అక్షరాస్యతపైనా అబద్ధాలా? | YS Jagan lashes out at the Chandrababu government | Sakshi
Sakshi News home page

అక్షరాస్యతపైనా అబద్ధాలా?

Sep 5 2026 3:48 AM | Updated on Sep 5 2026 3:48 AM

YS Jagan lashes out at the Chandrababu government

చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ మండిపాటు 

అధికారిక లెక్కలు 71.4%.. మరి 82.1% ఎక్కడి లెక్క?

గణాంకాలు ఒకలా.. మంత్రి ప్రచారం మరోలా.. ఇందులో మతలబు ఏమిటి? 

2026 ఏడాదే ఇంకా పూర్తి కాలేదు.. ఏ సంస్థా గణాంకాలు విడుదల చేయలేదు 

అధికారిక గణాంకాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం 

కూటమి ప్రభుత్వ తీరువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల నమోదు  

మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు చెప్పుకోవడంలోనే సర్కారు నిమగ్నం 

విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ ‘రెడ్‌బుక్‌ పాలన’పై కాక తన శాఖపై శ్రద్ధ పెట్టడం మంచిది  

సాక్షి, అమరావతి : అక్షరాస్యతపై చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘వాస్తవ పరిస్థితులను, గణాంకాలను వక్రీకరిస్తున్నారు. అధికారిక గణాంకాలు ఆంధ్రప్రదేశ్‌ అక్షరాస్యత రేటు 71.4 శాతంగా స్పష్టం చేస్తుంటే.. విద్యా శాఖ మంత్రి మాత్రం 82.1 శాతం అంటూ ప్రచారం చేయడం వెనుక ఉన్న లెక్కల మతలబు ఏమిటి?’ అని ప్రశ్నించారు. 

ఇంకా పూర్తికాని 2026 సంవత్సరానికి అక్షరాస్యత గణాంకాలు ఎలా వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ పోస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ట్యాగ్‌ చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే..

2026 ఏడాది అక్షరాస్యత గణాంకాలు ఏ సంస్థా విడుదల చేయలేదు 
‘సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో తప్పుడు సమాచారంతో ప్రచారం చేసుకుంటోందో చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. 2024లో 72.6 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ అక్షరాస్యత రేటు 2026లో 82.1 శాతానికి పెరిగిందని విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. కానీ 2026 కేలండర్‌ సంవత్సరానికి సంబంధించిన అక్షరాస్యత గణాంకాలను ఇప్పటి వరకు ఏ అధికారిక సంస్థా విడుదల చేయలేదు. అసలు 2026 సంవత్సరమే ఇంకా పూర్తి కాలేదు. మరి 82.1 శాతం అనే లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్‌వో నిర్వహించిన సర్వే ఆధారంగా పీఎల్‌ఎఫ్‌ఎస్‌ (పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే) 2023–24 వార్షిక నివేదికను రూపొందించారు. 

జూన్‌ 2023 నుంచి జూన్‌ 2024 మధ్య కాలానికి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఏడు సంవత్సరాలు పైబడిన వారి అక్షరాస్యత రేటు 72.6 శాతం. 2018–19లో 69.1 శాతంగా ఉన్న ఈ రేటు 2023 – 24 నాటికి 72.6 శాతానికి చేరింది. అలాగే, జనవరి 2025 నుంచి డిసెంబర్‌ 2025 మధ్య ఎన్‌ఎస్‌ఎస్‌వో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన పీఎల్‌ఎఫ్‌ఎస్‌ కేలండర్‌ ఇయర్‌ 2025 వార్షిక నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారు. ఈ అధికారిక నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఏడు సంవత్సరాలు పైబడిన వారి అక్షరాస్యత రేటు 71.4 శాతం మాత్రమే.

యూడైస్‌ గణాంకాల ప్రకారం వైఎస్‌ జగన్‌ హయాం(2023–24)లో, చంద్రబాబు హయాం (2025–26)లో రాష్ట్రంలో విద్యార్థుల వివరాలు 

టీడీపీ ప్రభుత్వం మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు 
అధికారిక గణాంకాలు ఇంత స్పష్టంగా అందుబాటులో ఉన్నప్పటికీ, 82.1 శాతం అంటూ తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం. మరో ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుండగా, ప్రైవేట్‌ పాఠశాలల్లో నమోదు పెరుగుతోందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన యూడైస్‌ (యూడీఐఎస్‌ఈ) గణాంకాలే వెల్లడిస్తున్నాయి. 

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకురావాలి? ప్రభుత్వ పాఠశాలలను ఎలా బలోపేతం చేయాలి? అనే అంశాలపై దృష్టి పెట్టాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు చెప్పుకోవడంలోనే నిమగ్నమైంది. విద్యాశాఖ మంత్రి ‘రెడ్‌బుక్‌ పాలన’పై సమయం వెచ్చించడం మానుకుని, తన శాఖపై ఎక్కువ సమయం, శ్రద్ధ పెట్టడం మంచిది’ అని వైఎస్‌ జగన్‌ హితవు పలికారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement