మంగళగిరిలోని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన టీచర్లు
‘లోకేశ్ రాజీనామా చేస్తావా.. లేక టెట్ రద్దు చేస్తావా’ అంటూ నినాదాలు
చంద్రబాబు సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం
టీచర్లపై పోలీసులను ప్రయోగించిన సర్కారు
సర్వీసు రోడ్లు మూసివేత
150 మందికి పైగా టీచర్లు అరెస్ట్.. వివిధ స్టేషన్లకు తరలింపు
నిరసనగా రోడ్డుపైనే బైఠాయింపు
ఉద్యోగ భద్రత కోసం రోడ్డెక్కామన్న టీచర్లు
సాక్షి, అమరావతి/మంగళగిరి రూరల్: చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు ఆగ్రహోదగ్రులయ్యారు. ‘లోకేశ్ రాజీనామా చేస్తావా.. లేక టెట్ రద్దు చేస్తావా’ అంటూ గర్జించారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్‌తో గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయాన్ని (విద్యాభవన్)ముట్టడించేందుకు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపింది.
పోలీసులను ప్రయోగించి వారి గొంతునొక్కే ప్రయత్నం చేసింది. విద్యాభవన్‌కు టీచర్లు చేరుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టించింది. సర్వీసు రోడ్లను సైతం మూసివేయించింది. పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేస్తూ విద్యాభవన్ వైపు ఉపాధ్యాయులు వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్‌లు చేశారు. 150 మందికి పైగా ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు.

టీచర్లంటే అంత నిర్లక్ష్యమా!
కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తమ ఆవేదనను ఎందుకు పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టీచర్లంటే అంత నిర్లక్ష్యమా బాబూ’ అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో వారంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దాదాపు 30 ఏళ్లు సర్వీసు పూర్తిచేసిన తాము టెట్ పూర్తి చేయకపోతే ఉద్యోగం వదులు కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టామని.. బైక్ ర్యాలీలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో చలో విద్యాభవన్‌కు సిద్ధమయ్యామని తెలిపారు.
పీఆర్సీ వేయకపోయినా, ఐఆర్, డీఏలు ఇవ్వకపోయినా ప్రశ్నించని తాము ఉద్యోగ భద్రత కోసం విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కాల్సి వచ్చిందని వాపోయారు. ఉపాధ్యాయుల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశి్నంచారు. తమిళనాడు ప్రభుత్వం ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ మినహాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని, ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రభుత్వం స్పందించి రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.

పోలీసులను ప్రయోగించి నిర్భందించడం తమ గొంతు నొక్కడమేనని వాపోయారు. అవసరమైతే నిరవధిక దీక్షలు చేపడతామని హెచ్చరించారు. టీచర్ల ఆందోళనకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్, గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, సహాధ్యక్షురాలు కుసుమకుమారి, కార్యదర్శి మనోహర్‌కుమార్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి
తరలివచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవీ
⇒ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి
⇒ విద్యాహక్కు చట్టంలోని 23(1) సవరించాలి
⇒ టెట్ ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలి
⇒ బోధిస్తున్న సబ్జెక్టుపైనే టెట్ నిర్వహించాలి
⇒ టెట్ మినహాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి


