చదువులు మానే­శారు. 

వీళ్లకు ఇవ్వ­డానికి నిధులు ఉండవు గానీ, యోగా మ్యాట్లకు, ప్రతి­నెలా సీఎం పెన్షన్‌ ఇచ్చేందు­కు తిరిగే ఆర్భాటాలకి రూ.కోట్ల ప్రజాధనాన్ని తగలేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇస్తామని ఊదరగొట్టిన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక స్పందించడమే లేదు. రూ.40 వేల కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారని ఉద్యోగులు అడుగుతుంటే ఉలకడం లేదు. ఒకపక్క ఉద్యోగుల జీతాల భారం అంటూనే, పాత డీఎస్సీ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి రెండో డీఎస్సీ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపి, ఉద్యోగుల బకాయిలు చెల్లించి, డీఎస్సీ అక్రమాలపై పూర్తిస్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement