కర్నూలు జనసంద్రం | YS Jagan attends the wedding reception of SV Mohan Reddys son | Sakshi
Sakshi News home page

కర్నూలు జనసంద్రం

Sep 4 2026 3:08 AM | Updated on Sep 4 2026 3:08 AM

YS Jagan attends the wedding reception of SV Mohan Reddys son

ఎస్వీ మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 

నూతన వధూవరులకు ఆశీర్వాదం.. అడుగడుగునా జనం బ్రహ్మరథం

కర్నూలు (టౌన్‌): కర్నూలు నగరం గురువారం జనసంద్రంగా మారింది. ఎస్టీబీసీ కళాశాల మైదానం మొదలు వైఎస్సార్‌ సర్కిల్, నరసింగరావు పేట, చిరంజీవి పార్కు, ప్రకాష్‌ నగర్, నేతాజీ థియేటర్, సుంకేసుల రోడ్డులోని సెయింట్‌ జోసఫ్‌ కళాశాల వరకు ఇసుక వేస్తే రాలనంతగా జనసందోహం సందడి చేసింది. తమ అభిమాన నాయకుడైన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలుకు విచ్చేశారని తెలియడంతో అశేష ప్రజానీకం తరలి వచ్చి రోడ్డుకిరువైపులా బారులు తీరింది. 

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎస్వీ విజయమనోహరి దంపతుల కుమారుడు జనక్‌దత్తా రెడ్డి, రాజమండ్రి రుడా మాజీ చైర్మన్‌ షర్మిల, మేడపాటి అనిల్‌ రెడ్డి దంపతుల కుమార్తె హంసినీ శ్రేయల వివాహ రిసెప్షన్‌కు గురువారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. 

అంతకు ముందు హెలికాఫ్టర్‌లో ఎస్‌టీబీసీ కళాశాల మైదానానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వివాహ రిసెప్షన్‌ ఏర్పాటు చేసిన సెయింట్‌ జోసఫ్‌ కళాశాల వరకు దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. ప్రజలు, మహిళలు, అభిమానులు వేలాదిగా అడుగడుగునా వైఎస్‌ జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. జగన్‌తో సెల్ఫీ దిగేందుకు యువత పోటీ పడ్డారు. నేతలను, అభిమానులను వైఎస్‌ జగన్‌ ఆత్మీయంగా పలకరిస్తూ.. అభివాదం చేస్తూ ముందుకు సాగారు.    

వైఎస్‌ జగన్‌ను కలిసిన న్యాయవాదులు
అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ
కర్నూలు: చంద్రబాబు కూటమి ప్రభుత్వం న్యాయ పరంగా కర్నూలుకు తీరని నష్టం చేకూర్చిందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కర్నూలుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో పాటు మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తను కర్నూలులో ఏర్పాటు చేసిందన్నారు. అయితే వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడకు తరలించి రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే కర్నూలులో నేషనల్‌ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కర్నూలులో న్యాయవాదుల సమాజానికి ఇప్పటి వరకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. వారి సమస్యలను ఓపికగా విన్న వైఎస్‌ జగన్‌.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ నేతలు జి.స్వాములు, సువర్ణా రెడ్డి, హనుమంత రెడ్డి, నరేంద్రనాథ్‌ రెడ్డి, కోడుమూరు ప్రభాకర్, శివ, ఇతర న్యాయవాదులు ఉన్నారు.   

బ్లడ్‌ క్యాన్సర్‌ బాధితునికి వైఎస్‌ జగన్‌ పరామర్శ
కర్నూలు (టౌన్‌): చాలా కాలంగా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న విశ్వనాథ్‌ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వీరాభిమాని. వైఎస్‌ జగన్‌ను దగ్గరి నుంచి చూడాలని, ఫొటో దిగాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో గురువారం కర్నూలు నగరానికి వస్తున్న వైఎస్‌ జగన్‌ను ఎలాగైనా కలవాలని నడవలేని స్థితిలో వీల్‌చైర్‌లో ఎస్‌టీబీసీ కళాశాలకు చేరుకున్నాడు. 

మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ ద్వారా విషయం తెలుసుకున్న వైఎస్‌ జగన్‌ వెంటనే వీల్‌ చైర్‌లో ఉన్న విశ్వనాథ్‌ దగ్గరకు వెళ్లారు. అతనితో కలిసి ఫొటో దిగారు. ఆప్యాయంగా పలకరించారు. దీంతో ఇన్నాళ్లకు తన కోరిక తీరిందని విశ్వనాథ్‌ సంతోషం వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement