జనతంత్రం
‘‘ఏదో తెలియని ఓ యుద్ధం తరిమేసిన శరణార్థులు వీరు’’. ‘అభివృద్ధి’ ప్రాజెక్టుల కోసం నిర్వాసితులయ్యే ప్రజలను గురించి ప్రముఖ రచయిత్రి–సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యానమిది. యుద్ధం ఏనాటికైనా ముగిసి పోతుంది. మళ్లీ ఏదో ఒకనాడు తమ ఇంటికీ, తమ ఊరికీ వెళ్లిపోవచ్చుననే ఆశ యుద్ధ శరణార్థుల్లో లేశమాత్రంగానైనా ఉంటుంది. టెర్రరిజం తరిమేసిన కశ్మీరీ పండిట్లు ముప్ఫయేళ్ల తర్వాత ఇప్పుడు తమ సొంత ప్రాంతానికి వెళ్లిపోతామంటూ చెబుతున్న మాటల్ని కూడా వింటున్నాము. అభివృద్ధి ప్రాజెక్టుల నిర్వాసితులకు మాత్రం ఇటువంటి ఆశ ఉండే అవకాశమే లేదు. ‘అభివృద్ధి’ కోసం నిర్వాసితులయ్యే ప్రజలు కోల్పోయేది కేవలం తలదాచుకునే కొంపనో, చారెడు చెలకనో మాత్రమే కాదు. వారు తమ జీవన విధానాన్నే కోల్పోతారు. కనుక, వారి జీవితాన్ని పునర్నిర్మించి ఇవ్వాలనే వాదన అంతర్జాతీయంగా చాలా బలంగా ఉన్నది. ప్రాజెక్టుల కోసం అప్పులిచ్చే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, ఐఎంఎఫ్ వంటి సంస్థలు కూడా ఇటువంటి భావనకు అనుగుణంగానే పునరావాస పథకాలను రూపొందించాలని షరతులు పెడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి నిర్వాసితుల విషయాన్ని మానవ హక్కుల సమస్యగా పరిగణిస్తున్నది.
పల్లెలో మన ఇల్లంటే కేవలం నాలుగు గోడలే కాదు. తర తరాలుగా ఆ ఇంటితో పెనవేసుకున్న బంధం. కష్టసుఖాల కలబోత జ్ఞాపకాలు. సాగు నేలపై గుండెల్లో దాచుకున్న మమకారం. ఆ నేల మీద తాతలు–తండ్రులు తర్పణ చేసిన ఘర్మజలం. ఊరుమ్మడి బతుకుల్లో చిగురించిన తోడు–నీడలు, కలిసి చేసుకున్న పండుగలూ పబ్బాలు, ఊరి బడి, గుట్టమీది గుడి, చెట్టూ–పుట్టలతో కుదిరిన చిన్ననాటి స్నేహం, ఉపాధి– ఉద్యోగం... వీటన్నింటినీ నిర్వాసితులు కోల్పోతారు. అభివృద్ధి అనే ఎజెండాను అమలు చేయడం కోసం జీవితాలను త్యాగం చేస్తున్న ప్రజలకు తిరిగి అటువంటి సంపూర్ణ జీవనాన్ని పొందే హక్కు ఉన్నదని అప్పులిచ్చే అంతర్జాతీయ సంస్థలు కూడా చెబుతున్నాయి. అయితే సమాజ విస్తృత ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు తప్పనిసరి కనుక, వాటిని డిజైన్ చేసేటప్పుడే నిర్వాసితుల సమస్య ఉత్పన్నం కాకుండా ఆలోచించాలనీ, కుదరకపోతే వారి పునరావాస పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రపంచవ్యాప్తంగా నేడు అంగీకారయోగ్యమైన అంశంగా మారింది.
మొన్నటి సోమవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక భావోద్వేగపూరిత రసాభినివేశాన్ని రక్తి కట్టించడానికి చాలా ప్రయాసపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల నుంచి నల్లమలసాగర్ ఫీడర్ ఛానల్‌కు కృష్ణా నీటిని విడుదల చేస్తూ ఆ జలాలకు సాష్టాంగ ప్రణామాన్ని ఆచరించారు. ముప్ఫయ్యేళ్ల కింద ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది తానేనని, ఇప్పుడు పూర్తి చేసింది కూడా తానేనని ఆయన ప్రకటించుకున్నారు. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సుమారు నెల రోజుల ముందు (బహుశా మార్చిలో) కమ్యూ నిస్టు పార్టీల ఆందోళన కారణంగా శంకుస్థాపన రాయిని చంద్రబాబు వేశారు. ఎన్నికలు ముగిసిన కొద్ది కాలానికే కనిగిరిలో జరిగిన ఒక సభలో వెలిగొండ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని కూడా చంద్రబాబు ప్రకటించిన వైనాన్ని అదే కమ్యూనిస్టు నేతలు ఎత్తి చూపుతున్నారు. దాదాపుగా అదే కాలంలో యర్రగొండపాలెం సభలో వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు చేసిన ప్రకట నను అప్పట్లో ఆ సభను కవర్ చేసిన సీనియర్ పాత్రికేయులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. వ్యవసాయం దండగ అనే మానసిక ధోరణితో పాటు వెలిగొండ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదనే అభిప్రాయం బాబులో బలంగా ఉన్నందువల్లనే, ఆ తర్వాత ఎనిమిదేళ్లు అధికారంలో కొనసాగినా వెలిగొండపై ఒక్క అడుగూ ముందుకేయకుండా చాపచుట్టేశారు.
వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించడానికి కంకణం కట్టుకున్న రాజశేఖరరెడ్డే వెలిగొండ ప్రాజెక్టు ఆచరణ సాధ్యమేనని నిరూపించడానికి సంకల్పం చెప్పుకున్నారు. ఒక్క సొరంగాన్ని తవ్వితే ప్రాజెక్టు ద్వారా ఆశించిన ప్రయోజనం నెర వేరదని భావించి జంట సొరంగాలను ఆయన డిజైన్ చేశారు. రెండు సొరంగాలు కలిపి మొత్తం నిడివి 37 కిలోమీటర్లు. ఇందులో ఇరవై కిలోమీటర్లకు పైగా వైఎస్సార్ జమానాలోనే పూర్తయింది. ఈ ముప్ఫయేళ్లలో పదిహేనేళ్లకు పైగా ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు కాలంలో సొరంగ మార్గం ఏడు కిలోమీటర్లు మాత్రమే సాగింది. ఆ తర్వాత ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్ హయాంలో పది కిలోమీటర్లకు పైగా సాగి సొరంగ మార్గం పూర్తయింది. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జంట సొరంగాలు ప్రధానమైన భాగం. ఈ ప్రధాన భాగాన్ని పూర్తి చేసినందుకు గుర్తుగా జగన్‌మోహన్ రెడ్డి అక్కడొక పైలాన్‌ను ఆవిష్కరించారు.
పైలాన్ వేసినందుకు జగన్‌ను ఎద్దేవా చేస్తున్న ముఖ్యమంత్రి ఈ 27 నెలల కాలంలో ఏం ఘనకార్యం చేశారని వెలిగొండను పూర్తి చేశాననే ఖ్యాతిని తగిలించుకుంటున్నారు! ఇతరులు చేసిన పనిని తన ఖాతాలో వేసుకునే క్రెడిట్ చోరీ తాపత్రయంగా ఈ వ్యవహారాన్ని పరిగణించవలసి వస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ అంతకుముందే పూర్తయ్యాయి. రిజర్వాయర్ సిద్ధంగా ఉన్నది. జంట సొరంగాల నుంచి నల్లమల సాగర్‌కు నీటిని తరలించే ఫీడర్ చానల్ పూర్తయింది. సాగర్ దిగువన నీటిని తరలించే మూడు ప్రధాన కాలువలు కూడా ఎప్పుడో సిద్ధమయ్యాయి. ఇక ఈ కాల్వల నుంచి పంటపొలాలకు నీటిని తరలించే డిస్ట్రిబ్యూట రీల తవ్వకం మాత్రం ఇంకా మిగిలి ఉన్నది. అన్నిటికంటే అతి ముఖ్యమైన పునరావాస పథకం కింద జగన్ హయాంలోనే మెరుగైన ప్యాకేజీ సిద్ధమైంది.
అంతకుముందు నిర్ణయించిన నష్టపరిహారాన్ని భారీగా పెంచుతూ జగన్ సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 11 గ్రామాల్లో 7,318 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించి అందులో 96 కుటుంబాలకు పునరావాసాన్ని కూడా పూర్తి చేశారు. మిగిలిన 7,222 కుటుంబాల కోసం 1,301 కోట్ల రూపా యలను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో పునరావాసం కోసం ఏర్పాటైన కాలనీల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు వంటి మౌలిక వసతులను కల్పించారు. ఈలోగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పునరావాస కార్యక్రమాలను అట కెక్కించి 26 నెలలు కాలయాపన చేసింది. సోమవారం నాడు వెలిగొండ భుజకీర్తులను చంద్రబాబు తగిలించుకోవడానికి సరిగ్గా వారం రోజుల ముందు అరకొర పరిహారంగా 760 కోట్లను ముట్టచెప్పి తక్షణమే వారంతా ఊళ్లు విడిచిపోవాలని బలవంతం చేశారు. ఖాకీసేనను రంగంలోకి దించారు. అనా రోగ్యంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిపైన కూడా కనికరం చూపలేదు.
పునరావాస కాలనీల్లో కనీసం ఒక చిన్న గూడు వేసుకునే అవకాశాన్ని కూడా నిర్వాసితులకు ఇవ్వలేదు. ప్రభుత్వం స్వయంగా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. కొంతమంది మార్కాపురం, దాని పరిసర ప్రాంతాల పరిచయస్తుల పంచన తాత్కాలిక సర్దుబాటు చేసుకున్నారు. ఎక్కువ మంది మాత్రం ఎక్కడికి వెళ్లాలో తెలియక కాలనీల్లో తమకు కేటాయించిన ప్లాట్ల దగ్గర సామాన్లు పెట్టుకొని, గొడ్డూగోదాను అక్కడే కట్టేసుకొని వర్షం పడితే దేవుడే దిక్కనుకుంటూ మూడు నాలుగు రోజులు పడిగాపులు పడ్డారు. వేలాది బతుకులు నడివీధిన పడిన ఇంతటి మానవతా సంక్షోభంలో సర్కార్ వైపు నుంచి పట్టించు కున్న నాథుడే లేడు. యుద్ధ శరణార్థులు కూడా ఇంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొని ఉండరు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పంచిన నష్టపరిహారం సొమ్మును నిర్వాసితులు ఎంతకాలం నిలబెట్టుకో గలరు? ఈమధ్య కాలంలో పద్దెనిమిదేళ్లు దాటిన వారిని, పెళ్లిళ్లు చేసుకొని ఏర్పడిన కొత్త కుటుంబాలను పరిగణనలోకి తీసు కోకుండా అదనంగా ఇంకో రెండు లక్షలిస్తామనే వాగ్దానం మాత్రం చేశారు. అసలు పరిహారానికే ఎసరుపెట్టిన సర్కార్ ఈ కొసరు వేస్తుందన్న నమ్మకం నిర్వాసితుల్లో ఏమాత్రం కనిపించడం లేదు.
ఆగమేఘాలమీద నిర్వాసితుల్ని తరిమేసి ప్రభుత్వం సాధించదలుచుకున్నదేమిటో తెలుసా?... క్రెడిట్ చోరీ! రైతులకు ఇప్పు డప్పుడే నీళ్లిచ్చే అవకాశమే లేదు. ఎప్పుడో పూర్తయిన కాల్వలకు అవసరమైన మరమ్మతులు చేయకుండా, అసలు డిస్ట్రిబ్యూట రీలే తవ్వకుండా పంట చేలకు నీళ్లెట్లా ఇస్తారు? ప్రాజెక్టు తొలి దశకు నీళ్లివ్వడానికి ఎంతలేదన్నా ఏడాదికి పైగా పడుతుందని విశ్వసనీయ సమాచారం. ఈలోగా రిజర్వాయర్లోకి ఒకటో రెండో టీఎమ్‌సీల నీళ్లను వదిలి ఫొటోలు తీసి వెలిగొండ వెలుగులివిగో అంటూ ప్రచారం చేసుకుంటారు. ఈ నకిలీ క్రెడిట్ కోసం వేలాది కుటుంబాలను నిర్దయంగా వీధిపాల్జేశారు. మానవీయ విలు వల్ని ఉక్కుపాదాలతో నలిపేశారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినట్టు రాష్ట్ర సర్కార్ మరో నాటకాన్ని రక్తి కట్టించింది. పోల వరం ప్రాజెక్టు పూర్తయిందని ఇప్పుడు యావదాంధ్ర జనులు నమ్మాలన్నమాట. పోలవరం ప్రాజెక్టుకు దిగువన ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా వైఎస్సార్ తవ్వించిన ఎడమ కాల్వలోకి 3,500 క్యూసెక్కుల ప్రవాహాన్ని ఎత్తిపోశారు.
ఇదే పోలవరం నెత్తిన చల్లుకోండని సెలవిస్తున్నారు. పాయక రావుపేటలో కూడా చంద్రబాబు గోదావరి జలాలకు సాష్టాంగ ప్రణామాన్ని ఆచరించారు. అక్కడక్కడా కొన్ని అక్విడెక్టులు, బ్రిడ్జీలను నిర్మించడం మినహా ఎడమ కాల్వ పనుల్ని ఈ సర్కార్ ముందుకు తీసుకొని పోయిందేమీలేదు. లక్షలాది ఎకరాలకు సాగునీటితోపాటు విశాఖ నగరం మంచినీటి అవసరాలనూ, పారిశ్రామిక అవసరాలనూ ఎడమకాల్వ తీర్చవలసి ఉన్నది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా దీనిపైనే అధారపడి ఉన్నది. భారీ గంగాళంలో చెంబెడు నీళ్లుపోసి ఉత్తరాంధ్ర ప్రజలను పండుగ చేసుకొమ్మని సెలవిస్తున్నారు. పాయకరావుపేట దాకా కాల్వ సమీపంలోని జలాశయాలకు నీటిని తరలించడానికి అవసరమైన పాసేజ్‌లు కూడా సిద్ధంగా లేవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన నాటక్ బాజీ సర్కార్ చర్యలను విదూషకత్వమనాలో, క్రూరత్వం అనాలో అర్థం కావడం లేదు. 
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


