వైఎస్సార్‌సీపీ ‘గురు ప‌రిర‌క్ష‌ణ దీక్ష’ విజ‌య‌వంతం | YSRCP Guru Parirakshana Deeksha Against DSC Mega Scam | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ‘గురు ప‌రిర‌క్ష‌ణ దీక్ష’ విజ‌య‌వంతం

Sep 5 2026 8:32 PM | Updated on Sep 5 2026 9:03 PM

YSRCP Guru Parirakshana Deeksha Against DSC Mega Scam
  • మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి
  • వైఎస్సార్సీపీ నాయ‌కుల స్పష్టీకరణ
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం వ‌ద్ద "గురు ప‌రిర‌క్ష‌ణ దీక్ష"  విజ‌య‌వంతం
  • మెగా డీఎస్సీ కాదు.. ఇది పక్కా దగా డీఎస్సీ
  • డీఎస్సీ-2025 నియామకాల్లో అడుగడుగునా భారీ అక్రమాలు 
  • ఉపాధ్యాయ నియామకాల్లోనూ దొంగలు పడ్డారు
  • అర్హులను పక్కనపెట్టి కార్య‌క‌ర్త‌ల‌కు పోస్టులు అమ్ముకున్నారు
  • టెట్ క్వాలిఫై కాకుండా న‌కిలీ స్పోర్ట్స్ స‌ర్టిఫికెట్ల‌తో ఉద్యోగాలు కట్టబెట్టారు
  • నకిలీ ఉపాధ్యాయులతో భావితరాలకే తీవ్ర ముప్పు
  • నారా లోకేష్ క‌నుస‌న్న‌ల్లోనే కోట్ల రూపాయ‌ల ఉద్యోగాల దందా
  • డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు...
  • సీబీఐ విచారణ జరిగే వరకు పోరాటం ఆగదు
  • దీక్ష‌లో తేల్చి చెప్పిన  వైఎస్సార్సీపీ నాయ‌కులు

తాడేప‌ల్లి: ద‌గా డీఎస్సీపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల్సిందేన‌ని, అక్ర‌మాల‌కు కార‌ణ‌మైన మంత్రి లోకేష్ త‌క్ష‌ణం మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని "గురు ప‌రిర‌క్ష‌ణ దీక్ష‌"లో వైఎస్సార్సీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని అపహాస్యం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2025 నియామకాలు ఒక భారీ కుంభకోణంగా మారాయని, ఇది మెగా డీఎస్సీ కాదు పక్కా 'దగా డీఎస్సీ' అని వైఎస్సార్సీపీ నేతలు ముక్తకంఠంతో ధ్వజమెత్తారు. మెరిట్ సాధించిన అభ్యర్థులను పక్కనబెట్టి, టెట్ అర్హత కూడా లేని వారికి నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో అడ్డదారిలో ఉద్యోగాలు అమ్ముకున్నారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు అండగా నిలుస్తూ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ‘గురు పరిరక్షణ దీక్ష’ను అత్యంత విజయవంతంగా నిర్వహించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో జరిగిన ఈ మెగా కుంభకోణాన్ని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష‌ చేపట్టారు. ఈ ప్రతిష్టాత్మక దీక్షకు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. నిరసన ప్రారంభానికి ముందుగా సమాజానికి మార్గదర్శనం చేసిన పలువురు విశ్రాంత ఉపాధ్యాయులను నాయకులు వేదికపై ఘనంగా సత్కరించారు. అనంతరం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్సీల భుజాలపై నల్ల కండువాలు వేసి దీక్షను లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ సంద‌ర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఉద్యోగం ఇవ్వకపోవడం, కర్నూలుకు చెందిన ప్రభాకర్‌తో పాటు క్రీడలతో ఏమాత్రం సంబంధం లేని వారికి పోస్టులు కట్టబెట్టడమే ఈ దగా డీఎస్సీకి నిదర్శనమని ఆరోపించారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి, యువగళం పాదయాత్రలో పాల్గొన్న తమ పార్టీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ పోస్టులు ఇచ్చుకున్నారని విమర్శించారు. కనీస అర్హత లేని నకిలీ ఉపాధ్యాయులను బడుల్లోకి పంపిస్తే భావితరాల విద్యార్థుల పరిస్థితి ఏంటని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ

ాసనమండలిలో డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబడితే సమాధానం చెప్పే ధైర్యం లేక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పారిపోయారని ఎద్దేవా చేశారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరహాలోనే, ఈ డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ కూడా తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నియామకాలపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వెంటనే సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. అలాగే ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడంతో పాటు, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. మోసపోయిన 3.30 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్సీపీ తరఫున తమ పోరాటాన్ని ఏమాత్రం ఆపబోమని నాయకులు ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

ఉద‌యం దీక్ష‌ను ప్రారంభించిన సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న డీఎస్సీ అక్రమాల పుట్టగా మారిందని మండిపడ్డారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన దారుణాలకు సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోందని ఆయన ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఎలాంటి అర్హతలు లేని వారు టీచర్లుగా నియమితులైనట్లు సాక్షాత్తూ ఈ ప్రభుత్వమే తేల్చిన విష‌యాన్ని గుర్తుచేశారు. ఈ అక్రమాలపై నాలుగైదు జిల్లాల్లో విద్యాశాఖ రహస్యంగా విచారణ చేస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇదంతా గమనిస్తుంటే అసలు మెగా డీఎస్సీ ఎంత లోపభూయిష్టంగా సాగిందో సామాన్యుల‌కు సైతం ఇట్టే తెలిసిపోతోందని విమర్శించారు. నోటిఫికేషన్ విడుదల దగ్గర నుంచి నియామకాల వరకు అడుగడుగునా అవినీతి జరిగిందని ఇప్పటికే తేలిపోయిందని స్పష్టం చేశారు. 

నకిలీ సర్టిఫికెట్లతో, తప్పుడు రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందినట్లు రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోందని దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలాగైతే రాజీనామా చేశారో, ఇక్కడ మంత్రి నారా లోకేష్ కూడా తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భారీ స్కామ్‌పై సీబీఐతో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలన్నదే వైఎస్సార్సీపీ ప్రధాన డిమాండ్ అని సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు. అనర్హులు గురువులుగా వస్తే భావి పౌరుల పరిస్థితి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరూ నిశితంగా ఆలోచించాలని కోరారు. కష్టపడి చదివి ప్రతిభతో టీచర్ పోస్టులు సాధించిన వారిని తీసేయమని తాము కోరడం లేదని, నకిలీలను మాత్రమే ఏరివేయాలని స్పష్టం చేశారు.

ఆ తర్వాత మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, పవిత్రమైన గురువులను స్మరించుకోవడమే కాదు, వారిని గౌరవించుకోవడం కూడా మనందరి విధి అని ఉద్ఘాటించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం చేసిన డీఎస్సీ నియామకాలు చూస్తే విద్యావ్యవస్థలోకి నకిలీలను తీసుకొచ్చారని అర్థమవుతోందన్నారు. భావితరాలకు సైతం ఈ ప్రభుత్వం పక్కా పన్నాగంతో వెన్నుపోటు పొడిచే కార్యక్రమానికి డీఎస్సీ ద్వారా శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ కేవలం కోట్లకు కక్కుర్తి పడి చేసిన అక్రమాల పాపం లక్షలాది మంది విద్యార్థుల భవితను నేడు ప్రశ్నార్థకం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నా ప్రభుత్వంలో కనీస ఉలుకూ పలుకూ లేకపోవడం దారుణమన్నారు. పాఠశాలలంటే కేవలం భవనాలు కాదని, భావితరాలకు విలువలు నేర్పే ఉత్తమ గురువులని కన్నబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఉన్నతమైన గురువుల నియామకంలో కూడా దొంగలు పడ్డారని ఉద్యమం చేయాల్సిరావడం సిగ్గుచేటు అని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ఉపాధ్యాయులతో సమాజం దారితప్పి భావితరాలకే తీవ్ర ప్రమాదం వాటిల్లే ముప్పు ఉందని హెచ్చరించారు. ఎంత వద్దని మొత్తుకున్నా లోకేష్ కావాలనే విద్యాశాఖను ఎంచుకున్నాడని గతంలో చంద్రబాబు చెప్పారని ఆయన గుర్తుచేశారు. కేవలం అడ్డదారిలో డబ్బులు దండుకోవడం కోసమే లోకేష్ ఈ విద్యావ్యవస్థను ఎంచుకుని మంత్రి అయ్యాడా అని అనుమానం కలుగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే బాధ్యత టీచర్లదే కాబట్టి, వారిని అక్రమాలకు వాడుకోవచ్చనే దురుద్దేశంతోనే అడ్డదారిలో పోస్టులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. గత రెండేళ్లుగా మంత్రిగా నారా లోకేష్ వేసిన ప్రతి అడుగూ అనుమానాస్పదంగానే ఉందన్నారు. లోకేష్‌కి మంత్రి పదవి అంటే కేవలం మెహర్బానీ కోసమేనని, బాధ్యతగా వ్యవహరించిన ఒక్క సందర్భం కూడా లేదని ఎద్దేవా చేశారు. 

రెండేళ్లలో ఏ శాఖపై రానన్ని ఆరోపణలు, అవకతవకలు విద్యాశాఖపై వస్తున్నా లోకేష్ కనీస వివరణ ఇచ్చుకునే ధైర్యం చేయలేదన్నారు. డీఎస్సీ అక్రమాలను బయటపెడుతున్న మీడియా ఛానెళ్ల సోషల్ మీడియా అకౌంట్లను ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా బ్లాక్ చేయిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ చేసిన నిరంతర పోరాట ఫలితమే ఈరోజున అన్ని మీడియా ఛానెల్స్ డీఎస్సీ అక్రమాలను బయటకు తీసుకొస్తున్నాయన్నారు. మొన్నటి వరకు కేవలం స్పోర్ట్స్ కోటాలోనే అక్రమాలు జరిగాయని అంతా అనుకున్నారని, కానీ ఇప్పుడు అన్నింటా అవినీతి జరిగినట్టు రుజువైందని తెలిపారు. ఒక్క నకిలీ టీచర్ ఉద్యోగం పట్టుకున్నా రాజీనామా చేస్తానన్న లోకేష్, ఇప్పుడు పదుల సంఖ్యలో బయటపడుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో డీఎస్సీ అక్రమాలు బయటపడిన తర్వాత ఇక ప్రభుత్వంతో చర్చలు అనవసరమని పేర్ని నాని తేల్చిచెప్పారు. తండ్రీకొడుకులకు సైకో బుద్ధులు ఉన్నాయి కాబట్టే టీచర్ ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారని, తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

డీఎస్సీ - 2025 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి నియామకాల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశలోనూ తీవ్రమైన అవకతవకలు జరిగాయని, బహుశా భారతదేశ చరిత్రలో ఇంత దుర్మార్గమైన, పనికిమాలిన ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ చూసి ఉండమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. విద్యార్థుల జీవితాలతో పాటు ఉపాధ్యాయుల జీవితాలను కూడా బలిపీఠం ఎక్కిస్తున్న దుస్థితిని మొట్టమొదటిసారిగా మన ఆంధ్రరాష్ట్రంలో చూస్తున్నామని ఆయన ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. సమాజంలో ఆదర్శప్రాయంగా నిలిచి, ప్రభుత్వాల ద్వారా ప్రయోజనాలు పొందిన పెద్దలను పార్టీ శ్రేణులు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఘనంగా సన్మానించుకున్నామని పేర్కొన్నారు. 

మరోవైపు, ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామిక కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పేపర్లు లీక్ కావడం, ఉద్యోగాల కోసం జీవోలు మార్చడం, లక్షలాది రూపాయలు చేతులు మారడం వంటి దారుణాలు జరిగాయని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించినట్లుగా, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు దక్కాలంటే, ఈ డీఎస్సీ అక్రమాలపై తప్పనిసరిగా సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.

ఈ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, క‌వురు శ్రీనివాస్‌, పి.సురేష్ బాబు, ఇసాక్ బాషా, కుంభా ర‌విబాబు, మొండితోక అరుణ్ కుమార్‌, రామ‌చంద్రారెడ్డి, పాల‌వ‌ల‌స విక్రాంత్‌, సిపాయి సుబ్ర‌హ్మ‌ణ్యం, రూహుల్లా, క‌ల్ప‌ల‌తా రెడ్డి, ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి తదితరులు సైతం ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. 16 వేల పోస్టుల భర్తీలో 16 వేల ఆరోపణలు వస్తున్నాయని, టెట్ లేకుండానే దొంగ సర్టిఫికెట్లతో కొలువులు ఇచ్చేశారని ఆయా నేతలు దుయ్యబట్టారు. డీఎస్సీ బాధితులకు పూర్తి న్యాయం జరిగి, ప్రభుత్వం సీబీఐ విచారణ వేసే వరకు తమ పోరాటం ఆగబోదని వైఎస్సార్సీపీ నాయకులు ముక్తకంఠంతో హెచ్చరించారు.

మాజీ మంత్రులు పేర్ని నాని, కుర‌సాల‌ క‌న్న‌బాబు, మేక‌తోటి సుచ‌రిత‌, తానేటి వ‌నిత‌, జోగి ర‌మేశ్, ఆదిమూల‌పు సురేష్‌, వైఎస్సార్సీపీ జిల్లా అధ్య‌క్షులు పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, దూలం నాగేశ్వ‌ర‌రావు, దేవినేని అవినాశ్‌, మాజీ ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్ణు, మొండితోక జ‌గ‌న్‌, టీజేఆర్ సుధాక‌ర్ బాబు, అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌, జ‌క్కంపూడి రాజా, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు బాల‌సాని కిర‌ణ్‌, దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవ‌భ‌క్తుని చ‌క్ర‌వ‌ర్తి, గ‌జ్జ‌ల సుధీర్ భార్గ‌వ్ రెడ్డి, అంబ‌టి ముర‌ళీ కృష్ణ‌, విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు పానుగంటి చైత‌న్య‌, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ర‌విచంద్ర‌,  పార్టీ నూర్‌బాషా విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ ద‌స్త‌గిరి, ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు నారాయ‌ణ మూర్తి, గుంటూరు జిల్లా లీగ‌ల్ సెల్ అద్య‌క్షుడు భ‌గ‌వాన్, లీగ‌ల్ సెల్ నాయ‌కురాలు మాధ‌వి, వివిధ విభాగాల‌కు చెందిన పార్టీ నాయ‌కులు హాజ‌రై దీక్ష‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. 

సాయంత్రం నాలుగు గంట‌లకు దీక్ష‌లో పాల్గొన్న‌ ఎమ్మెల్సీల‌కు పార్టీ నాయ‌కులు గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి, ఆదిమూల‌పు సురేష్‌, గ‌జ్జ‌ల సుధీర్ భార్గ‌వ్ రెడ్డి నిమ్మ‌రసం అంద‌జేసి దీక్ష‌ను విర‌మింప‌జేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement