ఎక్సైజ్ ఏఈఎస్‌గా రాజమహేంద్రవరం జైలర్.. నిబంధనలు సడలించి మరీ నియమించిన సర్కారు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు పాల్పడి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా చంద్రబాబును బాగా చూసుకున్నందుకు జైలర్ కోవెల దుర్గా రమేష్‌కు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏపీ ఎక్సైజ్ సర్వీస్ రూల్స్ సడలించి మరీ ఆయన్ను అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఏపీఈఎస్)గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
బాబు ఉన్న బ్లాక్‌కు ఇన్‌చార్జిగా..
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉండటం తెలిసిందే. 2023 సెప్టెంబర్ 9న సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2023 అక్టోబర్ 31న విడుదలయ్యే వరకు 52 రోజులపాటు సెంట్రల్ జైలులో చంద్రబాబును ఉంచిన జైలు బ్లాక్‌కు దుర్గా రమేష్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు చంద్రబాబును చక్కగా చూసుకున్నందుకే నిబంధనలు సడలించి మరీ దుర్గా రమేష్‌ను నియమించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్పెషల్ కేస్ పేరుతో నిబంధనలు సడలించి..
దుర్గా రమేష్ 2010లో డిప్యూటీ జైలర్‌గా నియమితులు కాగా 2017లో జైలర్‌గా పదోన్నతి పొంది ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కోసం చంద్రబాబు సర్కారు ఏకంగా నిబంధనలు సడలించడం చర్చనీయాంశంగా మారింది. సమాజానికి ప్రత్యక్షంగా సేవ చేసేందుకు తన సేవలను ఎక్సైజ్ శాఖకు శాశ్వత ప్రాతిపదికన మార్చాల్సిందిగా కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎక్సైజ్ సర్వీస్ నిబంధనలు సాధారణంగా ఇతర శాఖల వారిని నేరుగా ఈ పోస్టుల్లోకి తీసుకోవడానికి అనుమతించవు. దీంతో ఏపీ ఎక్సైజ్ సర్వీస్ రూల్స్ కేటగిరీ–4 కింద రూల్ 2 సడలిస్తూ ‘స్పెషల్ కేస్‘ కింద ప్రభుత్వం ఈ నియామకం చేపట్టడం గమనార్హం.


