బాలిక మిస్సింగ్ కేసులో నిప్పులు చెరిగిన హైకోర్టు
ఈ కేసును డీజీపీ రొటీన్ కేసులా చూస్తున్నారు
రాష్ట్రంలో సిట్ ఏర్పాటు చేశారంటే.. ఆ కేసు కోల్డ్ స్టోరేజీకే..
బాలికను హాజరుపరచమంటే సిట్ ఏర్పాటు చేశారంటారేంటి?
ఆ సిట్‌లో పట్టాభిపురం పోలీసులకు స్థానం కల్పించడమేమిటి?
వారు అసమర్థులనేగా సిట్.. మళ్లీ సిట్‌లో వాళ్లేమిటి?
ఎస్‌పీకి బదులుగా సీఐడీ నుంచి నివేదిక తెప్పించుకున్న డీజీపీ
అసలు ఈ కేసులో సీఐడీకి ఏం సంబంధం?
డీజీపీ ఇలాగేనా పనిచేసేది? బుర్ర ఉపయోగించరా?
బాలిక ఎక్కడ ఉందో పోలీసులకు బాగా తెలుసు
డీజీపీ రంగంలో దిగి పోలీసులను పరుగులు పెట్టిస్తే పనెందుకు కాదు?
బాలిక ఆచూకీ అడుగుతుంటే అదితప్ప అన్నీ చేస్తున్నారు..
ఇలా అయితే లాభం లేదు.. డీజీపీని కోర్టుకు పిలిపిస్తాం
తేల్చి చెప్పిన జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం
సోమవారం వరకు గడువు కోరిన డీజీపీ.. విచారణ 7కి వాయిదా
సాక్షి, అమరావతి: గుంటూరుకు చెందిన పదిహేనేళ్ల బాలిక అదృశ్యం కేసులో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యవహారశైలిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ ధర్మాసనం తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు అంటూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయడాన్ని కూడా తప్పుపట్టింది. సిట్ ఏర్పాటు కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనంది. రాష్ట్రంలో ఏదైనా కేసులో సిట్ ఏర్పాటు చేశారంటే, దాని అర్థం ఆ కేసు ‘కోల్డ్ స్టోరేజ్’లోకి వెళ్లినట్లేనని ఘాటుగా వ్యాఖ్యానించింది.
అదృశ్యమైన బాలిక ఆచూకీ తెలుసుకుని, తమ ముందు హాజరుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని తాము ఆదేశిస్తే, ఆ పని చేయకుండా సిట్‌ను ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించింది. దీనిని బట్టి డీజీపీ బుర్ర ఉపయోగించడం లేదని అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. పైపెచ్చు ఈ సిట్‌లో గుంటూరు, పట్టాభిపురం పోలీసులకు స్థానం కల్పించడాన్ని తప్పుపట్టింది. ‘బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పట్టాభిపురం పోలీసులు ఏమీ చేయలేకపోయారు. మూడు నెలల క్రితం బాలిక తండ్రి ఫిర్యాదు ఇస్తే ఇప్పటి వరకు బాలిక ఆచూకీ తెలుసుకోలేకపోయారు.
ఓ బాలిక ఆచూకీ తెలుసుకోవడంలో దారుణంగా విఫలమైన వారికి సిట్‌లో స్థానం కల్పిస్తారా? సిట్‌ను ఏర్పాటు చేశారంటేనే ఈ కేసు దర్యాప్తులో గుంటూరు పోలీసులు విఫలమైనట్లు డీజీపీ ఒప్పుకున్నట్లే. గుంటూరు పోలీసుల వల్ల ఏమీ కాదన్న నిర్ణయానికి వచ్చిన తరువాతనే డీజీపీ సిట్‌ను ఏర్పాటు చేశారు. అలాంటప్పుడు గుంటూరు పోలీసులకు సిట్‌లో స్థానం కల్పించడంలో అర్థమేముంది?’ అని డీజీపీని నిలదీసింది. ఈ కేసులో దర్యాప్తు ఎలా చేయాలో మేం చెప్పే పరిస్థితిని తెచ్చుకోవద్దని డీజీపీకి తేల్చి చెప్పింది. పోలీసులు ఉన్నది ప్రజల ప్రాణాలను రక్షించడానికేనని స్పష్టం చేసింది.
మాకు కథలు చెబుతున్నారు
‘బాలికను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించిన తరువాత తీసుకున్న చర్యలు, సీఐడీ అదనపు డీజీ సమీక్ష, సిట్ ఏర్పాటు, సిట్ చేయాల్సిన పనులు వంటి వాటిపై దాఖలు చేసిన మెమో విషయంలోనూ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మెమోలో వ్యాసం రాశారు. సీరియల్ కథలు రాశారు. వాటి ఆధారంగా మాకు కథలు చెబుతున్నారు. ఓ బాలిక అదృశ్యం కేసును రొటీన్ వ్యవహారంలా చూస్తున్నారు. మీరు ఆ మెమోలో రాసిన రాతల తీరు చూస్తుంటే, కోర్టుకే మీరు సూచనలు చేస్తున్నట్లుంది. కోర్టు ఎలా వ్యవహరించాలో మార్గదర్శకత్వం చేస్తున్నట్లు ఉంది. పోలీసులు రాసిచ్చింది మాకు ఇవ్వడం కాదు. ప్రభుత్వ న్యాయవాదులూ వాటిని చదివి రావాలి. హెబియస్ కార్పస్ పిటిషన్‌లో పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మాకు కావాల్సింది బాలిక ఆచూకీ..
