సాక్షి, విజయవాడ: చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉద్యోగ సంఘాల నేతల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరుపక్షాల నేతలు కాలర్లు పట్టుకుని తోసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీవో నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయాలు వెల్లడించే క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వానికి తలొగ్గారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు, పీఆర్‌సీ, మరికొన్ని డిమాండ్లను చంద్రబాబుతో చర్చించే క్రమంలో సమావేశం జరిగింది. ఈ భేటీ తర్వాత వివిధ ఉద్యోగ సంఘాల నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.


