కౌతాళంలో రహస్యంగా 24 మంది టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన
వల్లూరు స్కూల్‌లో స్పోర్ట్స్ కోటాలో ఐదుగురికి ఉద్యోగాలు
కౌతాళం: కర్నూలు జిల్లాలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో చోటు చేసుకున్న బాగోతాలు కలకలం రేపడంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు హడావుడిగా విచారణకు ఉపక్రమించారు. కౌతాళం మండలంలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందిన 24 మంది ఉపాధ్యాయులను మండల విద్యాధికారులు రామాంజినేయులు, శోభారాణి గురువారం విచారించి వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఎంఈవో కార్యాలయానికి కాకుండా గోతులదొడ్డి పాఠశాల వద్దకు పిలిపించి అక్కడ రహస్యంగా విచారణ చేపట్టారు.
వల్లూరు ఆదర్శ పాఠశాలలో ప్రభాకర్‌తో పాటు మిగతా నలుగురు ఉపాధ్యాయులు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం పొందిన వారే ఉన్నారు. కరా్టటక సరిహద్దు ప్రాంతమైన కౌతాళంలో నదీ తీర గ్రామాలనే స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఎంచుకోవడం గమనార్హం. వల్లూరు పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు, కుంబళనూరులో ఐదుగురు, గుడికంబాలిలో ముగ్గురు, కాత్రికి పాఠశాలలో నలుగురు, మరళిలో ఇద్దరు, కరణిలో ఒకరు, కుంటనహాల్‌లో ఒకరు, చిరుతపల్లి పాఠశాలలో ముగ్గురు.. ఇలా సరిహద్దు గ్రామాలనే స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఎంపిక చేసుకున్నారు.
జిల్లా ఫస్ట్ వచ్చినా ఉద్యోగం రాలేదు..
డీఎస్సీలో తన చిన్నాన్న కుమార్తె 70.18 మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించినా ఉద్యోగం ఇవ్వలేదని నదిచాగి ఎంపీటీసీ లింగన్నగౌడ్ పేర్కొన్నారు. తాళ్లూరు స్వాతికి టెట్‌లో 150కి 115 మార్కులు వచ్చాయన్నారు. కాల్ లెటర్ పంపించినా కర్నూలుకు వెళితే రిజెక్ట్ చేశారన్నారు.


