ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా... మీడియా సాక్షిగా ఎలాంటి అవకతవకలు బయట పడుతున్నా ‘స్వచ్ఛమైన’ ఓటర్ల జాబితా రూపకల్పన పేరిట ఎన్నికల సంఘం(ఈసీ) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో మూడో దశ పూర్తయింది. ఈసారి 16 రాష్ట్రాలూ, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 36.73 కోట్లమంది ఓటర్ల జాబితా లను జల్లెడబట్టి 6 కోట్లమందిని తొలగించినట్టు ఈసీ ప్రకటించింది. ఈ ప్రక్రియకు తొలి దశలో వచ్చినంత వ్యతిరేకత మలి దశలో లేదు. న్యాయస్థానాలు ఏవో కొన్ని ఆదేశాలీయటం మినహా ప్రక్రియను ఆపింది లేదు. మొదటి రెండు దశలతో పోలిస్తే మూడో దశ పెద్దగా అభ్యంతరాలు లేకుండానే పూర్తయినట్టు లెక్క. మొత్తంగా ఈ మూడు దశల్లోనూ 13 కోట్లమంది గల్లంతయ్యారు. దానర్థం వీరంతా అసలే లేకుండా పోయారని కాదు. జాబితాలో లేనివారు అభ్యంతరాలు చెబితే... ఈసీ అడిగిన పత్రాలు సమర్పించు కుంటే మళ్లీ చోటు దక్కించుకునే చాన్స్ ఉండొచ్చు. కానీ ఆ పత్రాల కోసం దూర ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే ఓపిక ఉండాలి.
అందుకు కావలసిన తీరిక, సహనం ఉండాలి. ఖర్చు పెట్టగలిగే స్థోమత ఉండాలి. వారం, పదిరోజులు పనికి వెళ్లకున్నా కుటుంబం గడుస్తుందన్న భరోసా ఉండాలి. ఇంత చేసినా వచ్చే ఎన్నికల్లో ఓటేసే యోగం దక్కుతుందని అనుకుంటే అమాయకత్వమే. బెంగాల్‌లో ఒక అక్షరం ఇటూ అటూ అయినా జాబితాల్లో చోటుదక్కని వారు లక్షల్లో ఉన్నారు. ‘తార్కిక వ్యత్యాసాల’ పేరిట జాబితాల నుంచి వీరందరినీ వెళ్లగొట్టగా, 38 లక్షలమంది 19 ట్రిబ్యునళ్ల ముందు అప్పీల్ చేసుకున్నారు. ఇందులో కేవలం 82,000 మందికి ఊరట దొరికింది. పరిష్కరించిన అప్పీళ్లలో 90 శాతం మందికి తిరిగి చోటు దక్కింది. కానీ ఏం ప్రయోజనం... రాబోయే ఎన్నికల్లో తప్ప వీరు ఓటేయలేరు. వేలాది కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఎగ్గొట్టే వారిపై దయ చూపి ‘హెయిర్ కట్’ పేరిట మాఫీ చేస్తారు. ఓటర్ల జాబితాలకు ఈసీ చేసే ఈ ‘హెయిర్ కట్’ నిరుపేదలతో నిర్దయగా వ్యవహరిస్తుంది. వారిని కష్టాలపాలు చేస్తుంది.
బిహార్‌లో ‘సర్’పై విచారణ సందర్భంగా ‘విపక్షాలు హడావుడి చేస్తున్నాయి... మరి స్వల్ప సంఖ్యలో మాత్రమే అభ్యంతరాలు ఎందుకొస్తున్నా’యని ధర్మాసనం ప్రశ్నించింది. సహేతుకమైన సందేహమే. కారణాలనేకం. తమ ఓటరు కార్డు కేవలం ఎన్నికల సమయంలోనే అక్కరకొస్తుందని అనేకులు అనుకుంటారు. పోలింగ్ రోజున వెళ్లినప్పుడు మాత్రమే ఓటు గల్లంతయిందని తెలుస్తుంది. ఇదంతా మన పాలకుల నిర్వాకం. అవిద్య రాజ్యమేలేచోట ఏ ప్రచారమూ జనానికి పూర్తిగా చేరదు. ‘నిజాయితీగల’ ఓటర్లమేనని నిరూపించుకునే భారం ప్రజలకు వదిలితే ఎక్కడైనా జరిగేది ఇదే! చిన్న చిన్న లోపాలు మినహా అంతా సవ్యంగా చేశామని ఈసీ స్వోత్కర్షలకు పోతోంది. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. ఇందుకు ఒక ఆంగ్ల దినపత్రికలో జార్ఖండ్ గురించి వచ్చిన కథనమే తార్కాణం. అక్కడ గొడ్డా జిల్లాలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా జాబితా ప్రకటించాక ఫలానా వారి పేర్లు తొలగించాలంటూ బీజేపీ ఏజెంట్లు ఫామ్–7 పత్రాలు సమర్పించినట్టు ఆ పత్రిక వెల్లడించింది.
ఒక కేంద్రంలో ఇలాంటివి 25 దాఖలయ్యాయి. వారిలో ఒకే ఒక్కరు మూణ్ణెల్లక్రితం మరోచోట కూలీ పని కోసం వెళ్లారు. మరోచోట ఒక బీజేపీ ఎమ్మెల్యే 75 ఫామ్‌లు సమర్పించారు. చిత్రమేమంటే... అవన్నీ మైనారిటీల ఓట్లు. వాటిలో అత్యధికం 2003 జాబితాతో మ్యాపింగ్ అయ్యాయి. ఇక వేరే జిల్లాల్లో ఏం జరిగిందో... అసలు ‘కొత్తగా చేరుతున్న’ వారెవరో తెలియదు. ఓటు లేకపోవటం మరణంతో సమానమని అనేకులు నమ్ముతారు. బీఎల్‌ఓ వెళ్లినప్పుడు ఇంట్లో లేనంత మాత్రాన ఓటరే ఉనికిలో లేడన్న నిర్ణయానికి రావటం క్రూరం. ఎందుకంటే ఈసారి ఓటు పోవటమంటే సంక్షేమ పథకాలు ఆగిపోవటం,ముందూ మునుపూ పౌరసత్వం కూడా మాయం కావటం. కొన్ని ప్రభుత్వాలు సంక్షేమా నికి ఓటర్ల జాబితా గీటురాయి కాబోదని హామీ ఇస్తున్నాయి గానీ... అది దయాధర్మ బిక్షంగా మారటం సాధారణ పౌరుణ్ణి అవమానించటం. రేపన్న రోజున అలాంటి వారందరికీ పథకాలు ఆపేయాల్సిందేనంటూ ఆదేశాలు జారీ కాబోవని చెప్పలేం. ఆ మాటెలా వున్నా ఓటరును పోలింగ్ కేంద్రం వైపు రాకుండా ఇంత చక్కని మార్గం ‘కనిపెట్టిన’ ఈసీని అభినందించి తీరాలి!