ఇలాంటి స్పందనను మేం డీజీపీ నుంచి ఏ మాత్రం ఆశించలేదు. ఈ కేసు దర్యాప్తులో పట్టాభిపురం పోలీసుల నుంచి సహకారం తీసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లకు సిట్‌లో స్థానం కల్పించడం ఏంటి? డీజీపీ ఈ కేసును చాలా కాజువల్‌గా తీసుకుంటున్నారు. డీజీపీ తీరుపై మేం బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. బాలికను ట్రాప్ చేసి తీసుకెళ్లిన వ్యక్తి ఎక్కడున్నారో పోలీసులకు బాగా తెలుసు.
డీజీపీ ఆ పోలీసులను ఓ గదిలో కూర్చోబెట్టి అడిగితే ఉదయం కల్లా వారిని రప్పించొచ్చు. బాలికను కోర్టు ముందు హాజరుపరచమంటే, కాలానుగుణ నివేదికలు ఇస్తామంటారా? నివేదికలు ఇస్తే ఏమవుతుంది? మాకు కావాల్సింది బాలిక ఆచూకీ. అది తప్ప మీరు అన్నీ చేస్తామంటున్నారు. డీజీపీతో పాటు సంబంధిత పోలీసు అధికారుల వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తాం. అప్పుడు గాని పరిస్థితుల్లో మార్పు రాదు.’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది.
కోర్టు ప్రొసీడింగ్స్‌ను డీజీపీ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు...
‘డీజీపీ కోర్టు ప్రొసీడింగ్స్‌ను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. సిట్ ఏర్పాటు చేయడానికి ముందు గుంటూరు జిల్లా ఎస్‌పీ నుంచి డీజీపీ నివేదిక తెప్పించుకున్నారా? ఎస్‌పీ నుంచి కాకుండా సీఐడీ నుంచి నివేదిక తెప్పించుకోవడం ఏంటి? అసలు ఈ కేసుతో సీఐడీకి ఏం సంబంధం? ఎస్‌పీ నుంచి కాకుండా సీఐడీ నుంచి నివేదిక తెప్పించుకున్నారంటేనే, డీజీపీ బుర్ర ఉపయోగించలేదని అర్థమవుతోంది.
అసలు సిట్ ఏంటి? డీజీపీనే రంగంలోకి దిగి పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తే, ఆ బాలిక ఆచూకీ ఇట్టే తెలుస్తుంది. అయితే గుంటూరు పోలీసులను డీజీపీ అసమర్థులుగా భావించారు కాబట్టే సిట్‌ను ఏర్పాటు చేశారు. ఓ బాలిక ఆచూకీ తెలుసుకోలేకపోయినందుకు గుంటూరు పోలీసులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారికి సిట్‌లో స్థానం కల్పిస్తారా? డీజీపీ ఇలాగేనా పని చేసేది? సిట్ ఏర్పాటు కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. డీజీపీనే కోర్టుకు పిలిపించి వివరణ అడుగుతాం.’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
సోమవారం వరకు గడువునివ్వండి...
ఈ సమయంలో పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) తిరుమాను విష్ణు తేజ వాదనలు వినిపిస్తూ, సోమవారం వరకు గడువునివ్వాలని అభ్యర్థించారు. ఆ లోపు బాలిక ఆచూకీ తెలుసుకుని కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్పారు. సోమవారం లోపు బాలిక ఆచూకీ తెలిసినా వెంటనే హాజరుపరుస్తామని తెలిపారు. బాలిక అదృశ్యం కేసును కిడ్నాప్ కేసుగా మార్చామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది.
దళిత మహిళ గంగమ్మ లాకప్‌డెత్ బాధ్యురాలికే సిట్ బాధ్యతలు...
బాలిక అదృశ్యం వ్యవహారంలో సిట్‌ను ఏర్పాటు చేసిన డీజీపీ, దాని బాధ్యతలను గుంటూరు ఎస్‌పీ (క్రైమ్స్) కె.సుప్రజకు అప్పగించారు. సుప్రజతో పాటు గుంటూరు వెస్ట్ డీఎస్‌పీ బి.శ్రీనివాసరావు, పట్టాభిపురం ఇన్‌స్పెక్టర్ గంగా వెంకటేశ్వర్లు, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ నిసార్ బాషా, మహిళా ఎస్‌ఐ తరంగిణి, ఎస్‌ఐ రాజ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు, కానిస్టేబుళ్లు తనీష్ కుమార్, మాణిక్యరావు సిట్‌లో ఉన్నారు.
వాస్తవానికి సుప్రజ లాకప్‌డెత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఓ కేసులో సుప్రజ నేతృత్వంలోని సిట్ చేతిలో కర్నూలుకు చెందిన మాల గంగమ్మ అనే దళిత మహిళ లాకప్‌డెత్‌కు గురయ్యారన్న ఆరోపణలున్నాయి. గంగమ్మ మృతిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతూ వస్తోంది. ఇలాంటి సుప్రజకు మళ్లీ సిట్ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.
కుమార్తె ఆచూకీ కోసం తండ్రి న్యాయ పోరాటం...
గుంటూరులో 10వ తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్‌కి వెళ్లి తిరిగి రాలేదంటూ గుంటూరుకు చెందిన వ్యాపారి వాసు ఈ ఏడాది జూన్ 10న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అదే రోజున మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వాసు ఒత్తిడితో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొన్ని క్లూస్ సంపాదించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బాలిక ఆచూకీని మాత్రం తెలుసుకోలేకపోయారు.
పోలీసుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన వాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెను కోర్టు ముందు హాజరుపరిచి, ఆమెను తమకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం, అదృశ్యమైన బాలిక ఆచూకీ తెలుసుకుని తమ ముందు హాజరుపరిచేలా చూడాలని డీజీపీని ఆదేశించిన విషయం తెలిసిందే.


