అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి
వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇప్పటినుంచే పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఆ పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీ, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంటరీ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో గురువారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ (సర్) ప్రక్రియ, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ ఐడీ కార్డుల పంపిణీ, ‘వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన’పై ప్రచారం తదితర అంశాలపై నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. సర్ ప్రక్రియకు లభించిన అదనపు పది రోజుల గడువును పూర్తిగా సద్వినియోగం చేసుకుని, ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవాలని సూచించారు. డూప్లికేట్ ఓటర్ల జాబితాలను బూత్ స్థాయి ఏజెంట్లతో మరోసారి పరిశీలించాలని, మన ఓటర్లు పొరపాటున తొలగించబడి ఉంటే ఫారమ్–6 ద్వారా తిరిగి చేర్పించే ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు.
‘వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చే సూచనలను పరిశీలించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి. జిల్లా స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయి వరకు సమావేశాలు నిర్వహించాలి. ప్రతి యూనిట్‌లో పార్టీ పరిస్థితి, స్థానిక సమస్యలు, ఎన్నికల సన్నద్ధతపై చర్చ జరగాలి. ప్రతి కార్యక్రమానికి పక్కా క్యాలెండర్ ఉండాలి. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలి. మనం సిద్ధంగా ఉన్నామనే స్పష్టమైన సందేశం ప్రజల్లోకి వెళ్లాలి. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగాలి’ అని సజ్జల పిలుపునిచ్చారు.


