టెట్‌ ఫెయిలైనా టీచరే..! | Irregularities in the recruitment of teachers under the sports quota in Kurnool district | Sakshi
Sakshi News home page

టెట్‌ ఫెయిలైనా టీచరే..!

Sep 4 2026 3:49 AM | Updated on Sep 4 2026 3:49 AM

Irregularities in the recruitment of teachers under the sports quota in Kurnool district

కర్నూలు డీఈఓ ఆఫీస్‌లో విచారణకు హాజరైన ఈ.ప్రభాకర్‌

కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్‌ కోటా టీచర్‌ పోస్టుల భర్తీలో అక్రమాలు  

టెట్‌లో అర్హత సాధించకున్నా టీచర్‌ పోస్టుకు ఎంపిక చేసిన శాప్‌ 

జిల్లాలో ఒక్క జూడో క్రీడ ద్వారానే  21 మంది టీచర్లుగా ఎంపిక

కర్నూలు సిటీ: మెగా డీఎస్సీ 2025లో అక్రమాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. స్పోర్ట్స్‌ కోటా కింద భర్తీ చేసిన పోస్టుల్లో పలువురు అర్హతలు లేకపోయినా తప్పుడు మార్గాల్లో ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్‌ స్కూల్‌లో మెగా డీఎస్సీ ద్వారా సెకండ్‌ గ్రేడ్‌ టీచర్‌గా ఎంపికై విధులు నిర్వహిస్తున్న ఈ.ప్రభాకర్‌ విద్యార్హతలపై మీడియా, సోషల్‌ మీడియాలో వి్రస్తృతంగా ప్రచారం జరగడంతో నాలుగైదు రోజులుగా ఆయన సెలవులో ఉన్నారు. 

కౌతాళం ఎంఈవో, కర్నూలు డీఈవో ఆఫీస్‌లో నిర్వహించిన విచారణలో టెట్‌ పరీక్షలో అర్హత మార్కులు సాధించకుండానే ఆయన టీచర్‌గా ఎంపికైనట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లాలో 21 మంది స్పోర్ట్స్‌ జూడో కోటాలో టీచర్‌ పోస్టులు పొందారు. వీరిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఏడుగురు ఉన్నారు. వీరంతా బంధువులు కావడం గమనార్హం. ఇక ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు సమర్పించిన వారిలో అనర్హులు ఉన్నట్లు కొందరు అభ్యర్థులు కోర్టును సైతం ఆశ్రయించారు. 

టెట్‌ క్వాలిఫై కాకున్నా టీచర్‌గా ఎంపిక చేసిన శాప్‌.. 
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెగా డీఎస్సీ ద్వారా 1,697 ఎస్‌జీటీ, 786 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 79 మున్సిపల్‌ టీచర్‌ పోస్టులు, 28 ట్రైబల్‌ వెల్ఫేర్‌ టీచర్‌ పోస్టులు భర్తీ చేశారు. స్పోర్ట్స్‌ కోటా కింద ఎస్‌జీటీ 48 (తెలుగు మీడియం), 3 పోస్టులు (ఉర్దూ మీడియం), లాంగ్వేజెస్‌ పోస్టులు 6, స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లు గణితం 2, ఫిజికల్‌ సైన్స్‌ ఒక పోస్టు, బయోలాజికల్‌ సైన్స్‌ 2, సోషల్‌ స్టడీస్‌ 3, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 5 పోస్టులకు శాప్‌ అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లా విద్యాశాఖకు పంపింది. ఆ జాబితాలో ఉన్న వారందరికీ పోస్టింగ్స్‌ ఇచ్చారు. 

వెల్దుర్తి మండలం రత్నపల్లికి చెందిన ఈ.ప్రభాకర్‌ వల్లూరు ఎంపీపీఎస్‌లో ఎస్‌జీటీ టీచర్‌గా పోస్టింగ్‌ పొందారు. ఆయన హాకీ క్రీడాకారుడుగా సర్టిఫికెట్‌ సమర్పించారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ పోస్టు పొందాలంటే టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. ప్రభాకర్‌ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో టెట్‌లో తప్పనిసరిగా 60 శాతం మార్కులు అంటే 75 మార్కులు సాధించాలి. కానీ డీఎడ్‌ తరువాత 2022లో రాసిన టెట్‌లో (హాల్‌టికెట్‌ నెంబరు: టీఈటీ 22265677) పేపర్‌–1 ఏలో ఆయనకు 65.4281 మార్కులు మాత్రమే వచ్చాయి. 

2024లో (హాల్‌ టికెట్‌ నెంబరు: టీఈటీ 7240454497) 66.83274 మార్కులు సాధించారు. అదే ఏడాది మరోసారి నిర్వహించిన టెట్‌లో (హాల్‌ టికెట్‌ నెంబరు: టీఈటీ 241187876) ఆయన 61.81213 మార్కులు పొందారు. 2025లో నిర్వహించిన టెట్‌లో 51.7424 మార్కులు మాత్రమే వచ్చాయి. కానీ స్పోర్ట్స్‌ కోటాలో సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేసిన శాప్‌.. టెట్‌ 2022లో ఆయనకు వచ్చిన 65.4281 మార్కులకు అర్హుడిగా నిర్ధారిస్తూ ఎస్‌జీటీ పోస్టుకు ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీసీలు టెట్‌లో 75 మార్కులు వస్తేనే అర్హులు. కానీ ప్రభాకర్‌కు కనీస అర్హత మార్కులు లేకున్నా టీచర్‌ పోస్టుకు శాప్‌ ఎంపిక చేయడం గమనార్హం. 

చర్యలకు డీఈవో సిఫారసు..! 
మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ పోస్టుకు ఎంపికైన ఈ.ప్రభాకర్‌ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను కర్నూలు డీఈఓ ఆఫీసులో డిప్యూటీ డీఈఓ శ్రీధర్‌బాబు, కల్లూరు ఎంఈఓ–2 వనజాకుమారి బుధవారం పరిశీలించారు. ప్రభాకర్‌ టెట్‌ పేపర్‌–1ఏలో అర్హత మార్కులు పొందలేదని, ఈ విషయాన్ని ఆయనే అంగీకరించారని, తదుపరి చర్యల నిమిత్తం సీసీఏ నిబంధనలను అనుసరించి పాఠశాల విద్య డైరెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.  

అనర్హులను తొలగించాలి.. 
టెట్‌లో క్వాలిఫై కాని వ్యక్తిని మెగా డీఎస్సీలో టీచర్‌ ఉద్యోగానికి ఎంపిక చేసి అర్హులకు అన్యాయం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందిన వారితో పాటు మెగా డీఎస్సీలో ఎంపికైన వారందరి సర్టిఫి­కెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. అర్హత లేని వారిని తొలగించి, అర్హులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి.  – కె.సతీష్, బహుజన టీచర్స్‌ ఫెడరేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు  

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి.. 
స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మెగా డీఎస్సీపై సిట్టింగ్‌ జడ్జితో విచారించాలి. ఇన్‌ సర్వీస్‌ టీచర్లు తప్పనిసరిగా టెట్‌లో అర్హత  పొందాల్సిందేనని చెబుతున్న ప్రభుత్వం మెగా డీఎస్సీలో అనర్హులను ఎలా ఎంపిక చేస్తుంది? స్పోర్ట్స్‌ కోటా సర్టిఫికెట్లన్నీ మరోసారి వెరిఫై చేయాలి. స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీలో అక్రమాలకు వల్లూరు స్కూల్‌ టీచర్‌ ఉదంతమే ఉదాహరణ.     – కె.భాస్కర్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement