ఆ వాయిస్‌ రికార్డు పట్టుకురండి.. వాడ్ని చెప్పుతో కొడతా | Farmers threatened to produce the EE | Sakshi
Sakshi News home page

ఆ వాయిస్‌ రికార్డు పట్టుకురండి.. వాడ్ని చెప్పుతో కొడతా

Sep 5 2026 4:00 AM | Updated on Sep 5 2026 4:00 AM

Farmers threatened to produce the EE

తాడికోన రైతులపై టీడీపీ ఎమ్మెల్యే ఆనందరావు చిందులు

డ్రైనేజీ పనుల నిలిపివేతపై ఈఈ వాయిస్‌ రికార్డ్‌ను తీసుకురావాలంటూ రైతులకు బెదిరింపు

ప్రజాదర్బార్‌లో తమను అవమానించారంటూ అన్నదాతల ఆవేదన

సాక్షి, అమలాపురం: ‘నేను డ్రెయిన్‌ పనులు ఆపేయమని చెప్పింది ఎవరు? ఈఈ చెప్పినట్టు మీ వద్ద వాయిస్‌ రికార్డు ఉందా? నా వద్దకు పట్టుకు రండి.. వాడిని చెప్పుతో కొడతాను..’ అంటూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు రైతుల మీద చిందులు తొక్కారు. ఈ ఘటన అమలాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. అమలాపురం నియోజకవర్గంలో తాడికోన రైతుల మురుగునీటి కాలువ సమస్య మరోసారి వివాదంగా మారింది. కాలువ అధ్వానంగా ఉండడంతో రైతులు సాగు సమ్మె ప్రకటించిన విషయం తెలిసిందే. 

కాలువ తవ్వకాలు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహంతో ఎమ్మెల్యే ఆనందరావు క్యాంప్‌ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు వెళ్లారు. తమ తాడికోన గ్రామంలో డ్రైనేజీ సమస్యతో పంట సాగుచేయలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. పనులు మొదలుపెట్టి అధికారులు నిలిపివేశారని, కారణం అడిగితే మీరు ఆపేయమన్నారని డ్రెయిన్స్‌ అధికారులు చెబుతున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆనందరావు ఆగ్రహం వ్యక్తంచేస్తూ రైతులపై విరుచుకుపడ్డారు.

‘పని ఆపమని నేను చెప్పలేదు.. మీకు చెప్పినోడెవడు’ అంటూ చిందులు తొక్కారు. తమ వద్ద అధికారి వాయిస్‌ రికార్డ్‌ ఉందని చెప్పగా.. ‘దమ్ముంటే దానిని నా వద్దకు తీసుకుని రండి.. వాడిని చెప్పుతో కొడతాను’ అంటూ నోరుపారేసుకున్నారు. వచ్చిన రైతులతో సైతం వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే తీరుతో రైతులు అవాక్కయ్యారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకునేందుకు వెళ్తే ఎమ్మెల్యే అవమానించారని వారు మండిపడుతున్నారు.

ఎమ్మెల్యే ఆదేశాలతోనే పనులు ఆగిపోయాయి..
మరోవైపు.. ముంపు సమస్య, కాలువల్లో పూడికతో పొలాల్లోకి నీరు చేరి పంటలు దెబ్బతింటున్నాయని, అందుకే తాము క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఈ సమస్యపై గతంలోనే ఎమ్మెల్యేకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామని, కాలువ తవ్వకాలు చేపట్టాలని కోరామని వారంటున్నారు. ఇటీవల కాలువ తవ్వకం పనులు ప్రారంభమయ్యాయని, అయితే, ఎమ్మెల్యే ఆదేశాలతోనే పనులు మధ్యలోనే ఆగిపోయాయని రైతులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement