కరువులో దేశంలోనే ఒకటి లేదా రెండో స్థానంలో ఉన్నాం
రైతులకు మంత్రివర్గం సూచన
ఇప్పటికే 52 శాతం లోటు వర్షపాతం
వచ్చే 2 నెలలు కరువు మరింత తీవ్రతరం
ఖరీఫ్‌లో ఇప్పటికి 90 శాతం నాట్లు పడాల్సి ఉండగా కేవలం 60 శాతమే పడ్డాయి
రాష్ట్రంలో వర్షపాతం లోటుపై కేంద్రానికి సీఎం లేఖ రాస్తారు..
ఏపీ పౌల్ట్రీ అభివృద్ధి విధానం 2025–29 ముసాయిదాకు ఆమోదం
ఇక కోళ్ల పరిశ్రమల రిజిస్ట్రేషన్ తప్పనిసరి
కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే రెండు నెలలు కరువు మరింత తీవ్రతరమవుతుందని, ఈ నేపథ్యంలో వరి పంటకు బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సూచించింది. దేశంలోనే కరువు తీవ్రతలో ఆంధ్రప్రదేశ్ మొదటి లేదా రెండో స్థానంలో ఉందని, ఇప్పటికే 52 శాతం లోటు వర్షపాతం నమోదైందని సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి తెలిపారు. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరువు పరిస్థితులపై చర్చించినట్లు మంత్రి పార్థసార«థి మీడియా సమావేశంలో చెప్పారు. కరువు తీవ్రత నేపథ్యంలో పంటలు ఎండిపోకుండా, నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ఆరుతడి పంటలు వేసేలాగ రైతులకు అవగాహన కల్పించాలని సీఎం సూచించినట్లు మంత్రి చెప్పారు. సాధారణంగా ఖరీఫ్‌లో ఇప్పటికే 90 శాతం నాట్లు పడాల్సి ఉండగా కేవలం 60 శాతమే నాట్లుపడ్డాయని మంత్రి చెప్పారు. ఆరుతడి పంటలకు 90వేల కిలోల విత్తనాలు సబ్సిడీపై సరఫరా చేయడానికి గాను రూ.90 కోట్ల మంజూరు చేయాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. పంటలను కాపాడేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
పశుగ్రాసం, తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. 14,829 నివాస ప్రాంతాల్లోని 3.93 కోట్ల ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏదో ఒక రూపంలో చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. అవసరమైతే కొత్త బోర్లు వేయడం లేదా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం, అవసరమైతే ట్యాంకర్లను పొరుగు రాష్ట్రాల నుంచి అద్దెకు తీసుకోవడం వంటి చర్యలను తీసుకోనున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి సీఎం లేఖ రాయనున్నట్లు మంత్రి చెప్పారు.
కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు
» పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులోని పనులకు సంబంధించి మేఘా సంస్ధ అభ్యర్ధన మేరకు ధరల వ్యత్యాసం కింద జీఎస్‌టీతో కలిపి రూ.557.97 కోట్లకు అనుమతి మంజూరు.
» ఆంధ్రప్రదేశ్ ‘‘పౌల్ట్రీ అభివృద్ధి విధానం 2025–29’’ ముసాయిదాకు ఆమోదం. ఈ విధానం కింద ఇక పౌల్ట్రీ ఫారాలు తప్పనిసరిగా రిజి్రస్టేషన్ చేసుకోవాలి. బయోసెక్యూరిటీని మెరుగుపరుస్తారు. పాలసీలో వివిధ అంశాల కింద మొత్తం రూ.657.18 కోట్ల మేర ఆర్థిక ప్రోత్సాహకాలను సూచించారు. ఇందులో వడ్డీ రాయితీ ఉంది. అయితే ప్రోత్సాహకాలు పౌల్ట్రీ రైతులందరికీ వర్తించవు. రిజి్రస్టేషన్, అర్హత, ధ్రువీకరణ, ఆర్థిక పరిమితులు, బడ్జెట్ లభ్యత ఆధారంగానే ప్రోత్సాహకాలు మంజూరు చేస్తారు.
» ఏపీ ట్రాన్స్‌కో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి తీసుకున్న మధ్యకాలిక రుణం తిరిగి చెల్లింపునకు పూచీకత్తుగా రూ.950 కోట్లకు ప్రభుత్వ హామీ.
» ఏపీపీడీసీఎల్ పీఎఫ్‌సీ ఆర్‌ఈసీ నుంచి పొందిన రూ.1,050 కోట్లు అప్పునకు సంబంధించి ఏపీజెన్‌కో హామీకి ప్రభుత్వం ఆమోదం.


