రాష్ట్రవ్యాప్తంగా ఏపీజేఏసీ అమరావతి ‘డిమాండ్స్ డే’
భోజన విరామ సమయంలో ఆందోళనలు
పెండింగ్ డీఏ, పీఆర్సీ, ఆర్థిక బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్
చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని స్పషీ్టకరణ
సహనాన్ని పరీక్షించొద్దని, తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్
సమస్యలు పరిష్కరించకపోతే ఐక్య ఉద్యమం ఉధృతం చేస్తామన్న ఏపీజేఏసీ అమరావతి
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు డిమాండ్స్ డే పేరుతో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అన్ని జిల్లాలు, డివిజన్ కేంద్రాలు, హెచ్‌ఓడీ కార్యాలయాల వద్ద నిరసనలతో హోరెత్తించారు. ‘మా బకాయిలు మాకు చెల్లించాలి.. మా హక్కులు మాకు కల్పించాలి‘అంటూ నినాదాలు చేశారు.
డిమాండ్స్ డే విజయవంతమైనట్లు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు కొత్తగా ఏమీ కోరడంలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల అమలునే కోరుతున్నారని తెలిపారు.
ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు
కష్టార్జిత హక్కులు, న్యాయమైన ఆర్థిక ప్రయోజనాలనే కోరుతున్నారన్నారు. డీఏ బకాయిలు, పీఆర్సీ ఆర్థిక ప్రయోజనాలు, వేల కోట్ల పెండింగ్ బిల్లులు, సరండర్ లీవులు, రిటైర్డ్, మృతి చెందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర ఆర్థిక ప్రయోజనాలను ఇకపై వాయిదా వేయడం సరికాదని చెప్పారు. జీతభత్యాల బకాయిలు తీసుకోకుండానే అనేకమంది పెన్షనర్లు చనిపోయారని, వారికి ప్రభుత్వం చెల్లించాల్సిన మట్టి ఖర్చులను కూడా తోటి అధికారులు సొంత డబ్బు నుంచి చెల్లించే పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు.
చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకపోయినా రెండేళ్లకుపైగా ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉన్నామని, ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన నిర్ణయం, కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జాప్యం కొనసాగిస్తే ఐక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


