‘యువగళం పోస్టింగ్స్‌’.. లోకేశ్‌ టీమ్‌కు టీచర్‌ ఉద్యోగాలు! | Chandrababu Govt Irregularities: Teacher Jobs To Nara Lokesh Team | Sakshi
Sakshi News home page

‘యువగళం పోస్టింగ్స్‌’.. లోకేశ్‌ టీమ్‌కు టీచర్‌ ఉద్యోగాలు!

Sep 4 2026 2:37 AM | Updated on Sep 4 2026 2:43 AM

Chandrababu Govt Irregularities: Teacher Jobs To Nara Lokesh Team

మెగా డీఎస్సీ–2025 అక్రమాల పర్వంలో మరో కొత్త కోణం 

టెట్‌ క్వాలిఫై కాకపోయినా.. అనర్హులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు

కర్నూలులో నకిలీ సర్టిఫికెట్లతో టీచర్‌ పోస్టు పొందినట్లు బహిర్గతం.. 

విచారించి నిజమేనని నిర్ధారించిన విద్యాశాఖ అధికారులు 

కర్నూలు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరుల్లో నకిలీ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల కలకలం

ప్రతిభావంతులకు బాబు సర్కారు తీరని ద్రోహం.. 

నోటిఫికేషన్‌ నుంచి పోస్టింగ్‌ల దాకా ఉల్లంఘనలే

స్పోర్ట్స్‌ కోటా పేరుతో ఇష్టారాజ్యంగా జీవోలు 

అసలు పరీక్షే లేకుండా టీచర్‌ ఉద్యోగాలు 

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు సైతం టెట్‌ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు

దీనికి విరుద్ధంగా టెట్‌ క్వాలిఫై కాకున్నా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలిచ్చేసిన బాబు సర్కారు

సాక్షి ప్రతినిధి, కర్నూలు: సీఎం చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ అక్రమాలమయంగా మారిందనేందుకు మరిన్ని బలమైన ఆధారాలు, కొత్త కోణాలు, సంచలన వాస్తవాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిభావంతులను దగా చేస్తూ, అర్హులకు ద్రోహం తలపెట్టి మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణలో గోప్యతకు, పారదర్శకతకు చంద్రబాబు సర్కారు తూట్లు పొడిచింది. అసలు పరీక్షే లేకుండా స్పోర్ట్స్‌ కోటా పేరుతో ఇష్టారాజ్యంగా టీచర్‌ ఉద్యోగాలను ఇవ్వడం.. జాతీయ స్థాయిలో పతకాలు పొందినవారిని పక్కనపెట్టి కేవలం పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేయడం.. ఆ పోస్టులకు బేరం పెట్టిన వాట్సాప్‌ కాల్‌ రికార్డింగ్స్‌ వైరల్‌ కావడం తెలిసిందే. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెంటనే రాజీనామా చేయడంతోపాటు మొత్తం ప్రక్రియపై సీబీఐతో విచారించాలని ఇప్పటికే నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, జెన్‌జీ డిమాండ్‌ చేస్తుండగా తాజాగా కర్నూలులో మరో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. 

డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో అత్యంత కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో కనీస అర్హత మార్కులు సాధించడంలో విఫలమైన వారిని సైతం మెగా డీఎస్సీ ద్వారా టీచర్లుగా పోస్టింగ్‌లు ఇవ్వడం చంద్రబాబు సర్కారు బరి తెగింపు చర్యలకు పరాకాష్టగా విద్యావేత్తలు, పరిశీలకులు పేర్కొంటున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్‌లో సాధించిన మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉన్నందున ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఎంతో కీలకం. టెట్‌ మార్కులను బట్టి తలరాతలు మారిపోతుంటాయి. ఇక ఇప్పటికే దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు సైతం టెట్‌ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. అలాంటిది కొత్తగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాల్లో టెట్‌ క్వాలిఫై కాకున్నా టీచర్‌ పోస్టు కేటాయించటాన్ని బట్టి ఈ ప్రక్రియ ఎంత దారుణంగా జరిగిందో ఊహించవచ్చని స్పష్టం చేస్తున్నారు. 

‘అసలు పరీక్షే లేకుండా టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? స్పోర్ట్స్‌ కోటా జీవోలు ఎందుకు మార్చారు? స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు ఇచ్చేదీ మీరే.. ధృవీకరించేది కూడా మీరేనా..? పతకాలు లేకపోయినా ఉద్యోగాలిస్తారా? కేవలం పార్టిసిపేట్‌ చేస్తే చాలా? జాతీయ పతక విజేతకు ఉద్యోగం ఎందుకు రాలేదు? ప్రశ్నాపత్రం తయారీ.. పరీక్ష నిర్వహణ బాధ్యత.. రెండూ ఒకరి చేతికేనా? ఇది స్కామ్‌కు నాంది కాదా? అత్యంత కీలకమైన ప్రశ్నాపత్రం తయారీ, అప్‌లోడ్‌ ప్రక్రియలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొనడం.. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగే డీఎస్సీలో టాప్‌ ర్యాంకర్‌గా నిలవడం నిజం కాదా? మరి టాప్‌ ర్యాంకర్‌కు పోస్టు ఎందుకు ఇవ్వలేదు? సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కాలేదని కాకమ్మ కబుర్లు చెబుతారా? సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరవ్వని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు? కలెక్టర్ల నేతృత్వంలో సాగాల్సిన ప్రక్రియను ఎందుకు కేంద్రీకృతం చేశారు? 1 : 1లో వెరిఫికేషన్‌కు పిలిచి.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు?.. ఎవరికోసం ‘సర్దుబాటు?’ 336 కేసులు వేశారంటూనే.. ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బుకాయిస్తారా? టీచర్‌ పోస్టులకు బేరసారాల ఆడియోపై కేసు నమోదైనా సూత్రధారులెవరో బయట పెట్టరా? స్కామ్‌కు ఇవన్నీ సాక్ష్యాలు కాదా? న్యాయం జరగాలంటే సీబీఐతో విచారించాల్సిందే. నైతిక బాధ్యతగా విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాల్సిందే..’ అని స్పష్టం చేస్తున్నారు.  

టెట్‌ క్వాలిఫై కాకున్నా ఎస్‌జీటీ పోస్టింగ్‌.. 
మెగా డీఎస్సీలో కనీసం టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌) క్వాలిఫై కాకుండానే చంద్రబాబు సర్కారు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు బహిర్గతమైంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీ స్కూల్‌లో టెట్‌ క్వాలిఫై కాకుండానే స్పోర్ట్స్‌ కోటాలో ప్రభాకర్‌ను ఎస్‌జీటీ టీచర్‌గా నియమించినట్లు తాజాగా తేలింది. ఈ విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో బుధవారం విచారించిన జిల్లా విద్యాధికారి వాస్తవమేనని నిర్ధారించడం సంచలనం రేపుతోంది. ఒక్క ప్రభాకరే కాకుండా జిల్లావ్యాప్తంగా స్పోర్ట్స్‌ కోటాలో సుమారు 25 మంది ఇలా టీచర్‌ ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. వీరిలో చాలామంది టెట్‌ క్వాలిఫై కాలేదని తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి రావడం ఖాయం. మరోవైపు స్పోర్ట్స్‌లో ఎలాంటి నైపుణ్యం లేకున్నా చాలామంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌ వ్యవహారం బయటకు పొక్కడంతో వారంతా బెంబేలెత్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు టీచర్లు సెలవులో వెళ్లిపోయినట్లు చర్చ జరుగుతోంది. 

రాష్ట్రవ్యాప్తంగా నకిలీల కలకలం.. 
కర్నూలుకు చెందిన ఓ ప్రైవేట్‌ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్, దూరవిద్యా కేంద్రంలో పని చేస్తున్న మరోవ్యక్తి, నెల్లూరుకు చెందిన క్రీడా అసోసియేషన్‌ నాయకుడితో కలసి మెగా డీఎస్సీలో నకిలీ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించినట్లు సమాచారం. వీరితోపాటు ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఇదే తరహాలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అక్రమంగా ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. కర్నూలు, చిత్తూరు, తిరుపతి, కడప అనంతపురం జిల్లాల్లోనూ నకిలీ స్టోర్ట్స్‌ సర్టిఫికెట్లతో చాలామంది మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందినట్లు ప్రచారం జరుగుతోంది. 

లోకేశ్‌ యువగళం టీమ్‌కు టీచర్‌ జాబ్స్‌..! 
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సమయంలో చురుగ్గా పనిచేసిన వారిలో చాలామందికి మెగా డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా కింద దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారం. యువగళంలో ఎక్కువగా అనంతపురం, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన టీమ్‌ సభ్యులకు ఈ తరహాలో ఉద్యోగాలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. లోకేశ్‌ టీమ్‌లో కీలకంగా ఉన్న కొందరు వ్యక్తులు ఈ మొత్తం వ్యవహారం నడిపించినట్లు టీడీపీలోని ఓ వర్గం చర్చించుకుంటోంది.  

సవాల్‌ స్వీకరించకుండా చినబాబు దబాయింపు..!
ఇప్పటికే మెగా డీఎస్సీలో అక్రమాలను మీడియా సాక్షిగా ఎండగట్టిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్‌ విసిరితే మంత్రి లోకేశ్‌ తోక ముడిచారు. దీన్ని కప్పిపుచ్చేందుకు గత ప్రభుత్వంలో పూర్తి పారదర్శకంగా పూర్తయిన గ్రూప్‌ 1 నియామకాలపై దు్రష్పచారానికి తెర తీశారు. నిజంగానే మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తే చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు అంగీకరించాలని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు, విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. స్పోర్ట్స్‌ కోటా పేరు చెప్పి అసలు పరీక్షే లేకుండా టీచర్‌ ఉద్యోగాలు కట్టబెట్టడం ఏమిటని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అవన్నీ అమ్మకానికి పెట్టిన ఉద్యోగాలేనని, ఈ వ్యవహారం విద్యాశాఖా మంత్రి కనుసన్నల్లోనే జరిగినట్లు కర్నూలు డీఈవో కార్యాలయంలోని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఇక స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలివ్వడానికి టెట్‌ అక్కర లేదని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇన్‌ సర్వీసు టీచర్లకు మాత్రం టెట్‌ తప్పనిసరి చేయడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయ వర్గాలు ప్రశ్నిస్తుండటం కొసమెరుపు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement