ఇప్పటికే కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న తదితర పంటలు దాదాపు 28వేల హెక్టార్లలో... నంద్యాల జిల్లాలో 30వేల హెక్టార్లలో పంటలను దున్నేశారు. ప్రత్యామ్నాయంగా జొన్న, కొర్ర, స్వల్పకాలిక రకాలైన కంది, పెసర, అలసంద, ఉలువలు, వంటి పంటలు సాగు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు కూడా వర్షాల అవసరం ఉంది. కనీసం 100 మి.మీ వర్షపాతం నమోదు కావాలి. ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. వర్షాలే లేకపోతే ప్రత్యామ్నాయ పంటల సాగు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎల్‌నినో తీవ్రతను పరిశీలిస్తే ఈ సారి రబీ సీజన్‌పైనా ఆశలు వదులు కోవాల్సిందేనని తెలుస్తోంది.
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌లో మూడు నెలలు గడచిపోయాయి. మామూలుగా ఈ పాటికి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకోవాల్సి ఉంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఎటు చూసినా ఏడారి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 3,44,171 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. నంద్యాల జిల్లాలో 1,55,648 హెక్టార్లలో పంటలు వేశారు. దాదాపు అన్ని పంటలు నెల నుంచి 90 రోజుల దశలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో పత్తి 2,32,671 హెక్టార్లలో సాగయింది. మామూలుగా పత్తిలో ఈ పాటికి ఒకసారి పత్తి తీస్తారు. మొదటి సారి పత్తి తీయడంలోనే ఎకరాకు 3–4 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. అలాంటిది పత్తి వేసి 90 రోజులు గడుస్తున్నా కిలో దిగుబడి కూడా తీయలేని పరిస్థితి. పత్తి మొక్కలు కనీసం 3–4 అడుగుల ఎత్తు పెరగాలి. ఈ సారి ఏర్పడిన అనావృష్టి వల్ల ఒక్క అడుగు ఎత్తు కూడా పెరగకపోవడం కరువు తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క పత్తిలోనే కాదు.. వేరుశనగ, కంది, ఆముదం తదితర అన్ని పంటల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నంద్యాల జిల్లాలో మొక్కజొన్న, కంది, మినుము, వరి, పత్తి ప్రధాన పంటలు. ఒక్క డోన్ నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని ప్రాంతాలకు నీటిపారుదల సదుపాయం ఉంది. కానీ మొదటిసారి నీటిపారుదల స్తంభించింది. సాగైన పంటల్లో దిగుబడులు దాదాపు జీరో కావచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలే స్పష్టం చేస్తున్నారు.
దెబ్బతీసిన ఎల్‌నినో..
వరుసగా 21 రోజులు వర్షం లేకపోతే ఒక డ్రై స్పెల్‌గా పరిగణిస్తారు. ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లో జూన్ 14న ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మినహా ఎక్కడా భారీ వర్షం లేదు. అంటే దాదాపు రెండున్నర నెలలుగా వర్షాలు లేకపోవడం ఇదే మొదటిసారి. ఉమ్మడి జిల్లాలో దాదాపు ప్రతి మండలంలో మూడు డ్రై స్పెల్‌లు రావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. నంద్యాల జిల్లాలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సాధారణ వర్షపాతం 428.3 మి.మీ ఉండగా.. 243.8 మి.మీ వర్షపాతం మాత్ర మే నమోదైంది. కర్నూలు జిల్లాలో జూన్ నుంచి ఆగస్టు వరకు 286.4 మి.మీ సాధారణ వర్షపాతం ఉండగా.. 164.5 మి.మీకే పరిమితమైంది. గత 50 ఏళ్లలో అనేక సార్లు ఎల్‌నినో ప్రభావం ఏర్పడింది. అయితే వర్షాలు కాస్త మెరుగ్గానే కురిశాయి. ఈ సంవత్సరం ఏర్పడిన ఎల్‌నినోను అత్యంత తీవ్రమైనదిగా పేర్కొంటున్నారు.


