రాజధానిలో రైల్వే లైన్, గ్రిడ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు కంతేరు, తాడికొండ పరిధిలో భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
దీంతో మలి విడతలో 29,050.62 ఎకరాలకు చేరిన సమీకరణ
రాజధాని కోసం 2015లో 29 గ్రామాల పరిధిలో 53,748 ఎకరాల సమీకరణ
ఇందులో రాజధాని పూర్తవడానికే వందేళ్లు పడుతుందని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు చెప్పిన సర్కార్
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాల కోసం మరో 1.48 లక్షల ఎకరాల సమీకరణకు సంకేతాలు
ఆ మేరకు మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతను సింగపూర్ సంస్థకు కట్టబెట్టిన సర్కార్
స్కామ్‌ల కోసం రాజధాని లేని రాష్ట్రంగా మారుస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు
సాక్షి, అమరావతి : రాజధాని నిర్మాణంలో భాగంగా ఎర్రుపాలెం–నంబూరు బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి వంద మీటర్ల బఫర్ జోన్‌తోపాటు.. రాజధాని సరిహద్దు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు గ్రిడ్ రోడ్ల విస్తరణకు 6,212.50 ఎకరాల సమీకరణకు రాష్ట్ర మంత్రివర్గం గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుంటూరు జిల్లా కంతేరులో 974 ఎకరాలు, తాడికొండ మండలంలో 5,238.50 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ స్కీం (ఎల్పిఎస్) కింద సమీకరించేందుకు సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ)కు అనుమతి ఇచ్చింది. దీంతో రాజధాని నిర్మాణం పేరుతో మలి విడత భూ సమీకరణ 29,050.62 ఎకరాలకు చేరుకోవడం గమనార్హం.
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాలకు మరో 1.48 లక్షల ఎకరాల సమీకరణ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను ఇప్పటికే సింగపూర్ సంస్థకు సర్కార్ కట్టబెట్టింది. రాజధాని నిర్మాణం కోసం 2015లో 53,748 ఎకరాలు (217.23 చదరపు కిలోమీటర్లు) సమీకరించిన సర్కార్.. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో 20,494 ఎకరాల (82.9 చదరపు కిలోమీటర్లు) సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ ప్రక్రియను ప్రారంభించింది. గత నెల 6న రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో మోతడక గ్రామంలో 2,344.12 ఎకరాల సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాజాగా మరో 6,212.50 ఎకరాల సమీకరణకు పచ్చ జెండా ఊపింది. మోతడకతోపాటు.. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాల కోసం గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, ఎడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లోని 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాల్లో (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరణకు అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే బాధ్యతను సింగపూర్‌కు చెందిన సుర్బానా–జురాంగ్ సంస్థకు రూ.45.14 కోట్లకు అప్పగించింది. అంటే.. మొత్తం 2,29,095 ఎకరాల్లో (926.8 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి రూ.4.58 లక్షల కోట్లు
వాస్తవానికి 29 గ్రామాల్లో 53,748 ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తవడానికే వందేళ్ల సమయం పడుతుందని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఇటీవల ప్రభుత్వం చెప్పింది. ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తికి ఇంకెన్ని శతాబ్దాలు పడుతుందన్నది అంచనా వేయలేని స్థితి. మరోవైపు చంద్రబాబు సర్కార్ కేంద్రానికి సమర్పించిన డీపీఆర్‌ల ప్రకారమే రాజధాని నిర్మాణంలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు ఎకరానికి సగటున రూ.2 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొంది.
ఈ లెక్కన 2.29 లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి రూ.4.58 లక్షల కోట్లు అవసరం. ఆ అప్పు, వడ్డీతో కలిసి ఇంకెన్ని లక్షల కోట్లు అవుతుందోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి స్కాముల కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే కాదు.. రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి చంద్రబాబు నెట్టేస్తున్నారంటూ విద్యార్థులు, ఆర్థికవేత్తలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు.


