పోలవరానికి మరో ద్రోహం కుడి ఎడమల దగా! | Another conspiracy for Polavaram in Chandrababu Naidu government | Sakshi
Sakshi News home page

పోలవరానికి మరో ద్రోహం కుడి ఎడమల దగా!

Sep 4 2026 5:25 AM | Updated on Sep 4 2026 5:25 AM

Another conspiracy for Polavaram in Chandrababu Naidu government

కుడి కాలువ సామర్థ్యం 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులే 

ఈ సామర్థ్యంతో చేసిన పనులకే నిధులు ఇస్తామని తేల్చి చెప్పిన కేంద్రం 

వాస్తవానికి కుడి కాలువ సామర్థ్యం 17,560, ఎడమ కాలువ సామర్థ్యం 17,580 క్యూసెక్కులు 

చంద్రబాబు సర్కార్‌ నిర్వాకంతో రాష్ట్ర ఖజానాపై రూ.4,753.98 కోట్ల భారం  

2017లో అప్పటి చంద్రబాబు సర్కార్‌ కేంద్రానికి పంపిన డీపీఆర్‌–2లో తప్పిదం ఫలితమిది

సాక్షి, అమరావతి : రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కార్‌ మరో ద్రోహం చేసింది. ఇప్పటికే నీటి నిల్వ మట్టాన్ని 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించడం ద్వారా పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేసింది. తాజాగా కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్ర జల్‌ శక్తి శాఖ తేల్చి చెప్పినప్పటికీ నోరు మెదపక పోవడం విస్తుగొలుపుతోంది.

 దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం ఎడమ కాలువను, కృష్ణా డెల్టాకు నీటి కరువన్నదే లేకుండా చేసేందుకు 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను 2004లో చేపట్టారు. విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. తాజా ధరల మేరకు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఈ మేరకు 2017 ఆగస్టు 17న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదన (డీపీఆర్‌–2)లో కుడి కాలువ సామర్థ్యాన్ని 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 8 వేల క్యూసెక్కులుగా తప్పుగా పేర్కొంది. దాని ఫలితంగానే కేంద్ర జల్‌ శక్తి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.4,753.93 కోట్ల భారం పడుతుందని జల వనరుల శాఖ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

చిరకాల స్వప్నం సాకారమైన వేళ..  
గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన 1941లో వచి్చనా, 2004 వరకు ఆ ప్రాజెక్టు పనులు చేపట్టే సాహసం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అయితే వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేస్తూ నిర్మాణ పనులు చేపట్టారు. కొత్తగా 3.2 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 80 టీఎంసీలను మళ్లించి కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను చేపట్టారు. కొత్తగా 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.2 టీఎంసీను మళ్లించి 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎడమ కాలువను చేపట్టారు. 

గోదావరి ట్రిబ్యునల్‌ అనుమతి మేరకు 45.72 మీటర్లు (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో 194.6 టీఎంసీల నీటి నిల్వ.. 960 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్కేంద్రం.. 449.78 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు.. కుడి, ఎడమ కాలువల సమీపంలోని 540 గ్రామాల్లోని 28.50 లక్షల మంది దాహార్తి తీర్చేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు.  

డీపీఆర్‌–2లో తప్పుల పర్యవసానమే..  
రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడంతోపాటు అన్ని రకాల అనుమతులు తీసుకుని, వంద శాతం వ్యయంతో తామే నిర్మించి ఇస్తామని రాష్ట్రానికి హామీ ఇచ్చింది. ఆ మేరకు విభజన చట్టంలో సెక్షన్‌–90లో స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడం కోసం పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ను 2014 మే 28న ఏర్పాటు చేసింది. 2015 మార్చి 12న నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశంలోనే.. తాజా ధరల మేరకు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు ఇవ్వాలని అప్పటి పీపీఏ సీఈవో దినేష్ కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 

కానీ.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను సమర్పించడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఎట్టకేలకు 2017 ఆగస్టు 17న రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పీపీఏకు సమర్పించింది. ఆ ప్రతిపాదనల్లో కుడి, ఎడమ కాలువ సామర్థ్యాన్ని తప్పుగా పేర్కొంది. ఇదే అంశాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎత్తిచూపింది. విభాగాల వారీగా విధించిన పరిమితులను ఎత్తేసి.. తాజా ధరలు, పనుల పరిమాణాల ఆధారంగా ప్రాజెక్టు పనులకు అయ్యే వ్యయాన్ని రీయింబర్స్‌ చేయాలన్న విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అంగీకరించారు. ఆ మేరకు నిధులు ఇస్తామని స్పష్టం చేస్తూ 2023 జూన్‌ 5న నోట్‌ జారీ చేశారు. కానీ.. ఇప్పుడు కుడి కాలువ సామర్థ్యం 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

కళ్లముందు కరిగిపోతున్న స్వప్నం  
నీరు నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల పోలవరం రిజర్వాయర్‌ బ్యారేజ్‌గా మారిపోయింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే కుడి, ఎడమ కాలువలు.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.62 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల స్థిరీకరణ అసాధ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, విశాఖ పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు నీళ్లందించడం వీలు కాదని స్పష్టం చేస్తున్నారు. జల విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో చేపట్టడమూ అసాధ్యమే. అంటే కళ్ల ముందే చిరకాల స్వప్నం కరిగిపోతుండటంతో రైతులు, సాగు నీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం ద్వారా భూసేకరణ, పునరావాస వ్యయం రూపంలో ఇప్పటికే రూ.23,622 కోట్లను కేంద్రం మిగుల్చుకుంది. తాజాగా కుడి, ఎడమ కాలువ పనుల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా మరో రూ.4,753.98 కోట్లనూ మిగుల్చుకుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement